ఏ వయాగ్రా అయినా ఫలితం ఒకటే!

హార్మోన్‌ పరీక్షల్లో లోపం లేదని తేలితేనే ‘పినైల్‌ డాప్లర్‌’ టెస్ట్‌
షాక్‌వేవ్‌ థెరపీ వారానికి ఒక్కసారే!
ఏ వయాగ్రా అయినా ఫలితం ఒకటే!
55 ఏళ్ల లోపు వారికే షాక్‌వేవ్‌ థెరపీ!
అధిక మద్యపానం, ధూమపానంతో రక్తనాళాలు సంకోచించి, స్తంభన సమస్య తలెత్తుతుంది.
చికిత్సతో 4 నాలుగు నెలల్లో పరిస్థితి అదుపులోకి!
మధుమేహం అదుపులో ఉంచుకుంటే పటుత్వ సమస్య తలెత్తదు!
 
‘వాడు మగాడ్రా బుజ్జీ’! ధైర్యసాహసాలతో కూడిన ఏ పని చేసినా పురుషులందరూ అందుకునే ప్రశంస ఇది. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా మగతనాన్ని లైంగిక సామర్థ్యానికే అన్వయించుకుంటూ ఉంటారు పురుషులు. అంగ పటుత్వంపై పురుషులకుండే అర్థం లేని అనుమానాలు, అపోహలు ఎన్నో!
 
ప్రతి పురుషుడు జీవితంలో ఏదో ఒక సందర్భంలో అంగ స్తంభన సమస్యను ఎదుర్కోవడం అత్యంత సహజం. కానీ కారణం మరేదైనా తమ అంగంలో కచ్చితంగా సమస్య ఉందని నమ్మే పురుషుల శాతమే అధికం. అంగంలోని రక్తనాళాలు, నరాల సమస్యలు, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ లోపంతోపాటు ఒత్తిడి, ఆందోళన లాంటి మానసిక కారణాల పరంగా అంగం స్తంభించకపోవడం, స్తంభించినా ఎక్కువసేపు నిలవకపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే పురుషులు అసలు కారణం మీద దృష్టి పెట్టకుండా విపరీతమైన ఆందోళనకు లోనై, అర్హత, అనుభవం లేని వైద్యులను కలుస్తూ ఉంటారు. వారు సూచించే పరీక్షలు, చికిత్సలకు ఎక్కువ మొత్తాల్లో డబ్బు ధారపోస్తూ ఉంటారు.
 
70% సమస్యలకు చికిత్సలున్నాయి
రక్తనాళాలు, నరాల సమస్యలు, హార్మోన్‌ లోపాలు, మానసిక కారణాలు... ఈ నాలుగు కారణాల వల్ల తలెత్తే అంగ స్తంభన సమస్యలకు సమర్ధమైన చికిత్సలున్నాయి. తేలికపాటి చికిత్సతో ఈ సమస్యలను 70 శాతం వరకు నయం చేసే వీలుంది. నిజానికి తెల్లవారుజామున లేదా సెక్స్‌పరమైన ఆలోచనలు రాకపోయినా అంగస్తంభన కలుగుతుంటే సమస్య లేనట్టుగానే భావించాలి.
 
పరీక్షల ఖర్చు 6 నుంచి 7 వేలల్లోనే!
అంగ స్తంభన సమస్యను నిర్థరించే పరీక్షలు రెండు. హార్మోన్‌ పరీక్ష, పినైల్‌ డాప్లర్‌... ఈ రెండు పరీక్షలతో సమస్య ఉందో లేదో తేలికగా గుర్తించవచ్చు. ఇంతకుమించి మరే రకమైన పరీక్షలు చేయించుకోవలసిన అవసరం లేదు. హార్మోన్‌ పరీక్షలో లోపం ఉంటే నోటి మాత్రలతో సమస్యను సరిదిద్దవచ్చు. ఒకవేళ ఆ పరీక్షలో ఏ లోపమూ లేదని తేలితే, తర్వాత ‘పినైల్‌ డాప్లర్‌’ టెస్ట్‌ చేయించుకోవలసి ఉంటుంది. ఇది ఎంతో సురక్షితమైన పరీక్ష. దీన్లో అంగానికి ఇంజెక్షన్‌ ఇవ్వవలసి ఉంటుంది. ఇంజెక్షన్‌ గురించి భయపడవలసిన అవసరం లేదు.
 
చికిత్స కూడా తేలికే!
అంగ స్తంభన చికిత్స ఎంతో సులువు. హార్మోన్‌ లోపం ఉంటే దాన్ని మందులతో సరిదిద్దవచ్చు. రక్తనాళాల్లో సమస్యలనూ అంతర్లీన కారణాలను సరిచేయడంతో సరిదిద్దవచ్చు. కొందరికి మందులతో రక్తనాళ సమస్య పరిష్కారం కాకపోతే ‘షాక్‌వేవ్‌ థెరపీ’ అవసరమవుతుంది. మానసిక కారణాలను కౌన్సెలింగ్‌తో సరి చేయవచ్చు. ఈ చికిత్సలతో ఒకటి నుంచి నాలుగు నెలల్లోపే సమస్య సర్దుకుంటుంది. వయాగ్రా లాంటి మందులతో కూడా సమస్య పరిష్కారం కాని వారికి మాత్రమే చిన్నపాటి సర్జరీ అవసరం కావొచ్చు.
 
మందుల ఖర్చు వందల్లోనే!
అంగ స్తంభన సమస్యలో వాడే మందుల ఖర్చు నెలకు రూ. 4 నుంచి 5 వేలు దాటదు. ఈ సమస్యలో వాడే ప్రధానమైన నోటి మాత్ర.... ‘వయాగ్రా’! పరిశోధన చేసి కనిపెట్టిన వాళ్లే వయాగ్రా తయారు చేస్తే, వాటిని ఒరిజినల్‌ వయాగ్రా అనడం వాడుకలో ఉంది. ఇవి విదేశాల నుంచి దిగుమతి అవుతూ ఉంటాయి. అయితే అదే ఫార్ములాతో ఇతర కంపెనీలు తయారుచేసే నార్మల్‌ మాత్రల ప్రభావం స్వల్పంగా (10%) తక్కువే అయినా, ఏ మాత్రం నాణ్యమైనవి కావు అని చెప్పడానికి లేదు. రెండూ దాదాపుగా సమానమైన ఫలితాన్నే ఇస్తాయి. అయితే కొందరు నకిలీ వైద్యులు ఒరిజినల్‌ మాత్రల పేరుతో 460 నుంచి 600 రూపాయల (ఒక మాత్ర) ఖరీదు ఉండే వయాగ్రా మాత్రలను సూచిస్తూ ఉంటారు. కానీ 30 రూపాయలకు దొరికే జెనరిక్‌ వయాగ్రాలూ అంతే సామర్థ్యంతో పని చేస్తాయి.
 
వైద్యులను ఎప్పుడు అనుమానించాలంటే?
వైద్యులను కలిసిన వెంటనే మొదటి కన్సల్టేషన్‌లోనే....
హార్మోన్‌ పరీక్షలేవీ చేయకుండానే అడ్వాన్స్‌డ్‌ టెస్టులు చేయాలని చెప్పినా...
అంగ స్తంభన సమస్యతో సంబంధం లేని 2డి ఎకో లాంటి హృద్రోగ సంబంధ పరీక్షలను సూచించినా...
‘మీకు చాలా పరీక్షలు అవసరం, చాలా డబ్బు అవసరమవుతుంది. అందుకు ఆర్థికంగా సిద్ధం కండి’... అని చెప్పినా...
 
వారానికి ఒకసారే ‘షాక్‌వేవ్‌ థెరపీ’
పూర్తిగా శబ్ద తరంగాల ఆధారంగా పని చేసే ఈ థెరపీని మొదట్లో మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి, తక్కువ పౌనఃపున్యంతో ప్రసరించేలా చేసి, మధుమేహుల్లో మానని మొండి గాయాలు మాన్పడానికి వాడేవారు. ఈ థెరపీ వల్ల గాయాలున్నచోట కొత్త రక్తనాళాలు ఏర్పడి గాయం త్వరగా మానడానికి తోడ్పడడం వైద్యులు గమనించారు. దాంతో ఇదే థెరపీని రక్తనాళాల సమస్యలతో అంగ స్తంభన ఎదుర్కొంటున్న వారికీ ఉపయోగించడం మొదలైంది. కాబట్టి రక్తనాళ సమస్యలతో మాత్రమే అంగ స్తంభన సమస్య ఎదుర్కొంటున్నవారు, సమస్య ప్రారంభ దశలో ఉన్నవారు, మందులతో సమస్య నయం కాని సందర్భంలో మాత్రమే షాక్‌వేవ్‌ థెరపీని ఆశ్రయించవచ్చు. వారం రోజుల గ్యాప్‌తో 4 నుంచి 6 సెషన్లలో సమస్య నయమవుతుంది. ఒక్కో సెషన్‌కు ఏడున్నర వేల నుంచి 10 వేల వరకూ ఖర్చు అవుతుంది. ఈ థెరపీ 55 ఏళ్ల లోపు వాళ్లకు మాత్రమే!
 
-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,
ఆండ్రాలజిస్టు, ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.