షాక్‌ ట్రీట్‌మెంట్‌ మంచిదేనా

ఆంధ్రజ్యోతి,19-12-13:సినిమాల్లోనో, టీవీల్లోనో చూపించినట్టుగా ఎలకో్ట్ర కన్వల్సిన్‌ థెరపీ(ఈసీటీ)...వాడుక భాషలో షాక్‌ట్రీట్‌మెంట్‌... అంత భయంకరమైనది, ప్రమాదకరమైనది కాదని అంటున్నారు వైద్య నిపుణులు. ఈ పద్ధతిని  ఎనిమిది దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న అనేకమంది తిరిగి సాఽధారణ స్థితికి రావడానికి ఈసీటీ ఎంతో ఉపయోగపడింది. ఏటా దాదాపు లక్షమందికి పైగా ఈ చికిత్సను పొందుతుండటం విశేషం. అయితే ఈ షాక్‌ ట్రీట్‌మెంట్‌పై ఉన్న అపోహల్ని తొలగించుకోవడానికి దానిపై అవగాహనే ముఖ్యం అని చెబుతోంది వైద్యరంగం.

 
 రోగికి మత్తుమందు ఇవ్వకుండా.. తన కండరాలకు తగిన విశ్రాంతి కలిగించే మందులు ఇచ్చి ఈసీటీ చేయడం వల్ల పేషెంట్‌కు ఎలాంటి బాధ లేకుండా 20నిమిషాల్లో చికిత్స పూర్తి చేస్తారు. ఈసీటీ ఇచ్చిన తరువాత సుమారు రెండు గంటల పాటు రోగిని తమ పర్యవేక్షణలోనే ఉంచుకొని, మత్తుమందు ప్రభావం తగ్గాకే ఇంటికి పంపిస్తారు వైద్యులు. ఈసీటీ పూర్తిగా ప్రమాదరహితమైన ప్రక్రియ. ఈసీటీ వల్ల కలిగే ప్రయోజనాలే ఇటీవల ట్రాన్స్‌కేనియల్‌ మాగ్నెటిక్‌ స్టిమ్యులైజేషన్‌తో కలుగుతాయని కొత్త పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి ఈసీటీనే మరింత అధునాతనంగా ఎలా వాడుకోవచ్చో అనే పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
 
ఏడు దశాబ్దాల క్రితమే...

కరెంట్‌ షాక్‌ ద్వారా కొన్ని మానసిక వ్యాధులు నయం అవుతాయనే విషయం 1930వ దశకంలో తెలుసుకున్నారు. 1934లో డాక్టర్‌ మోడూనా అనే శాస్త్రవేత్త రోగులకు ఇంజక్షన్‌ రూపంలో క్యాంఫర్‌ను  ఇవ్వడం వల్ల రోగికి మూర్ఛ(ఫిట్స్‌)ను కలిగించి, మానసిక సమస్యలను నయం చేయడానికి ప్రయత్నించారు. సైకోసిస్‌ సమస్యతో బాధపడే రోగులకు మార్ఛలు కలిగించినప్పుడు వారి మానసిక లక్షణాలు తగ్గడం గమనించాడు. శరీరంలో ఫిట్స్‌ కలిగితే సైకోసిస్‌ తగ్గుతుందని మెడూనా తెలుసుకున్నారు. క్యాంఫర్‌తో ఆ పరిస్థితిని కలిగించే చికిత్స చేశాడు. ఆ పద్ధతిలో దాదాపు 14 మందికి వ్యాధి నయం అయ్యింది. అయితే క్యాంఫర్‌ వల్ల కలిగిన దుష్ప్రభావాల కారణంగా ఇతర పద్ధతుల ద్వారా ఫిట్స్‌ను కలిగించే ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎలకో్ట్ర కన్వలిన్సివ్‌ థెరఫీ లేదా కరెంట్‌షాక్‌తో చికిత్స మొదలైంది.

1938లో బిని, సెరెలెట్టి అనే శాస్త్రవేత్తలు పరిమిత ఓల్టేజితో కరెంటును పంపడం ద్వారా మూర్చలు కలిగించవచ్చు అని కనుగొన్నారు. తలకు రెండు వైపులా ఎలకో్ట్రడ్స్‌ను ఉపయోగించి షాక్‌ ఇవ్వడం వల్ల దాని ప్రభావం మెదడుపై మాత్రమే ఉంటుందనీ, గుండెతో పాటు ఇతర భాగాలపై ఎలాంటి ప్రభావం పడట్లేదని వారి పరిశోధనలో తెలుసుకున్నారు. అప్పట్లో మానసిక సమస్యలకు మందులు లేకపోవడం వల్ల ఈసీటీని ఎక్కువగా వాడారు. అయితే మొదట్లో మత్తు ఇవ్వకుండా చికిత్స చేయడం వల్ల గాయాలు కావడం, ఒళ్లు నొప్పులు రావటం, ఎముకలు గాడితప్పడం, దవడ ఎముకలు పక్కకు జరగడం వంటి కొన్ని ప్రమాదాలు జరిగాయి. 1940 నుంచి మత్తుమందు ఇచ్చి చికిత్స చేస్తున్నారు.

అపోహలు- వాస్తవాలు
ఈసీటీని మెదడుకు గాయం చేస్తుందనేది మొదటి అపోహ. కానీ, పరిశోధనల్లో ఈసీటీ వల్ల మెదడు నిర్మాణానికి ఎలాంటి గాయాన్ని గానీ, ప్రమాదకరమైన మార్పులకుగానీ దారి తీయలేదని వైల్లడైంది.
మతిమరుపు కలుగుతుందనేది మరో ప్రధానమైన అపోహ. ఈసీటీ ప్రభావం జ్ఞాపకశక్తిపై పడే అవకాశం చాలా తక్కువ. ఈసీటీ ఇచ్చే సమయంలో తాత్కాలికంగా మత్తు మందు ఇస్తారు. కాబట్టి దాంతో అయోమయ పరిస్థితి వల్ల ఇలాంటి అభిప్రాయం కలుగవచ్చు. అయితే అతి కొద్దిమందిలో ఈసీటీ ఇచ్చినప్పుడు కొంతకాలం తాత్కాలికంగా 6-8 వారాలు జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
మెదడులో కరెంట్‌ ప్రవహిస్తుందని ఇంకో అపోహ..కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ఇప్పుడున్న అధునాతన పరికరాల వల్ల ఇది పూర్తిగా ప్రమాదరహితమైన వైద్యం. దీనికోసం వాడే ఓల్టేజీ కూడా చాలా తక్కువ కాబట్టి  ఎలాంటి ప్రమాదమూ ఉండదు.
ఈసీటీ ప్రమాదకరమైనది అని చాలామంది భయం. కానీ ఇది ప్రమాదకారి కాదు. ఈసీటీ వాడే సమయంలో కలిగే అనస్థీషియా వల్ల ఇతర శస్త్రచికిత్సలో ఉండే రిస్క్‌ తప్ప దీనితో రిస్క్‌ ఉండే అవకాశాలు లేవు. ఈసీటీ ఇచ్చే సమయంలో పల్స్‌ ఆక్సీమీటర్‌ అనే సాధనంతో గుండె, ఊపిరితిత్తులు మొదలైన శారీరక వ్యవస్థలను గమనిస్తూ ఉంటే ఇతర శారీరక సమస్యలపై పడే ప్రభావాన్ని నివారించవచ్చు.
జూ మెదడు దెబ్బతిని మానసిక వ్యాధి కలుగవచ్చుననేది భయంకరమైన అపోహ. ఇందులో కూడా ఎలాంటి వాస్తవం లేదు. కరెంటు పెట్టడం వల్ల ఎలాంటి మానసిక వ్యాధులు రావు.

ఎవరికి వాడాలి

 తీవ్రమైన వ్యాకులత ఉన్నవారికి.
 ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా కోరుకోవడం, ఆత్మహత్యకు ప్రయత్నించడం.
 ఆహారాన్ని తిరస్కరించడం.
 మందులతో వ్యాధి నయం కానప్పుడు.
 సైకోటిక్‌ డిప్రెషన్‌ వంటి వ్యాధులకు.
 బైపోలార్‌ డిప్రెషన్‌కు.
 కెటటోనియా
 స్కీజోఫ్రెనియా.
పనితీరు: మానసిక సమస్యలు, వాటి కారణాల గురించి ఎక్కువమందికి తక్కువ అవగాహన ఉంటుది. మన శరీరంలో ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానానికి ఇంకా అంతుచిక్కనిది, తక్కువ తెలిసింది మెదడు గురించే. అందుకే మానసిక సమస్యలకు కారణాలు తెలుసుకోవడం ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. అయితే ఈసీటీ మెదడులో అనేక మాలిక్యూలార్‌, బయోకెమికల్‌, ఎండోక్రైన్‌, స్ట్రక్చరల్‌, జెనెటిక్‌ స్థాయిల్లో మార్పులను కలుగజేస్తుంది. ఇది వ్యాధి నయం కావడానికి దోహదం చేస్తుంది.