టమ్మీ ట్రబుల్స్‌....

ఆంధ్రజ్యోతి,12-10-15:జీర్ణ సంబంధమైన సమస్యలు తలెత్తడానికి బ్యాక్టీరియా, రకరకాల వైర్‌సలు కారణాలు.  మలబద్దకం, కడుపులో పోట్లు, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, డయేరియా, హార్ట్‌బర్న్‌, గ్యాసు వంటి సమస్యలు జీర్ణశక్తి బాగులేకపోవడం వల్లే వస్తాయి. వీటికి సరైన టైములో స్పందించకపోతే అది దీర్ఘకాలిక వ్యాధిలా పరిణమించే ప్రమాదం ఉంది. జీర్ణశక్తి బాగుండడానికి కొన్ని టిప్స్‌ ఉన్నాయి. 

 
చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు. ఇది మంచి లక్షణం కాదు. ఎందుకంటే ఒత్తిడి వల్ల కూడా జీర్ణశక్తి దెబ్బతింటుంది. ఒత్తిడి వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. అందుకే అన్నం తినే ముందర, తినేటప్పుడు, తిన్నతర్వాత ప్రశాంతంగా ఉండాలి. ధ్యానం, శ్వాససంబంధమైన ఎక్సర్‌సైజ్‌, సింపుల్‌ యోగ, వాకింగ్‌, హాయిగా నిద్రపోవడం, రిలాక్స్‌ అవడం లేదా నచ్చిన పని చేయడం ద్వారా ఒత్తిడిని
అధిగమించవచ్చు. 

 చాలామంది అన్నాన్ని నమలకుండా మింగేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. జీర్ణక్రియ అనేది నోట్లో అన్నం నమలడంతోనే మొదలవుతుందంటారు వైద్యనిపుణులు. అన్నం తినే ముందర గట్టిగా ఊపిరి పీల్చుకోవాలి. తర్వాత నిదానంగా అన్నం తినాలి. అన్నం తినేటప్పుడు బాగా నమలడం మర్చిపోవద్దు. మెత్తగా నమిలితే అది గొంతు నుంచి సులభంగా జారుతుంది. జీర్ణం కూడా సులభంగా అవుతుంది. అన్నాన్ని ఎంత బాగా నమిలితే అంత బాగా అది శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. ఆహారంలోని న్యూట్రియంట్స్‌ శరీర భాగాలన్నింటికీ అందుతాయి. అన్నాన్ని ఆస్వాదిస్తూ తినాలి తప్ప హడావిడిగా తినకూడదు. అలా తొందర తొందరగా తిన్నా అన్నం సరిగా జీర్ణం కాదు.

 అన్నం సులభంగా కాలేయంలో జీర్ణమవాలంటే బాగా నమిలి తినాలి. అప్పుడు కాలేయం కూడా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అలాగే సులభంగా జీర్ణమయ్యే ఆహారం అంటే సూప్స్‌, సలాడ్స్‌, కూరగాయలు, జ్యూసుల్లాంటివి ఎక్కువ తీసుకుంటే లివర్‌కు మంచిది. జీర్ణసంబంధమైన వ్యాధులు తొందరగా రావు. తీసుకునే ఆహారం కూడా నేచర్‌ ఫ్రెండ్లీ అయిండాలి. ప్రోసెస్డ్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి ఎంతో విషతుల్యమైనవి. లివర్‌ పనితీరును దెబ్బతీస్తాయి. వీటిల్లో ఉప్పు, సుగర్‌, ఆయిల్స్‌ ఎక్కువగా ఉంటాయి. జంక్‌ ఫుడ్స్‌ తొందరగా జీర్ణం కావు. 
 
 జీర్ణక్రియ బాగా జరగాలంటే నీళ్లు బాగా తాగాలి. అది కూడా సరైన సమయంలో. భోజనానికి అరగంట ముందర లేదా భోజనం చేసిన అరగంట తర్వాత నీళ్లు తాగితే మంచిది. ఇలా  చేయడం వల్ల అన్నం తినేటప్పుడు దాహం వేయదు. జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములు కూడా వాటి పని అవి సులభంగా చేసుకుపోతాయి. నీళ్లు తాగడం కష్టమనిపిస్తే వాటిల్లో కొద్దిగా తాజా పళ్లరసం కలుపుకుని తాగొచ్చు. లేదా నిమ్మకాయ ముక్కల్ని నీళ్లల్లో వేసుకుని తాగొచ్చు. పండ్లు, కూరగాయలు బాగా తీసుకుంటే మంచిది. డైట్‌లో ఫర్మెంటెడ్‌ ఫుడ్స్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే పెరుగులాంటివన్నమాట. 
 
 ప్రొబయోటిక్స్‌ అంటే హెల్తీ బ్యాక్టీరియా జీర్ణశక్తికి చాలా మంచివి. వీటి వల్ల జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి డయటరీ సప్లిమెంట్లలో ఉంటాయి. జీర్ణశక్తి బాగుంటే బరువు పెరగరు. ఎంతో ఎనర్జిటిక్‌గా, ఆరోగ్యంగా ఉంటారు.