ఆ సిండ్రోమ్‌కు ఈ డైట్‌తో చెక్‌

ఆంధ్రజ్యోతి:నేడు చాలామంది మహిళలు ‘పోలి సిస్టిక్‌ ఓవేరియన్‌ సిండ్రోమ్‌’ (పిసిఔస్‌) సమస్యతో బాధపడుతున్నారు. అన్ని వయసుల మహిళల్లోనూ ఈ సమస్య ఉంది. దీనివల్ల శారీరకంగా రకరకాల సమస్యలు తలెత్తుతాయి. వాటి గురించి  తెలుసుకుందాం.
 
‘పోలి సిస్టిక్‌ ఓవేరియన్‌ సిండ్రోమ్‌’ (పిసిఔస్‌)తో ఆధునిక మహిళలెందరో బాధపడుతున్నారు. దీనివల్ల వాళ్లు రకరకాల అనారోగ్య సమస్యల పాలబడుతున్నారు.  బహిష్టులు సరిగా రాకపోవడం, ముఖం , ఛాతీ, పొట్ట తదితర భాగాల్లో అవాంఛిత రోమాలు పెరగడం, చుండ్రు, యాక్నే, జిడ్డు చర్మం సమస్యలు తలెత్తడం, బరువు పెరగడం, బలహీనంగా ఉండడం, ఆకలి ఎక్కువగా వేయడం, జుట్టు రాలిపోవడం, సంతానం కలగకపోవడం, డిప్రషన్‌ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ తరహా  లక్షణాలు   కనిపిస్తే దాన్ని పిసిఔస్‌గా గుర్తించి  వెంటనే వైద్యుని సంప్రదించాలి.  ఇది ప్రధానంగా హార్మోనల్‌ డిజార్డర్‌. పిసిఔస్‌తో బాధపడేవారికి ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఎక్కువగా ఉంటుంది. అంటే వారి శరీరం ఇన్సులిన్‌ని సరిగా ఉపయోగించుకోదు. ఫలితంగా రక్తంలో ఇన్సులిన్‌ పాళ్లు ఎక్కువవుతాయి. ఇన్సులిన్‌ శాతం ఎక్కువ ఉండడం వల్ల మగవాళ్ల కుండే యాండ్రోజెన్‌ అనే హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా పైన పేర్కొన్న సమస్యలు తలెత్తుతాయి. 

ఎలాంటి డైట్‌ తీసుకోవాలి
ఆహారపు అలవాట్లలో మార్పుచేర్పులు చేసుకోవాలి.  వ్యాయామం చేయాలి. అలా చేయడంవల్ల  పిసిఔస్‌ సమస్య నుంచి కొంతవరకూ బయటపడగలరు.  శరీర బరువు తగ్గితే కూడా మంచిది. దీనివల్ల బహిష్ఠులు  క్రమం తప్పకుండా అవుతాయి.  బ్లడ్‌ షుగర్‌ క్రమబద్ధమవుతుంది. పిల్లలు పుట్టే అవకాశాలు  మెరుగుపడతాయి. 
 
ఏమి తినాలి?
చిరుధాన్యాలు ఎక్కువ తీసుకోవాలి. పళ్లు, కూరగాయలు,  తక్కువ ఫ్యాట్‌ లేదా కొవ్వేలేని పాలు, స్కిన్‌లెస్‌ చికెన్‌ బ్రెస్ట్‌ పీస్‌ , పోర్క్‌, చేప, పెరుగు,   వెన్నలాంటివి తినాలి. ఇలాంటివి తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ తక్కువగా ఉండడమే కాకుండా, శరీరంలోని ఇన్సులిన్‌ని సరిగా వినియోగించుకోగలరు. ఫలితంగా శరీరంలోని హార్మోన్ల ప్రమాణాలు కూడా మెరుగవుతాయి.  
 
ముఖ్యమైన డైట్‌ టిప్స్‌
అన్నం తినడం మానకూడదు. రోజుకు మూడుసార్లు మీల్స్‌ చేయాలి. మధ్యమధ్యలో స్నాక్స్‌  తినాలి.
ఆహారపదార్థాలను మారుస్తుండాలి. పళ్లు, కూరగాయలను కూడా తీసుకోవాలి.
తినే ఆహారంలో ప్రొటీన్లు బాగా ఉండాలి.   ఎగ్‌ వైట్స్‌, పోర్క్‌, చేప, స్కిన్‌లెస్‌ చికెన్‌ బ్రెస్ట్‌పీస్‌, చిరుధాన్యాలు, వెన్నలాంటివి తినాలి. రోజూ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి.  
 
జీవనశైలిలో మార్పులు
హార్మోన్లు సరిగా పనిచేయాలంటే నిత్యం 30 నిమిషాలు  నడవాలి. వేళకి నిద్రపోతే హార్మోన్ల పనితీరు   బాగుంటుంది. ఆహారాన్ని కూడా వేళకు తినాలి. అలా  చేయడం వల్ల హార్మోన్లు  ఆరోగ్యంగా పనిచేస్తాయి. హార్మోన్లకు ప్రొటీన్‌ ఫుడ్‌ చాలా అవసరం. 
 
 
పిసిఔస్‌ డైట్‌: 
ఉదయం ఆరుగంటలకు వ్యాయామాలు లేదా జాగింగ్‌ చేయాలి. రెండు ఖర్జూరాలు, నాలుగు వాల్‌నట్స్‌ తినాలి. 
ఉదయం 7 గంటలకు   250ఎంఎల్‌ సోయా మిల్కు తాగాలి. 
9 గంటలకు  బ్రేక్‌ఫాస్‌ చేయాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా  మెంతి పొడి, మిరియాలపొడి, నిమ్మకాయపిండిన వెజ్‌సలాడ్‌, సాంబారు లేదా చెట్నీతో రెండు ఇడ్లీలు తినాలి. 
11 గంటలకు  ఏదైనా పండు తినాలి.
మధ్యాహ్నం1 గంటకు భోజనంగా మెంతి పొడి, మిరియాలపొడి, నిమ్మకాయపిండిన వెజ్‌సలాడ్‌,  ఒక కప్పు బ్రౌన్‌ రైస్‌, పప్పు, ఆకుకూరలు, పెరుగు తినాలి.
సాయంత్రం 5 గంటలకు  ఒక పండు, 30 గ్రాముల నట్స్‌ తినాలి. గ్రీన్‌టీ తాగాలి. 
రాత్రి 8 గంటలకు లంచ్‌లో తీసుకున్న వాటినే తినాలి.
 
 
డా.జానకి
న్యూట్రిషనిస్టు,
హైదరాబాద్‌