పగబట్టిన పది వ్యాధులు

ఆంధ్రజ్యోతి,13-08-13:ప్రస్తుత ప్రపంచం రోగాలమయంగా మారింది. దగ్గు, తుమ్ములకు హడలెత్తిపోతున్న రోజులివి. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు, ఇతర ప్రైవేటు ఆర్గనైజేషన్లు వ్యాధుల ప్రభావం, ఫలితాలను బట్టి ఆయా దేశాలను బట్టి ఆ వ్యాధులకు ర్యాంక్‌లు ప్రకటించాయి. మనదేశంలో హృద్రోగాలకు ప్రథమస్థానం ఉండగా, అందరూ భయపడే ఎయిడ్స్‌కు మనదేశంలో నాలుగో స్థానం ఉంది.


ఇస్‌కెమిక్‌ హార్ట్‌ డిసీజెస్‌

వ్యాధుల్లో ఇది అతిపెద్ద సమస్య. ఎప్పుడైతే శరీరానికి ఆక్సిజన్‌, రస్తప్రసరణ సక్రమంగా జరగదో ఆ కారణంగా పుట్టుకొచ్చే వ్యాధి ఇది. హృదయ కండరాలకు రక్తప్రసరణ నిలిచిపోతుండటం దీనికి ప్రధాన కారణం. దేశంలోని ప్రతి వంద మందిలో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధి మధ్య వయస్కులు, వయసు పైబడివారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన వారు భవిష్యత్‌లో డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌(హైబీపీ),ఒబెసిటి వంటి అనారోగ్య లక్షణాలను ఎదుర్కోవల్సి వుంటుంది. ఛాతిలో తరుచూ నొప్పిగా ఉండటం, శారీరకంగా శ్రమించే సత్తువ తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2012లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చనిపోయింది ఈ వ్యాధి కారణంగానేనని అనేక సర్వేలు చెబుతున్నాయి. 

సెరబ్రో వాస్క్యులర్‌ డిసీజ్‌

మెదడుకు రక్తప్రసరణ చేసే రక్తనాళాలు బ్లాక్‌ అయిపోయినప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుంది. అలా ఎక్కువ సేపు రక్తప్రసరణ ఆగిపోతే మెదడు కణాలు చనిపోతాయి. ఆ తరువాత హైబీపీతో అనేక అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి. 

దిగువ శ్వాస సంబంధ వ్యాధులు(లోయర్‌రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌)

ఈ వ్యాధి బారినపడితే నడవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తుమ్ములు, ముక్కు కారడం, తలనొప్పి, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయి. ఊపిరితిత్తులతో వైరస్‌ లేదా బ్యాక్టీరియా అభివృద్ది చెందడం వల్లే ఇలాంటి శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయి.

హెచ్‌.ఐ.వీ

చికిత్స లేని వ్యాధిగా హెచ్‌ఐవీ ఎంతోమందిని బలితీసుకుంది. హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి సహజమైన జలుబు సోకినా అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఈ బగ్‌ వైరస్‌ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇన్ఫెక్షన్‌పై పోరాడే టీ-సెల్స్‌, సీడీ4 సెల్స్‌ పోరాటం ఆపేస్తాయి. ఆ తరువాత శరీరంలోకి ఎన్ని రసాయనాలు ఎక్కించినా రోగనిరోధక శక్తిని పెంచే అవకాశం ఉండదు.

సీవోపీడీ(క్రానికల్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మ్‌నరీ డిసీజెస్‌)

ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. గాలి మార్గాలు కుచించుకుపోవడం వల్ల జరిగే అనర్థమే సీవోపీడీ. ఇందులో ప్రాథమికంగా కనిపించే లక్షణాలు ఏంటంటే, శ్వాస తీసుకునే సమయం తగ్గుతూ ఉంటుంది. దగ్గు ఎక్కువగా ఉంటుంది. గాలి ప్రసరణ తక్కువ మోతాదులో ఉండటం వల్ల ఆ ప్రభావం ఊపిరితిత్తులపై పడి ఆస్తమాకు దారి తీస్తుంది. ఇది మనదేశంలో ఐదో స్థానంలోఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆరోస్థానంలో ఉంది. 

ప్రసవకాల నిబంధనలు

దేశంలో ప్రసవకాల సమయంలో జరుగుతున్న మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్‌, రక్షణలేని అబార్షన్‌ వంటి కారణాల వల్ల  ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి మరణాలకు ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ వరకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే అంటున్నారు వైద్యులు. అవగాహన రాహిత్యం కూడా అనారోగ్యమే అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 

అతిసార వ్యాధులు

మితిమీరిన జనసందోహం వల్ల దుమ్ము, ధూళి రేగి ఈ వ్యాధి సంభవిస్తుంది. అతిసార వ్యాధి కారణంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ స్తంభించిపోతుంది. నీళ్ల విరోచనాలు ఎక్కువగా అవుతాయి. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ తెలుపుతున్న వివరాల ప్రకారం పెద్దవాళ్లు సంవత్సరంలో ఒక్కసారి డయేరియా బారిన పడుతుంటే, పిల్లలు మాత్రం ఏడాదికి రెండు పర్యాయాలు డయేరియాకు గురవుతున్నారు.

క్షయ రోగం

జ్వరం, అలసట, అధిక చెమట, వేగంగా బరువు తగ్గటం వంటి లక్షణాలు అన్నీ ఒకేసారి కనిపిస్తే అది క్షయరోగానికి సంకేతం అనుకోవాలి. టీబీ బ్యాక్టీరియా మొదట ఊపిరితిత్తుల్లో ప్రత్యక్షమై ఆ తరువాత మిగతా అవయవాలకు విస్తరిస్తుంది. అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారినపడుతున్నారని వైద్యరంగం చెబుతోంది. 

మలేరియా

దోమకాటు వల్ల వచ్చే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి లక్షమందిలో 10 కేసులు నమోదవుతున్నాయి. 300-500 మిలియన్ల కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు ఏడాదికి పది లక్షల మంది మలేరియా కారణంగా చనిపోతున్నారు.

శ్వాస నాళం, ఊపిరితిత్తుల క్యాన్సర్లు
ధూమపానం కారణంగా ఈ వ్యాధులు సంభవిస్తాయి. సిగరెట్లు/బీడీలు తాగేవారు బటయకు వదిలిన పొగను పీల్చుకోవడం వల్ల పక్క వాళ్లలోనూ(నాన్‌ స్మోకర్‌) ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మనదేశంలో ఏడాదికి 3000 మంది నాన్‌స్మోకర్స్‌  ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ప్రతి ఏడాది బ్రెస్ట్‌క్యాన్సర్‌, ఇతర క్యాన్సర్ల కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కారణంగానే ఎక్కువమంది చనిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి.