పెట్రేగుతున్న సూక్ష్మజీవులు

ఆంధ్రజ్యోతి,12-10-13:యాంటీ బయాటిక్స్‌కు ఇక సూక్ష్మక్రిములు లొంగని పరిస్థితి తలెత్తుతోంది. బ్యాక్టీరియా ముందు అనేక శక్తిమంతమైన ఔషధాలు నిర్వీర్యం అవుతున్నాయి. ఇది దేశంలో దారుణమైన పరిస్థితిని సృష్టించబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఈ ఆధునిక యుగంలో ‘అద్భుతమైన’ ఔషధాలుగా పేరుపడిన యాంటీబయాటిక్స్‌ సహాయంతో ఎటువంటి రోగాన్నయినా నయం చేయవచ్చని, రోగులకు ఎంతో ఉపశమనం కలిగించవచ్చని డాక్టర్లు ఇంత కాలంగా భావిస్తూ వస్తున్నారు. అయితే, వైద్యశాస్త్రంలోని ఈ పురోగతినంతటినీ ఇప్పుడు కొన్ని రకాల ‘అదృశ్య సూక్ష్మక్రిముులు’ గట్టిగా సవాలు చేస్తున్నాయి. మిల్లీమీటర్‌లో పది లక్షల వంతు ఉండే అత్యంత ప్రమాదకర సూక్ష్మక్రిములు క్రమంగా ప్రాబల్యం పెంచుకుంటూ, ఇన్ఫెక్షన్‌పై యుద్ధంలో యాంటీ బయాటిక్స్‌పై పైచేయి సాధిస్తున్నాయి. 
 
 కొత్త రకం యాంటీ బయాటిక్స్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలు ఒకపక్క కొనసాగుతుండగా మరోపక్క అనేకానేక ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్‌ కేసులు రాను రానూ ప్రబలమైపోతున్నాయి. శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు, ప్రమాదాలకు గురైనవారు మొదటగా యాంటీ బయాటిక్స్‌ను వాడితే తప్ప ఇన్ఫెక్షన్ల బారి నుంచి బయటపడడం కష్టం. అయితే, గతంలో మూడు రోజుల డోసు కింద వాడాల్సిన యాంటీ బయాటిక్సే ఇప్పుడు మరిన్ని రోజులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతే కాదు, శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్‌పై పెట్టే ఖర్చు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరగబోతోంది. భారతదేశమైతే మరీ ఇరకాట పరిస్థితిలో ఉంది. దేశంలో యాంటీబయాటిక్స్‌కు లొంగని ఇన్ఫెక ్షన్‌ కేసులు పెట్రేగిపోతున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్స్‌కు ఏమాత్రం లొంగడం లేదని చెప్పడానికి అనేక నిదర్శనాలు కనిపిస్తున్నాయి. 
 
 ‘ఈ తీవ్రమైన, పెరుగుతున్న, ప్రాణాంతక ముప్పు’ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా 2010లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటిసారిగా ప్రపంచ దేశాలను హెచ్చరించింది. పైగా ‘ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే, రేపు చికిత్స ఉండదు’ అనే నినాదాన్ని కూడా ఈ సంస్థ సృష్టించింది. సాధారణ యాంటీబయాటిక్స్‌ను బ్యాక్టీరియా నిరోధిస్తున్న తీరు చూస్తే ఇక అతి త్వరలో ఆధునిక వైద్యం ముగింపుకు వస్తోందన్న ఆందోళన కలుగుతోంది. మనకు తెలిసిన ప్రతి యాంటీబయాటిక్‌ ఔషధమూ నిరుపయోగంగా మారుతోందని, శస్త్రచికిత్సలు చేయడం ప్రాణాంతకమవుతోందని నిపుణులు చెబుతున్నారు. అంటే, ‘‘గొంతు వాపు నుంచి మోకాళ్లకు తగిలే దెబ్బల వరకూ ప్రతి చిన్న సమస్యా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.’’ గత జనవరిలో దావోస్‌లో 2013లో జరిగిన ఓ సదస్సులో దీనిపై చర్చ జరిగింది. ఈ పరిస్థితి మానవాళి ఆరోగ్యానికి ఓ ప్రధానమైన ముప్పుగా పరిణమించబోతోందని, దీన్ని ఎదుర్కోవడానికి ప్రపంచం చాలావరకూ సిద్ధంగా లేదని సదస్సు వ్యాఖ్యానించింది.
 
 పెన్సిలిన్‌ను కనిపెట్టినందుకు 1945లో నోబెల్‌ బహుమతిని పొందిన అలెగ్జాండెర్‌ ఫ్లెమింగ్‌ కూడా యాంటీబయాటిక్స్‌ వల్ల బాక్టీరియా మరింత విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బాక్టీరియా అతి త్వరగా తమ సంఖ్యను పెంచుకుంటూ పోతుంది. ఎటువంటి ప్రతికూల వాతావరణాన్నయినా నిరోధించగల శక్తిని తమ తరువాతి తరాలకు వెనువెంటనే బదిలీ చేస్తూ పోతుంటాయి. ప్రకృతి సహజ పరిణామానికి సంబంధించి డార్విన్‌ నిర్వచించిన సూత్రానికి ఇది సరిగ్గా సరిపోతుంది. ‘‘ఒక పద్ధతి ప్రకారం లేదా ఒక కోర్సు ప్రకారం బ్యాక్టీరియాని అంతం చేయని పక్షంలో, ఈ బ్యాక్టీరియా పెరుగుతూ పోవడమే కాక, మందులను నిరోధించగల సత్తాను పుంజుకుంటుంది’’ అని నిపుణులు తెలియజేశారు. వ్యాధి ప్రాబల్యం అనేది మనలోనే నిద్రాణంగా పొంచి ఉందని, దానినే మెరుగుపరచుకోవడానికి ఇక ప్రయత్నించడం మంచిదని కూడా వారు తెలిపారు.