నెట్టింట్లోకి బెడ్‌రూమ్‌

భారత్‌లో పెరుగుతున్న కొత్త ట్రెండ్‌
లైవ్‌లోకి దంపతుల ఏకాంత దృశ్యాలు
డబ్బు... కొత్తదనం కోసం పెడదారి

11-09-2018:‘సంసారం గుట్టు.. రోగం రట్టు’ ..అని నానుడి! అవును.. ఇది నిజంగా నాటి నుడే. ఇప్పుడు కాలం మారింది. పడగ్గదిలోకే కెమెరాలు చొచ్చుకొస్తున్నాయి. భార్యాభర్తల మధ్య మాత్రమే మధురానుభూతిగా ఉండాల్సిన శృంగారం.. అంగడి సరుకుగా మారింది. వ్యక్తిగత రహస్యంగా (ప్రైవేట్‌ మూమెంట్స్‌) ఉండాల్సిన లైంగిక బంధాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి ఆర్థిక వనరుగా మార్చుకుంటున్నాయి కొన్ని జంటలు!! ఇదేదో విదేశాల్లో జరుగుతున్న తంతు కాదు. మనదేశంలోనే.. మన చుట్టుపక్కలే.. జరుగుతున్న తతంగం.

లక్షల్లో సంపాదన..
ఒకప్పుడు రొమాంటిక్‌ కథలు, నవలలు కనిపిస్తే.. ఎవరికీ తెలియకుండా చదువుతూ ఆనందపడేవారు. 1980ల కాలంలో వీసీఆర్‌ల రూపంలో పోర్న్‌ భారతీయుల పడకగదిలోకి అడుగుపెట్టింది. సీడీ ప్లేయర్‌గా.. ల్యాప్‌టా్‌పల్లోకి చొరబడి.. ప్రస్తుతం సెల్‌ఫోన్లలోకి చేరిపోయింది. ఎవరైనా సరే ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదికాస్తా.. కుటుంబాల్లోకి చొచ్చుకొచ్చింది. దంపతులే స్వయంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇచ్చే స్థాయికి, కెమెరాల్లో ఏకాంత సన్నివేశాలను రికార్డు చేసే స్థితికి చేరింది.
 
ఫేస్‌బుక్‌, స్కైప్‌ వాట్సాప్‌, ఐఎమ్‌వో యాప్‌లలో లైవ్‌ ఇచ్చేస్తున్నారు. ఇందుకు వారు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. ముఖాలు కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారంతే! ఇలా లైవ్‌స్ట్రీమింగ్‌ ఇచ్చే వారి సంఖ్య రోజురోజుకు భారత్‌లో పెరిగిపోతోంది. కొన్ని వెబ్‌సైట్లు దంపతుల మధ్య జరిగే ఏకాంత దృశ్యాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. వీక్షకుల ఆధారంగా నెలకు లక్షల్లో చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం ఇలా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇచ్చే వెబ్‌సైట్లు గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో అత్యధికంగా చూస్తున్న వెబ్‌సైట్లను గమనిస్తే.. అలెక్సా ర్యాంకింగ్స్‌లో ఇలాంటివి 11, 15వ స్థానంలో ఉన్నాయి. వచ్చిన ఆదాయంలో వెబ్‌సైట్‌ నిర్వాహకులు 40 శాతం తీసుకుని మిగతా మొత్తాన్ని లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తున్న జంటకు ఇచ్చేస్తున్నారు.
 
భారత్‌లో ఇలా.. ఒక్కో జంట నెలకు రూ.లక్షల్లో సంపాదించడం విశేషం. వీరిలో చాలా మంది డబ్బుల కోసం కంటే.. ఇతరుల నుంచి వచ్చే కామెంట్లను తెలుసుకోవడానికే చేస్తున్నారట. ఈ వింత సంస్కృతి వేగంగా విస్తరించడం పట్ల సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భర్తలు ఏకాంత దృశ్యాలను రికార్డు చేస్తున్నట్లు తెలిసినా భార్యలు సహకరిస్తుండటం గమనార్హం.
 
స్ట్రీమింగ్‌ నేరమే.. ఐదేళ్ల జైలు
మన చట్టాల ప్రకారం.. శృంగారాన్ని వీడియో తీసుకోవడం తప్పుకాదు. కానీ దాన్ని ప్రసారం చేయడం, ఇతరులకు పంపడం మాత్రం నేరమే. భాగస్వామి అంగీకారం లేకుండా వీడియోతీయడం కూడా తప్పే. 2008 ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67(ఏ) ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష.. రూ.10లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.