మేనరికం పెళ్లి చేసుకుంటే ఇంత సమస్యా?

15-10-2019:మా నాన్న చెల్లెలిది మా ఊరే! అందువల్ల బాల్యం నుంచీ మా ఇల్లు, మా మేనత్త ఇల్లు ఒకటే అన్నట్లు పెరిగాను. అత్తయ్య కొడుకూ, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం. అలా హైస్కూలు దాకా అక్కడే గడిచింది. ఆ తర్వాత స్కూలు మారినా, అదే ఊళ్లో ఇంటర్‌ చదువుకున్నాం. కాబట్టి, మా అనుబంధంలో ఎక్కడా బ్రేక్‌ రాలేదు. ఇంటర్‌ తర్వాత మాత్రం ఆయన హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. నేనేమో జిల్లా టౌన్‌లోనే చదువు కొనసాగించాను. నిజం చెప్పాలంటే, టెన్త్‌లో ఉన్నప్పుడే మా హృదయాల్లో ప్రేమ బీజం పడింది. నేను అతణ్ణి ఎంతగా ప్రేమించానో, అతడూ నన్ను అంతగానే ప్రేమించాడు. పైగా, అతడు హైదరాబాద్‌కు వెళ్లిపోయాక ఆ ప్రేమ వెయ్యింతలు పెరిగింది. మా సాన్నిహిత్యం విషయంలో ఇరు వైపులా పెద్దవాళ్ల నుంచీ ఆక్షేపణలే రాలేదు. పెళ్లి విషయంలో కూడా మార్గం సుగమంగానే ఉన్నట్లు లెక్క.
 
కాకపోతే మేనరికం వల్ల కలిగే పిల్లలు రకరకాల వైక ల్యాలతో పుడతారనే ఒక సైంటిఫిక్‌ అంశం మా మధ్య వచ్చిపడింది. ఆ విషయమై బావకూ, నాకూ మఽధ్య చర్చ జరిగినప్పుడు ‘పిల్లల్ని కంటేనే కదా సమస్య. అసలు కనకుండా ఉంటే సరిపోతుంది కదా’ అనుకున్నాం. ఈ మాటే పరోక్షంగా మా మామయ్య దృష్టికి బావ తీసుకువెళితే, ‘అలా కుదరదు’ అని చాలా కరాఖండిగా చెప్పేశారు. పెద్దల మాట ఎలా ఉన్నా పిల్లల్ని కనడం తప్పనిసరి అయితే, పెళ్లే చేసుకోవద్దనేది మా రెండో ఆలోచన. ఒకవేళ అలా ఇద్దరమూ ఒంటరిగానే మిగిలిపోవాలనే నిర్ణయానికే వస్తే సమస్య ఉండకపోవచ్చు గానీ, అలా ఉండిపోవడం బావకు సాఽధ్యమవుతుందే తప్ప నాకు కాదు. ఎందుకంటే, ఇంట్లో ఒక్కతే ఆడపిల్లను. అందువల్ల జీవితాంతం అలా ఉండి పోవడాన్ని మా అమ్మానాన్నలు, మా నాయనమ్మ, తాతయ్య, చివరికి మా అన్నయ్య కూడా ఒప్పుకోరు. అలాగని నేను ఎవరినో చేసుకుని సుఖంగా ఉండిపోవడం అసాధ్యం. ఈ స్థితిలో నన్నేం చేయమంటారు?
కె. షాలిని, కర్నూలు

మేనరిక దాంపత్యంలో కలిగిన సంతానం నూటికి నూరుపాళ్లూ, అనారోగ్య సమస్యలతో పుడతారని కాదు గానీ అలా పుట్టే అవకాశాలైతే ఉన్నాయి. శాస్త్రీయంగా ఆ విషయం నిరూపితమైంది కూడా! ఎవరైనా తెలిసి తెలిసీ ఆ తెగింపు ఎందుకు చేయాలి? వాస్తవానికి మీలో కలిగిన ఆ రెండు ఆలోచనల్లో ఏ ఒక్కటీ ఆచరణాత్మకంగా లేవు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకుండా ఉండాలనుకోవడం గానీ, లేదా జీవితాంతం ఒంటరిగా ఉండి పోవాలనుకోవడం గానీ, ఈ రెండూ ఏ రకంగానూ అర్థవంతమైనవి కావు. అలా కాకుండా, మేనరికంలో కలిగిన కొంతమంది పిల్లలు ఆరోగ్య్డంగా ఉండడాన్ని చూసి చూద్దాంలే అనుకుని పిల్లల్ని కనడం దుస్సాహసమే అవుతుంది. అలాగని సంతానమే లేకుండా ఉండాలనుకోవడంలో కూడా అంత వివేకం లేదు. దానికి మీ పెద్దవాళ్ల ఆమోదం కూడా లేదు. అయినా, ఇప్పుడేదో ఒక భావోద్వేగంలో అలా అనుకుంటున్నారే కానీ, అదే భావనతో ఆ తర్వాత కూడా ఉంటారన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే కాలగతిలో అభిప్రాయాలు మారిపోతాయి. ఆలోచనలు మారిపోతాయి. నిర్ణయాలు మారిపోతాయి. అలా మారినప్పుడు ఇద్దరికి ఇద్దరూ జీవితమంతా మథనపడిపోవడమే మిగిలిపోతుంది. ఇక జీవితమంతా ఒంటరిగా మిగిలిపోవాలనుకునే భావన కూడా మీలో ఎంతో కాలం నిలవకపోవచ్చు. కొంత వయసు పైబడినాక ఆ ఒంటరిత నం కూడా మిమ్మల్పి ఇబ్బంది పెట్టవచ్చు.

పైగా ‘మా ఇంట్లో నేను ఒక్కతినే కూతురును కాబట్టి, ఒంటరిగా ఉండిపోవడం బావకు సాధ్యం అవుతుందే కానీ, నాకు సాధ్యం కాదు’ అని మీరే చెబుతున్నారు. ఏ వైపు నుంచీ సమర్థనీయం కాని, ఆలోచనల్నీ, నిర్ణయాల్నీ మీరెందుకు మోసుకు తిరుగుతున్నట్లు? వాస్తవానికి ప్రేమించుకున్న ప్రతి రెండు హృదయాలూ పెళ్లి దాకా వెళతాయన్న గ్యారెంటీ చాలాసార్లు ఉండదు. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని లౌకికమైన ఆలోచనలతో మరో కొత్త నిర్ణయానికి రావడం అవసరం. జీవితమంతా ఒంటరిగా ఉండిపోవడం మీకే కాదు. మీ బావకు కూడా సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మీకూ, మీ పెద్దలకూ జీవితమంతా అశాంతిని నింపే ఆలోచనలను, నిర్ణయాలను వదులుకోవడంలోనే మీ వివేకం ఉంది. అందువల్ల ఆ భావోద్వేగాలకు భిన్నంగా, సాధారణంగా ఆలోచించండి. సాధారణ నిర్ణయాలకే రండి. అది మీకూ, మీ వాళ్లకూ ఆనందాన్నిస్తుంది.
డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చింతపంటి
కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌, హైదరాబాద్‌