కల్పనల రాత్రి!

మొగుడు చేయి వేయగానే... కొత్తపెళ్లాం తమకంతో కళ్లు మూసుకోవాలిగా! మూసుకోలేదు. ఆబగా హత్తుకుపోవాలిగా! హత్తుకుపోనూ లేదు. రెచ్చిపోవాలిగా! 

రెచ్చిపోనూలేదు. 
 
‘తొలినాటి రేయి తడబాటు పడుతూ మెలమెల్లగా నీవు రాగా..’
‘ఇలాగే ఉంటుందా తొలిరేయి అన్నదీ, అలాఅలా అలా మనసు తేలిపోతున్నదీ’
‘ఇది తొలి రాత్రీ... కదలని రాత్రీ’
... అర్జున్‌కు తెలుగు సినిమాల్లోని తొలిరాత్రి పాటలన్నీ కంఠతా వచ్చు. ఏ డైరెక్టరు ఆ దృశ్యాన్ని ఎలా చిత్రిస్తాడన్నదీ పక్కాగా చెప్పేస్తాడు. మూడ్‌ వచ్చినప్పుడల్లా ఆ పాటలే పాడుకునేవాడు. ఆ దృశ్యాలే ఊహించుకునేవాడు. ఇది ఈనాటి కథ కాదు.
కౌమారంలోకి అడుగుపెట్టగానే, తొలిరాత్రి ఊహలూ కలల్లోకి ప్రవేశించాయి. ఒక చిత్రంలోంచి ఓ సీనూ, మరో చిత్రంలోంచి ఇంకో సీనూ... కట్‌ అండ్‌ పేస్ట్‌ చేసి తన తొలిరాత్రి ఎలా ఉండాలన్న విషయంలో పక్కాగా స్ర్కిప్ట్‌ సిద్ధం చేసుకున్నాడు.
ఆ ఊహల మధ్యే డిగ్రీ అయిపోయింది. పీజీ కూడా పూర్తయింది. పోటీపరీక్షలు రాసి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇక, పెళ్లి చూపుల తతంగం మొదలైంది. చాలా సంబంధాలే వచ్చాయి. ఎత్తు తక్కువనో, రంగు తక్కువనో, ఉద్యోగం నచ్చలేదనో... ఏదో ఓ వంకతో నో చెప్పేవాడు. అసలు కారణం మాత్రం- ఆ అమ్మాయిలెవరూ తన తొలిరాత్రి కలల్లోని హీరోయిన్‌లా లేకపోవడమే. ‘నీ పెళ్లి మా తద్దినానికొచ్చింది’ అంటూ తల్లిదండ్రులు చేతులెత్తేసే పరిస్థితి వచ్చేసింది. అంతలోనే సుప్రజ సంబంధం వచ్చింది. అమ్మాయి చదువుకుంది. చక్కగా పాడుతుంది. అన్నిటికీ మించి అందగత్తె. అందులోనూ, తన కలలరాణి పోలికలు ఉండటంతో అర్జున్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు.
పెళ్లి ఘనంగా జరిగింది. మంచి ముహూర్తం చూసి తొలిరాత్రి ఏర్పాట్లూ చేశారు. గది అలంకరణ విషయంలో తనే సూచనలు ఇచ్చాడు. పాత సినిమాల్లో లాగా పట్టెమంచమే కావాలన్నాడు. గులాబీలూ మల్లెలూ బుట్టల కొద్దీ తెప్పించాడు. అత్తరు పరిమళాలు గుప్పించాడు. తెల్లచీరా, తెల్ల ధోతీ స్వయంగా ఎంపిక చేశాడు.
ఆరోజు రానే వచ్చింది. అరగంట ముందే శోభనం గదిలోకి వెళ్లి కూర్చున్నాడు... సిగ్గు మొగ్గవుతూ ఆమె గదిలోకి అడుగుపెడుతుంది. తను ఎదురుగా వెళ్లి పట్టెమంచం దగ్గరికి తీసుకొస్తాడు. ప్రేమగా పాలగ్లాసు నోటి దగ్గర పెడుతుంది. తను ఓ గుక్క తాగి ఆమెతోనూ తాగిస్తాడు. ఆమె పెదాల మీద అంటుకున్న మీగడని తన పెదాలతో...
కట్‌...కట్‌...కట్‌! అలా ఏమీ జరగలేదు. 
అమ్మాయి పాలగ్లాసు తీసుకొచ్చింది కానీ, చికాకుచికాకుగా టేబుల్‌ మీద పెట్టింది. ‘అబ్బా! ఉక్కపోతగా ఉంది’ అని విసుక్కుంది. కొంచెం కూడా రొమాంటిక్‌ ఎక్స్‌ప్రెషన్‌ లేదు.
అనుకున్నదొక్కటి. అయినదొక్కటి. బోల్తాకొట్టిన బుల్‌బుల్‌ పిట్ట
అయిపోయాడు అర్జున్‌. మిగతా కార్యక్రమాన్ని అయినా స్ర్కీన్‌ప్లే ప్రకారం నడిపించాలని అనుకున్నాడు. అక్కడా నిరాశే! మొగుడు చేయి వేయగానే... కొత్తపెళ్లాం తమకంతో కళ్లు మూసుకోవాలిగా! మూసుకోలేదు. ఆబగా హత్తుకుపోవాలిగా! హత్తుకుపోనూ లేదు. రెచ్చిపోవాలిగా! రెచ్చిపోనూలేదు. మొహమాటం మొహమాటంగా దగ్గరికొచ్చింది. ఆ తర్వాతి కార్యక్రమమూ ఊహించినంత థ్రిల్లింగ్‌గా ఏం లేదు? జాగారం చేయాలన్న కోరికా నెరవేరలేదు. అరగంట లోపే అలసటగా తలవాల్చాడు. 
ఊహలు వేరూ వాస్తవాలు వేరూ. చూసే సినిమాలూ, చదివే కథలూ, వినే కబుర్లూ... మనసును పక్కదారి పట్టిస్తాయి. కలల్లో విహరింపజేస్తాయి. వాస్తవంలో అలా జరక్కపోయేసరికి నిరాశపడిపోతాం. దీనివల్ల మనం సంతోషంగా ఉండలేం, జీవితభాగస్వామినీ సంతోషపెట్టలేం. 
మనిషిని బట్టి, పెరిగిన వాతావరణాన్ని బట్టి ఆలోచనలు ఉంటాయి. మనం ఆలోచించినట్టే, మన జీవితభాగస్వామీ ఆలోచించాలని లేదు. మనలోని భావుకతే ఆమెలోనూ ప్రవహించాలని ఎక్కడా రాసిపెట్టలేదు. 
జీవితం పట్లా, జీవన సహచరి పట్లా అంచనాలు ఉండటంలో తప్పులేదు. కానీ, ఆ మేడల్ని వాస్తవం అనే పునాదులపైన నిర్మించుకోవాలి... గాల్లోనో, మేఘాల మీదో కాదు. సినిమాల్ని చూసి అసలే కాదు.