మూర్ఛ వ్యాధిలోముందు జాగ్రత్తలు

01-10-2019: మెదడులో నిరంతరం కొన్ని విద్యుత్‌ కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఆ కార్యకలాపాలను నియంత్రించే వ్యవస్థలు కూడా మెదడులో ఉంటాయి. అయితే కొన్ని సార్లు ఈ నియంత్రణా వ్యవస్థలు దెబ్బతింటాయి. వీటి పరిణామంగా విద్యుత్‌ కార్యకలాపాలు మరింత అధికమవుతాయి. ఆ ఫలితమే మూర్ఛ.
 
కారణాల్లో ప్రధానంగా.....
తీవ్రమైన జ్వరం, పుట్టుక లోపాలు, మెదడులో కణతులు, మెనింజైటిస్‌ ఇన్‌ఫెక్షన్లు, తలకు బలంగా గాయాలు కావడం వంటివి కారణంగా ఉంటాయి. వీటితో పాటు అతి మద్యపానం, నిద్రలేమి, అదుపు లేని ఉద్వేగాల వంటివి కూడా కారణమవుతాయి. ఏమైనా, మూర్ఛ ఒక శారీరక స్థితే తప్ప మానసిక వ్యాధి కాదు.
 
మూర్ఛ వచ్చినప్పుడు.....
మూర్ఛ వచ్చిన సమయంలో ఆ వ్యక్తి నోట్లో ఏదో ఒకటి కుక్కే ప్రయత్నం చేయకండి. తగినంత గాలి అందేలా చూడండి. వీలైనంత వేగంగా డాక్టర్‌ వద్దకు తీసుకువెళ్లాలి.
మూర్ఛ వ్యాధి తాలూకు ఏ సమాచారాన్నీ దాచి ఉంచకుండా డాక్టర్‌కు పూర్తి వివరాలు అందించాలి. ముఖ్యంగా పుట్టుక నుంచీ ప్రస్తుత దశ దాకా తలకు ఎప్పుడైనా గాయం అయి ఉంటే ఆ విషయాన్ని డాక్టర్‌కు తప్పనిసరిగా తెలియచేయాలి.
డాక్టర్‌ సూచించిన మందులను, వాటి మోతాదులను స్పష్టంగా తెలుసుకోవాలి.
మూర్ఛ ఎప్పుడెప్పుడు వస్తుంది? కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి? ఆ వివరాలన్నీ ఒక రికార్డుగా రాసి ఉంచాలి.
మూర్ఛ వ్యాధి నయం కావాలంటే, 3 ఏళ్ల పాటు మందులు వాడాలి. ఫ మందులతో ఏవైనా దుష్ప్రభావాలు కనిపించిప్పుడు వెంటనే డాక్టర్‌కు తెలియచేయాలి.