పక్షవాతాన్నీ అధికమించొచ్చు

ఆంధ్రజ్యోతి:మన దేశంలో ప్రతి లక్ష మందిలో 200 మంది ఏదో ఒక స్థాయిలో పక్షవాతానికి గురైన వారు కనిపిస్తారు. వ్యాధి ముందస్తు హెచ్చరికల గురించిన సమాచారం ఎంతగా అందుతున్నా, ఈ విషయంలో చాలా మంది పట్టనట్టే ఉంటున్నారు. మొత్తంగా చూస్తే భారతదేశంలో ఏటా 20 లక్షల మంది పక్షవాతానికి గురవుతున్నట్లు అధ్యయనాలు  చెబుతున్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే, కాస్త ముందస్తు చర్యలు తీసుకోగలిగితే,  పక్షవాతాన్ని మన దరికే రాకుండా నివారించవచ్చునంటున్నారు నిపుణులు...

ఉద్యోగ వ్యాపారాల్లో నిన్నటిదాకా  ఎంతో దూకుడుగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా  ఈరోజు మంచానబడితే ఏమనుకోవాలి? కాలూ చేయి, మూతీ వంకరబోయి మాటైనా సరిగ్గా రాక మెలికలు తిరిగిపోతుంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆర్థికంగా ఆ కుటుంబానికి అతడే మూలస్థంభం అయితే ఇంక చెప్పేదేముంది? ఏం జరగబోతోందో ఏమీ బోధపడక అతన్ని నమ్ముకున్న వాళ్ల గుండెలవిసిపోవడమే కదా! ఈ అనూహ్య పరిణామాలన్నీ పక్షవాతంలోనే ఎదురవుతాయి. పక్షవాతం అందరినీ అంతే తీవ్రంగా కుంగదీస్తుందని కాదు. సమస్య తీవ్రతను అనుసరించి దాని దుష్ప్రభావాలు ఉంటాయి. వాస్తవానికి పక్షవాతానికి సంబంధించిన లక్షణాల గురించిన అవగాహనే ఉంటే జీవితంలో ఏనాడూ ఆ పరిస్థితే రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండవచ్చు. నిజానికి పక్షవాతం ఏ హెచ్చరికలూ లేకుండా  అంత హఠాత్తుగా ఏమీ రాదు. కాకపోతే ఆ హెచ్చరికల్ని చాలా మంది  గుర్తించలేరు.

కారణాలేమిటి?
ఇష్కెమిక్‌ స్ట్రోక్‌: మెదడుకు అవసరమైనంత రక్తం అందకపోవడం వల్ల వచ్చే పక్షవాతమిది.  దాదాపు 80 శాతం దాకా వచ్చే వీటిని ఇష్కెమిక్‌ స్ట్రోక్స్‌ అంటారు. రక్తనాళాలు ముడుచుపోయి గట్టిపడిన కారణంగా మెదడురకు రక్తప్రసరణ అందక ఈ రకం పక్షవాతం సమస్యలు వస్తాయి. ఈ స్థితిలో రక్తం గడ్డలు గట్టి రక్తనాళాల్లో అడ్డుపడే ప్రమాదం ఉంది. గుండె క్రమబద్దంగా పనిచేయని ఫలితంగా రక్తప్రసరణ సరిగా లేకపోవడం కూడా ఇందుకు కారణమే. ఈ తరహా పక్షవాతాలు ఒక్కోసారి ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు.

బ్లీడింగ్‌ బ్రెయిన్‌: రక్తనాళాల్లో ఒరిపిడి ఏర్పడి రక్తనాళాల గోడలు ఉబ్బిపోయి మెదడులో రక్తస్రావం కావడం ఇందులో సమస్య. దీన్నే కొందరు హెమరేజిక్‌ స్ట్రోక్‌ అంటారు. అలాగే  అధిక రక్తపోటు తీవ్రమై నియంత్రణ ఇక సాధ్యం కాకుండాపోయిన స్థితిలో వచ్చే సమస్య. ఇది కూడా రక్తనాళాలు ఒరిపిడికి గురై లోలోపల రక్తస్రావం కావడం ఇందులో ఏర్పడే పరిణామం. పక్షవాతానికి గురైన వ్యక్తికి వెంటనే అవసరమైన వైద్య చికిత్సలు అందకపోతే, వారిలో విషయాల్ని అర్థం చేసుకోవడంలో ఏర్పడే లోపాలు గానీ, జ్ఞాపకశక్తి లోపాలు గానీ, దీర్ఘకాలికంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. నిజానికి, ఏ కారణంగా పక్షవాతం వచ్చే పరిస్థితులు ఏర్పడినా దాన్ని నియంత్రించుకునేందుకు వీలుగా, ముందస్తు హెచ్చరికలు  కొన్ని కనిపిస్తాయి. 

ఇవీ హెచ్చరికలు

అయోమయత్వం
మాటలు అతి కష్టంగా రావడం
ఎదుటి వారి మాటలు స్పష్టంగా అర్థం కాకపోవడం
మాటలు తడబడటం
ఠముఖంలో ఏదో ఒక వైపుగానీ,  ఏదో ఒక కాలు, ఒక చేయి మొద్బుబారినట్లు అనిపించడం లేదా లాగుతున్నట్లు,  బలహీనంగా అనిపించడం. వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో హఠాత్తుగా తీవ్రమైన మలబద్దకం వచ్చేస్తుంది. ఇవన్నీ పక్షవాతం రాబోతోందని చెప్పే లక్షణాలు.
ఠకొందరిలో ఒక కంటిలో గానీ, రెండు కళ్లల్లో గానీ హఠాత్తుగా దృష్టిలోపాలు మొదలవుతాయి. కనిపించకపోవడం గానీ,  ఒక వస్తువు రెండుగానీ, ఒక వ్యక్తి ఇద్దరుగా గానీ, కనపించవచ్చు.
ఠస్థిరంగా నిలబడలేకపోవడం, మగతగా ఉండడం, సమతుల్యత కోల్పోవడం, అవయవాలు తమ అధీనంలో లేకపోవడం వంటి లక్షణాలు కూడా వీరిలో 
కనిపిస్తాయి. 
ఠకొందరిలో తలలోకి మొలలు దిగిపోయినంత తీవ్రంగా నొప్పి రావడం. అంతకు ముందెప్పుడూ రాని రీతిలో  తలనొప్పి రావడం.

వంటి లక్షణాలు కూడా కొందరిలో కనిపించవచ్చు.ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి వెంటనే ఆసుపత్రికి చేర్చగలిగితే పక్షవాతం రాకుండా నిరోధించే పూర్తి అవకాశాలు ఉంటాయి.

అత్యవసర చికిత్సలే దారి
పక్షవాతానికి ఒక సారి గురయ్యాక వైద్య చికిత్సల విషయంలో ఇంక ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అన్ని ఆధునిక వసతులూ గల ఆసుపత్రికి గంటలోపే చేరితే అది ఎక్కువ ప్రయోజనకరం. ఒక వేళ శస్త్రచికిత్సే అవసరమైనా ఒకప్పటిలా ఓపెన్‌ సర్జరీతో ఇప్పుడు పనిలేదు. అత్యంత ఆధునిక విధానాలెన్నో ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా టి.పి.ఎ (టిష్యూ ప్లాస్‌మినోజిన్‌ యాక్టివేటర్‌ అనే మందును  ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్‌ ద్వారా లోపల ఏర్పడిన గడ్డలను కరిగించే అవకాశం ఉంది. అయితే పక్షవాతానికి గురైన 3 గంటల వ్యవధిలోగా అయితేనే ఈ ఇంజెక్షన్‌ వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే,  పక్షవాతానికి గురయ్యాక అందించే వైద్య చికిత్సల మాట ఎలా ఉన్నా, అసలు పక్షవాతం రాకుండా జాగ్రత్త పడటంలోనే ఎంతో ఆనందం, ఆరోగ్యం ఉన్నాయి.
 
అడ్డుకోలేమా?
రక్తపోటును, మధుమేహాన్ని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా అత్యధిక శాతం పక్షవాతాలకు అడ్డుకోవచ్చు. 
చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే కొవ్వుపదార్థాలు గల ఆహార పానీయాలకు దూరంగా ఉండాలి. స్థూలకాయానికి ఎంత మాత్రం తావివ్వకూడదు. ఒకవేళ అప్పటికే శరీరం బరువు పెరిగిపోయి ఉంటే,  కార్బోహైడ్రేట్టు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
పక్షవాతం రావడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటైన పొగ తాగడం పూర్తిగా మానుకోవాలి.
మధుమేహం ఉన్నవాళ్లు ఆహార నియమాల్ని కచ్ఛితంగా పాటించాలి.
ముడిదాన్యాలను, పీచుపదార్థాలు అధికంగా ఉండే కూరగాయాలను ఎక్కువగా తీసుకోవాలి.
మానసిక ఒత్థిళ్లకు దూరంగా ఉండాలి. ఒత్తిళ్ల నియంత్రణకు యోగా, ధ్యానాలను క్రమం తప్పకుండా చేయాలి.