పిల్లల్లో గురక

ఆంధ్రజ్యోతి,22-10-13:చిన్నపిల్లలు కొన్నిసార్లు ఏడ్చినా ముద్దుగానే అగుపిస్తారు. అనారోగ్యంతో మూతి ముడుచుకుని ఒదిగి ఒదిగి పడుకున్న ముద్దొస్తారు. కానీ, శ్వాస కోసం కష్టపడుతున్నప్పుడు మాత్రం తల్లిదండ్రులు తట్టుకోలేరు. శ్వాస తీసుకోవడం కోసం బలవంత పడుతున్న సమయంలో గురక కూడా వస్తుంది. ఆ గురక శబ్దమే పిల్లల ఇబ్బందికి కొలమానం. శ్వాసనాళం ఎంత మూసుకుపోతే అంత ఎక్కువ శబ్దం వస్తుంది. అంటే గాలి పీల్చుకోవడానికి, వదలేయడానికి పిల్లల ఎంతో శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. అది వాళ్లకు భారమైన పని. దాన్నుంచి తొందరగా విముక్తి కలిగిస్తేనే వాళ్లకు ప్రాణం తేలిగ్గా ఉంటుంది. ఫ్యామిలీ అంతా ప్రశాంతంగా ఉంటుంది. అసలు పిల్లల్లో ఈ గురక సమస్యను వైద్య పరిభాషలో ఏమంటారో తెలుసా? లారింగో మలేసియా!

లారింగో మలేసియా

కొద్దిమంది పిల్లల్లో శ్వాస తీసుకునే నాళంలోని ఒక భాగం బలహీనంగా ఉండటం, శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం... ముఖ్యంగా ఆ శబ్దం చిన్నారులు మెలకువగా ఉన్నప్పుడు, ఇతరత్రా ఇన్ఫెక్షన్లు(దగ్గు, జలుబు వంటివి)ఉన్నప్పుడు, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎక్కువ కావచ్చు. ఇలా ఎక్కువ శబ్దం రావడాన్ని వైద్య పరిభాషలో స్ట్రయిడర్‌ అంటారు. పిల్లల్లో 60శాతం మందిలో స్ట్రయిడర్‌ రావడానికి కారణం లారింగో మలేసియానే. ఇటువంటి పిల్లల్లో శ్వాస సంబంధమైన సమస్యలు పుట్టిన రెండో వారం నుంచే మొదలవుతాయి. ఆర్నెల్ల వయసు వచ్చేనాటికి తీవ్రతరం అవుతాయి. చాలామందిలో ఇది క్రమేణా తగ్గుముఖం పట్టడం, పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడం జరుగుతుంది. ఈ మెరుగుదల ఎప్పుడైనా మొదలు కావచ్చు.

నిర్ధారణ పరీక్షలు

అయితే కొద్దిమంది పిల్లల్లో లారింగో మలేసియాతో పాటు దగ్గు, వాంతులు కనిపించే లారింగో ఫ్యారింజియల్‌ రిఫ్లక్స్‌ అనే కండీషన్‌తో సమస్య తీవ్రతను చూపించవచ్చు. ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు నీలంగా మారడం, దీర్ఘకాలిక శ్వాస కోశ సమస్యలను ఎదుర్కోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు ఇతర రకాల సమస్యలైన సబ్‌గ్లాటిక్‌ స్టెనోసిస్‌, లారింజియల్‌ వెబ్స్‌, బ్రాంకియో మలేసియా వంటి కండిషన్‌లలోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. అయితే ఏ విషయమో నిర్ధారించేందుకు కొన్ని పరీక్షలు చేయిస్తే మంచిది. అందుకోసం ఫ్లెక్బిబుల్‌ లారింగోస్కోపి, రెడియోగ్రాఫిక్‌ స్టడీస్‌ చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు అందించే చికిత్స.... పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత, శ్వాస తీసుకునే సమయంలో ఇబ్బందిని ఏ మేరకు భరిస్తున్నారు, పిల్లల్లో ఉన్న ఇతర వైద్య సమస్యలు, ముఖ్యంగా ఈ జబ్బు వల్ల కుటుంబంపై పడుతున్న మానసిక ఒత్తిడి తీవ్రత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాప/బాబు లారింగో మలేసియాతో బాధపడుతున్నాడని నిర్ధారణ అయితే శస్త్రచికిత్స ద్వారా నయం చేయవలిసిందే.

గాఢనిద్ర కోసం... 

మారిన జీవన పరిస్థితుల్లో గాఢనిద్ర అనేది కరువైపోతోంది. ఆహారపు అలవాట్లు, పనివేళలు, గాఢనిద్రను మనిషి నుంచి దూరం చేస్తున్నాయి. ఫలితంగా ఎంతోమంది మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అనేక బాధలు అనుభవించాల్సి వస్తోంది. అసలు ఈ రోజుల్లో గాఢనిద్ర అనేది సాధ్యమవుతుందా? అనేది పెద్ద ప్రశ్న. కాని ప్రయత్నం చేస్తే మంచి ఫలితమే ఉంటుందని రిపోర్టులు, సర్వేలు చెబుతున్నాయి. అయితే ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గాఢనిద్ర పట్టాలంటే ఏం చేయాలి? అనేది. అందుకోసం కొన్ని పద్ధతులను పాటించాలి. కొన్నింటిని వదిలేయాలి. అప్పుడే గాఢనిద్రను పొందడానికి అవకాశం ఉంటుంది. 

ఇలా చేయాలి
రాత్రి పడుకోబోయే ముందు మంచి సంగీతం లేదా మంచి పుస్తకం చదవాలి.
తలకీ, అరికాలికీ నువ్వుల నూనెతో మర్ధనా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
పడుకోబోయే ముందు ఓ పావుగంట మెడిటేషన్‌ చేస్తే చాలా మంచిది.
ఖర్జూరాలు, బాదం పప్పులను నీటిలో నానబెట్టి, వాటికి కొద్దిగా గులాబీ రేకులు కలిపి ముద్దగా నూరుకొని.దాన్ని నీటిలో వేసి మరిగించి.. వేడిగా తాగితే సుఖనిద్రకు మార్గం సుగమమవుతుంది.

చేయకూడనివి

నిద్రపోవడానికి కనీసం గంట ముందు ఎలాంటి సుత్తి కబుర్లు, పనులూ పెట్టుకోవద్దు.అరచేతిలో ఇమిడిపోయే చిన్నసెల్‌ఫోన్‌ ప్రస్తుత పరిస్థితుల్లో మీ గాఢ నిద్రను దూరం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకని సెల్‌ఫోన్‌ను పడుకునే ప్రదేశానికి దూరంగా పెట్టండి. వీలయితే స్విచ్‌ ఆఫ్‌ చేయడం మంచిది.పడుకునే ముందు టీ, కాఫీలాంటివి తాగకూడదు.భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. నిద్రపోవడానికి కనీసం గంట ముందన్నా రాత్రిభోజనం పూర్తి చేయాలి.