ఈ ఇన్‌ఫెక్షన్‌ ఎందుకొస్తోంది?

24-09-2018: డాక్టర్‌! నా తొడల దగ్గర, లోదుస్తులు ధరించే ప్రదేశంలో నల్లబడి, దురద పెడుతూ పొట్టులా రాలుతోంది. ఎన్ని రకాల మందులు, లేపనాలు వాడినా ఈ ఇన్‌ఫెక్షన్‌ అదుపులోకి రావడం లేదు. అసలు ఇది ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌?
- ఓ సోదరుడు, ఖమ్మం
 
పురుషుల్లో సర్వసాధారణంగా కనిపించే ఇన్‌ఫెక్షన్‌ ఇది. కటి ప్రదేశంలో తలెత్తుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ‘గ్రోయిన్‌ ఇన్‌ఫెక్షన్‌’ అంటారు. ఇది ప్రమాదకరమైనది కాకపోయినా, తరచుగా చీకాకు పెడుతూ ఉంటుంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తడానికి కారణం చెమట! గాలి చొరబడని, బిగుతైన జీన్స్‌ ప్యాంట్లు వేసుకుంటూ, లోదుస్తులు కూడా అంతే బిగుతుగా, చెమట పీల్చని సింథటిక్‌ మెటీరియల్‌తో తయారైనవి ధరిస్తూ ఉండడమే! ఈ ఇన్‌ఫెక్షన్‌ను కలిగించే సూక్ష్మ జీవుల్ని సమూలంగా వదిలించుకోవాలంటే పాత లోదుస్తులన్నిటినీ పక్కన పెట్టి, కొత్తవి, కాటన్‌తో తయారైనవి వాడాలి. అవి బిగుతుగా కాకుండా సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. లోదుస్తులు పొడిగా ఉండాలి. తడి ఆరకుండా, తేమగా ఉన్నవి వేసుకోకూడదు. లోదుస్తులు ధరించే ప్రతిసారీ యాంటీఫంగల్‌ పౌడర్లు వాడాలి. పౌడర్‌ వాడేటప్పుడు కూడా ఆ ప్రదేశంలో తడి ఏమాత్రం లేకుండా చూసుకోవాలి. చాలామంది స్నానం చేసిన వెంటనే టవల్‌తో తుడుచుకుని, తడిపొడిగా ఉన్నప్పుడే పౌడర్‌ వాడేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పొడిగా తుడుచుకున్న తర్వాతే పౌడర్‌ వేసుకోవాలి. అలాగే లోదుస్తులను కూడా తరచుగా మారుస్తూ ఉండాలి. ఉతికిన వాటిని ఎండలో ఆరవేస్తూ ఉండాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే ‘గ్రోయిన్‌ ఇన్‌ఫెక్షన్‌’ను నివారించడంతోపాటు, తిరిగి తలెత్తకుండా చూసుకోవచ్చు.
 
డాక్టర్‌ రాహుల్‌రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.