‘మత్తుపార్టీ’కి ఓటేయకండి!

‘డాక్టరు గారూ! మా ఆయన మత్తుమందుకు అలవాటు పడుతున్నారు. మీరైనా వద్దని చెప్పండి’
... అంతకు మించి మాట్లాడ్డానికి, ఆ అమ్మాయి గొంతు పెగలడం లేదు. 
సమాధానం కోసం ఆ అబ్బాయి వైపు చూశాను.
‘ప్రొఫెషనల్‌ లైఫ్‌లో ఒత్తిడి పెరిగిపోతోంది. సెక్స్‌ లైఫ్‌ దెబ్బతింటోంది. తరచూ ఫెయిల్‌ అవుతున్నా... అందుకే’
అర్థమైంది. డ్రగ్స్‌ తీసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని ఎవరో తప్పుదోవ పట్టించినట్టున్నారు. ఆ కుర్రాడూ గుడ్డిగా పాటించినట్టున్నాడు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో. డ్రగ్స్‌ కారణంగా కాపురాలు కూలిపోతున్నాయి. యువతీ యువకులు దారితప్పుతున్నారు. ఓపియం, మార్ఫిన్‌, హెరాయిన్‌, కొకైన్‌, ఎల్‌ఎస్‌డి, కెటమైన్‌... ఇలా డ్రగ్స్‌లో రకరకాలు. 
ఈమధ్య ఏ పత్రిక తిరగేసినా రేవ్‌ పార్టీల కథనాలే. పార్టీ జరుగుతున్న హోటల్‌ మీద పోలీసులు దాడి చేశారనో, పార్టీలో పాల్గొన్న యువతీ యువకులు తప్పతాగి ఒకర్నొకరు కొట్టుకున్నారనో, చంపుకున్నారనో, పార్టీలో డ్రగ్స్‌ దొరికాయనో! అలాంటి వార్తలు చదివినప్పుడు అమ్మానాన్నల ఒళ్లు జలదరిస్తుంది... భయంతో! మొహాన్ని అరచేతుల్లో దాచుకున్న ఆ టీనేజర్స్‌లో తమ కూతురో, కొడుకో ఉన్నారేమో అన్న ఓ చిన్న అనుమానం! ఉండటానికి యాభైశాతం అవకాశం. ఉండకపోవడానికి కూడా యాభైశాతం అవకాశమే.
మాదకద్రవ్యాలు మనిషిని ఊబిలోకి లాగేస్తాయి. ఆ మత్తులో ఓ కొత్త ప్రపంచంలో కాలుపెడతాడు. అక్కడ తానే రాజు, తానే మంత్రి. మెల్లమెల్లగా ఆ కాల్పనిక జగత్తుకు గులాము అవుతాడు. డ్రగ్స్‌ బానిసత్వానికి ఎన్నో కారణాలు. కొంతమంది, నిజజీవితంలో సాధించలేని విజయాన్ని కాల్పనిక ప్రపంచంలో నిజం చేసుకోడానికి మత్తును ఆశ్రయిస్తారు. విశృంఖల శృంగారానికి దాన్నో సాధనంగా వాడుకుంటున్నవారూ ఉన్నారు. ఇదోరకం పిచ్చి. డ్రగ్స్‌ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయనే భ్రమలో బంధాల్ని బలిపెడుతున్నవారూ అనేకం. అత్యాచారాలకు తెగించడానికి మాదకద్రవ్యాల మత్తును ఓ ముసుగులా ధరిస్తున్న నవయువతకూ కొదవలేదు.
డేట్‌ రేప్స్‌... ఆధునిక జీవితపు విష సంస్కృతిలో ఓ భాగం. పరిచయమో స్నేహమో ఉన్న అమ్మాయిని... పార్టీకనో, షికారుకనో ఏ శివార్లకో తీసుకెళ్తారు. అక్కడ కూల్‌డ్రింక్‌లోనో, భోజనంలోనో జీహెచ్‌బీ (గామా హైడ్రాక్సీ బ్యుటైట్రేట్‌), కెటమైన్‌ లాంటి డ్రగ్స్‌ను కలిపి ఇచ్చేస్తారు. ఈ మాదకద్రవ్యాలు మహావేగంగా ప్రభావం చూపుతాయి. వీటికి లైంగికంగా రెచ్చగొట్టే గుణమూ ఉంటుంది. ఓరకమైన హిప్నాసిస్‌కు గురి చేస్తాయి. ఇంకేముంది, ఎదుటి మనిషి చెప్పినట్టే ఆడేస్తారూ పాడేస్తారూ. 
ఆదిమకాలం నుంచీ మనిషి తనలోని ఒత్తిళ్లనూ భయాలనూ వలువల్లా విప్పేసి... మానసిక దిగంబరత్వం కోసం తహతహ లాడుతున్నాడు. ఆ అన్వేషణలో కనుగొన్నవే డ్రగ్స్‌. మాదకద్రవ్యాల్లో మంచి చేస్తున్నవీ ఉన్నాయి. నొప్పి నివారణ చికిత్సలో ఔషధాలుగానూ శస్త్రచికిత్సల సమయంలో రోగిని అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లే సాధనాలుగానూ ఉపయోగపడుతున్నాయి. అయితే, ఇదంతా ఒకశాతమే. మిగతా తొంభైతొమ్మిది శాతమూ... మనిషిని బానిసను చేసుకుని ఆడించేవే. ఆ గమ్మత్తు దొరక్కపోతే బతకలేని పరిస్థితి. ఆ ముసుగు లేకపోతే, తలెత్తి సమాజాన్ని చూడలేని దుస్థితి. తన ప్రవర్తనను కూడా మాదక ద్రవ్యాలే నిర్ణయించేంత బలహీనుడైపోతాడు. కించిత్‌ మగత కోసం... ఎంతకైనా తెగిస్తాడు. 
ఫలితంగా మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మనిషిలోని మనిషి పూర్తిగా బలహీనుడవుతాడు. ఆ మేరకు లోలోపలి పశువు శక్తిమంతుడు అవుతాడు. తోటి మనుషులతో అనుబంధాన్ని పెంచు కోవాల్సినవాడు కాస్తా, మాదకద్రవ్యమే సర్వస్వమని భ్రమిస్తాడు. 
డ్రగ్స్‌ గురించి నా సుదీర్ఘ పరిచయాన్ని ముగిస్తూ, ఇలా ముక్తాయించాను... 
‘మనిషి మీద ప్రేమ పెరిగినకొద్దీ బంధం బలపడుతుంది. అదే మాదకద్రవ్యం మీద ప్రేమ పెరిగినకొద్దీ బానిసత్వం బలపడుతుంది. ఆ బానిస బతుకు మనకెందుకు? జీవిత భాగస్వామి పట్ల ప్రేమను మించిన మత్తు ఏ మాదకద్రవ్యంలోనూ దొరకదు. అందులోనూ అది... ఆరోగ్యకరమైన మత్తు!’ - 
అర్థమైందన్నట్టు తల ఊపాడా యువకుడు. 
ఆ కళ్లల్లో ఇప్పుడు మగత లేదు. 
ఆ స్థానంలో చైతన్యం!