ఆనందం... ఇద్దరిదీ!

04-03-2019: లైంగిక జీవితం పట్ల మహిళల్లో ఎన్నో అనుమానాలు, భయాలు, అర్థం లేని అపోహలు సహజం. అయితే ఆనందకర లైంగిక జీవితం కోసం ప్రతి మహిళా కొన్ని నియమాలు పాటించాలి అంటున్నారు సెక్సాలజిస్ట్‌ డాక్టర్‌ షర్మిలా మజుందార్‌
 
ఇష్టం ఉందా?
సెక్స్‌లో పాల్గొనబోయే ప్రతిసారీ, ఇష్టంగా చేస్తున్నారా? లేక భాగస్వామి ఒత్తిడి మేరకు పాల్గొంటున్నారా? అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. భాగస్వామిని నొప్పించకూడదనో, తగాదా పడడం ఇష్టం లేకనో, అయిష్టంగానే సెక్స్‌లో పాల్గొనే పరిస్థితి వస్తుంది. ఇలాంటి స్థితిలో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు సంతృప్తి కలగడం కష్టం. ఇదే స్థితి కొనసాగితే ఫీలింగ్స్‌ను మనసులో చంపుకున్న ఫలితంగా సిగ్గుతో కుంగిపోయే పరిస్థితి నెలకొంటుంది.
 
ఇద్దరూ ఆనందిస్తున్నారా?
ఎలా మొదలైనా, సెక్స్‌ చివరికి ఒకేలా ముగుస్తుంది. అయితే అది మీకు నచ్చిన విధంగానే ముగుస్తోందా? కొంతమందికి తమకు నచ్చని ధోరణిలోనూ సెక్స్‌ ముగుస్తూ ఉండవచ్చు. ముఖరతి ఇష్టం లేకపోయినా పాల్గొనవలసిన పరిస్థితి ఇద్దర్లోనూ ఉండవచ్చు. అలాంటప్పుడు ఒకరికి మాత్రమే ఆనందాన్ని ఇచ్చే పనిలో ఇద్దరూ కలిసి పాల్గొనడం ఎంతవరకూ సమంజసం? అనేది దంపతులిద్దరూ ఆలోచించాలి. ఇష్టానిష్టాలను నిర్మొహమాటంగా వ్యక్తపరచాలి.
 
ఎంత సమయం?
సెక్స్‌కు కేటాయించే సమయం గురించి చింత వదిలేయాలి. అందుకు కేటాయిస్తున్న సమయం గురించిన ఆలోచన లేకపోతేనే, భార్యాభర్తలు తరచుగా సెక్స్‌లో పాల్గొనగలుగుతారు. అయితే లైంగిక చర్యను ఒక ప్రహసనంగా భావించడం కూడా కరెక్టు కాదు. వారం మొత్తం పలు రకాల పనులతో తీరిక లేకుండా ఉన్నా, దొరికిన కొద్ది సమయాన్నైనా సెక్స్‌కు కేటాయిస్తూ ఉండాలి. ఇందుకోసం ఒకరి వెసులుబాటును, సెక్స్‌లో పాల్గొనాలనే కోరికను అడగడం ద్వారా వ్యక్తపరుస్తూ ఉండాలి. ఇందుకోసం ‘ఈ రోజు ప్రయత్నిద్దామా? అనో, లేక ఈ రోజు ఆసక్తి ఉందా?’ అనో అడగాలి.
 
భావప్రాప్తి అవసరమే! అయినా...
లైంగిక క్రీడలో భావప్రాప్తి పొందడం లక్ష్యమే అయినా, దాన్ని పొందే పోరాటంలా సెక్స్‌ కొనసాగకూడదు. భావప్రాప్తి పొందడానికి వీలుగా మనసును, శరీరాన్ని ఓపెన్‌గా ఉంచి, అనుభూతిని ఆస్వాదించాలి. ఆ సందర్భం, సమయం ఆసన్నమైతే భావప్రాప్తి సొంతమవుతుంది. భావప్రాప్తికి మించి శరీరంతోపాటు, మనసులూ కలిసి, అనుబంధం బలపడే వీలున్న సంగమంగా సెక్స్‌ను భావించాలి.