మీరు ఏ నీళ్లు తాగుతున్నారు..

మినరల్‌ కాదు.. జనరల్‌
వాటర్‌ ప్లాంట్ల ప్రమాణాలు గాలికి..
శరీరానికి అందని ఖనిజాలు
ఆ నీటిని తాగితే రోగాలే
అధికారుల పర్యవేక్షణ కరువు

2/21/2019:మంచినీళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్యాకెట్లు, సీసాలు, క్యాన్ల రూపంలో నీటిని విక్రయిస్తున్నారు. లీటరు నీరు అరలీటరు పాలధరతో సమానంగా అమ్మడవుతోంది. ఆ నీటిలో నాణ్యత ఎండమావి అయింది. మినరల్‌ వాటర్‌‌లో నాణ్యత ఉంటుందని ప్రజలు అదనంగా డబ్బులు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం మినరల్‌ వాటర్‌ మోజులో ప్రజలు చిక్కుకుని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. బడా కంపెనీలు సైతం మంచినీటి వ్యాపారాలు చేస్తున్నాయంటే అది ఎంత లాభసాటి వ్యాపారమో తెలుస్తోంది.

 
గూడూరు(నెల్లూరు జిల్లా): ప్రభుత్వం సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితమయం అవడం, జీవన శైలి మారడంతో అధిక శాతం మంది జనం క్యాన్‌వాటర్‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపు తున్నారు. కొనుగోలు చేసి నీటిని తాగడం కొందరికి హోదాగా మారింది. ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని వ్యాపారులు మినరల్‌ పేర జనరల్‌ నీటిని సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్‌లో లభ్యమవుతున్న మినరల్‌ వాటర్‌ను తాగడం ద్వారా భవిష్యత్తులో జనం రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఇటీవల జరిపిన వివిధ సర్వేలలో తేలింది. ప్రధానంగా శరీరంలో కాల్షియం తగ్గి ఎముకలు బలహీనపడతాయని వెల్లడైంది. శరీరానికి కావాల్సిన ఉప్పు, సోడియం, సల్ఫర్‌, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్‌ కొనుగోలు చేసిన నీటిలో లభ్యం కావు. మార్కెట్‌లో దొరికే నీటిలో ఖనిజాలు లేకపోవడంతో ఆ నీరు శరీరానికి ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదు.
 
ఇలా శుద్ధి చేయాలి
ఒక్క లీటరు నీటిని శుద్ధి చేయాలంటే సుమారు 3 లీటర్ల నీరు అవసరం. ప్రమాణాల ప్రకారం నీటిని బోర్ల నుంచి మాత్రమే సేకరించాలి. దీంతో ప్లాంట్‌లు ఉన్న ప్రాంతంలో భూగర్భజలాల నిల్వలు పడిపోతున్నాయి. ఆ ప్రాంతంలో నీటి కొరత ఏర్పడుతుంది. కెమికల్స్‌ ప్రభావం ఎముకలపై పడుతుందని నిపుణులు అంటున్నారు. 20 లీటర్ల క్యాన్‌ను నిర్దేశిత ప్రక్రియలో శుద్ధి చేయకుండా నింపుతున్నారు. క్లోరినేషన్‌, వడపోత, అలా్ట్ర ఫిల్టరైజేషన్‌, డీక్లోరినేషన్‌, అలా్ట్రవయొలెట్‌ స్టెరిలైజేషన్‌, రివర్స్‌ ఆస్మాసిస్‌ నుంచి ఓజోనేషన్‌ అవుతుంది. ఇలా దశల వారీగా శుద్ధి చేసిన నీటిని మాత్రమే సరఫరా చేయాలి. సీసాలను వేడినీరు, సోడియం, హైపోక్లోరైడ్‌లతో కడగాలి. పీహెచ్‌ 7 శాతం కంటే తగ్గకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ 7 శాతం కంటే తగ్గితే కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
 
శుద్ధి చేసిన నీటిని నిల్వ ఉంచేందుకు 304 గ్రేడ్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారు చేసిన డ్రమ్ములను వాడాలి. ఆ నీటిని ఓజోనైజేషన్‌ చేయాలి. నీరు పట్టేముందు అలా్ట్రవైరస్‌ కిరణాల ద్వారా శుద్ధి చేయాలి. అదేవిధంగా పొటాషియం పర్మాంగనేట్‌, హైపోసొల్యూషన్‌లతో కెమికల్‌ క్లీనింగ్‌ చేయాలి. అనంతరం పట్టిన నీటిని రెండు రోజులు నిల్వ ఉంచిన తరువాత మాత్రమే మార్కెట్‌లోకి పంపాలి. గరిష్టంగా ఆ నీటి కాలపరిమితి 21 రోజులు మాత్రమే ఉంటుంది. ఇలాంటి ప్రమాణాలను తు.చ. తప్పకుండా పాటించాలి. ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతున్న నీటిని ఈ ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయడం లేదనే ఆరోపణలున్నాయి. అలా చేస్తున్నారో లేదో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
నాణ్యమైన నీటిని అందించాలి
మినరల్‌ వాటర్‌ పేరుతో సరఫరా అవుతున్న నీటిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. వ్యాపారపరంగా కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉం చుకుని శుద్ధి చేసిన నీటినే విక్రయించాలి. మినరల్‌ వాటర్‌ని వినియోగించడం ఒక అలవాటుగా మారింది. ఈ తరుణంలో మంచి స్వచ్ఛమైన నీరు అందించేలా చర్యలు తీసుకోవాలి.
కే చంద్రశేఖర్‌

అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి

మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల పనితీరును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలి. ప్రజలకు మంచినీరు అందించేలా చూ డాలి. అంతేగానీ దీనిని ఒక వ్యాపార సాధనంగా వాడుకోకూడదు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాణంగా తీసుకుని స్వచ్ఛమైన మినరల్‌ వాటర్‌ అందించాలి.
నవీన్‌ జయకుమార్‌