వాసన వస్తోంది!

24-06-2019: నాకు 36 ఏళ్లు. గత రెండేళ్లుగా నా శరీరమంతా దుర్వాసన వేస్తోంది. స్నానం చేసిన అరగంటకే మళ్లీ వాసన మొదలవుతుంది. ఎంత ఖరీదైన పర్‌ఫ్యూమ్స్‌ వాడినా దాన్ని నిలువరించలేకపోతున్నాయి. అయిన వాళ్లు, ఆత్మీయులు కూడా నాకేసి చీదరింపుతో చూస్తున్నారు. నాకు దూరందూరంగా వెళుతున్నారు. ఇది నాకు చాలా అవమానకరంగా ఉంటోంది. నా సమస్యకు ఏదైనా పరిష్కారం చెప్పండి.
- కె. రమ్య, హన్మకొండ
 
మామూలుగా అయితే ఉక్కపోత వాతావరణంలో బాగా చెమట పట్టి చర్మంపైన బ్యాక్టీరియా చేరి శరీరం దుర్వాసన వేస్తుంది. నీరు తక్కువగా తాగడం వల్ల కొందరిలో ఈ సమస్య మొదలవుతుంది. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి దాదాపు 35 డిగ్రీల ఉష్ణోగ్రత్త అవసరం. దీనివల్ల చెమట రావడం సహజమే. మామూలుగా చెమటకు దుర్వాసన ఏమీఉండదు. కానీ, దానికి ఫ్యాటీ యాసిడ్స్‌ జతకూడినప్పుడు శరీరం దుర్వాసన వేస్తుంది. శరీరం చెడువాసన వేయడానికి బ్యాక్టీరియా ఒక్కటే కారణం కాదు. వీటితో పాటు, జన్యుసంబంధమైన కారణాలు కూడా ఈ సమస్యకు దారి తీస్తాయి. సహజంగా మన శరీరంలో రెండు రకాల స్వేదగ్రంఽథులు ఉంటాయి. ఎక్రైన్‌ గ్రంఽథులు ఒక రకమైతే, అపొక్రైన్‌ గ్రంథులు రెండవ రకం. మొదటి రకం గ్రంథులు మన శరీరమంతా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో ప్రఽధాన పాత్ర పోషిస్తాయి. రెండవ రకమైన అపొక్రైన్‌ గ్రంథులు చెవి వెనుక భాగంలో, చంకల్లో, బొడ్డుదగ్గర, ఉంటాయి. ఇవి ఎక్రైన్‌ గ్రంథుల్లా పలుచని స్వేదజలాన్ని కాకండా, చిక్కని ద్రవాన్ని విడుదల చే స్తాయి. ఆ ద్రవానికి బ్యాక్టీరియా చేరినప్పుడే దుర్వాసన వేస్తుంది.
 
నివారణగా.....
కొద్ది నీళ్లల్లో పుదీనా ఆకు వేసి ఉడికించి, ఆ నీటిని స్నానపు నీటిలో కలిపి స్నానం చేయాలి. చంకల్లో, రాపిడి జరిగే భాగాల్లో పూసుకునేందుకు కొంత పుదీనా ద్రవాన్ని పక్కకు పెట్టుకుని స్నానం తర్వాత ఆయా భాగాల్లో రాసుకోండి.
నీటిలో పటిక వేసి స్నానం చేస్తే తాజాదనంతో ఉంటుంది.
శరీరాన్నంతా ఏదైనా నూనెతో మర్థన చేసుకుని ఆ పైన సున్ని పిండితో రుద్ది స్నానం చేస్తే దుర్గంంధం తగ్గుతుంది.
కరక్కాయ, గంధక చూర్ణాలు సమానంగా కలిపి శరీరానికి పూసుకుని సున్నితంగా మర్థన చేసి స్నానం చేసినా దుర్గంధం పోతుంది.
వీటితో పాటు పళ్లు ఎక్కువగా తినాలి. నీళ్లు కూడా ఎక్కువగా తాగాలి.
ఈ సమస్య ఉన్న వాళ్లు సోయా ఉత్పత్తులు, మొక్కజొన్నలు, పల్లీలు, మొలకలు, గుడ్డు లాంటివి చాలా పరిమితంగా తీసుకోవాలి.

-డాక్టర్‌ డి. ప్రశాంత్‌ కుమార్‌

ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్‌