తలనొప్పులెన్నో...

05-08-2019:మైగ్రేన్‌ సమస్యతో ఏముంది? నాలుగు రోజులు ఉండి తగ్గిపోతుంది....అనుకుంటూ ఉండిపోయాం ఇంతకాలం. కానీ, దాంతో వచ్చే ఇతర సమస్యలు కూడా తక్కువేమీ కాదని ఇటీవలి అధ్యయనాల్లో బయటపడింది. ప్రధానంగా గర్భిణుల్లో మైగ్రేన్‌ సమస్య ఉంటే గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువని, ఒకవేళ గర్బస్రావం కాకపోయినా శిశువు తక్కవ బరువుతో పుడతాడని వెల్లడయింది. వాషింగ్టన్‌ నుంచి వెలువడే ‘ హెడ్‌ అండ్‌ ఫేస్‌ పెయిన్‌’ అనే జర్నల్‌ తాజా సంచికలో దీనికి సంబంధించిన ఒక వ్యాసం ప్రచురితమయ్యింది. సంతానం కోరుకునే స్త్రీలు మైగ్రేన్‌ బారిన పడితే గర్భం దాల్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయని, మైగ్రేన్‌ సమస్య లేని వారితో పోలిస్తే, మైగ్రేన్‌ ఉన్నవారిలో గర్భానికీ, ప్రసవానికీ సంబంఽధించిన సమస్యలు చాలా ఎక్కువని అందులో పేర్కొన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు మైగ్రేన్‌కు గురైన వారికి కలిగే పిల్లలకు శ్వాసకోశ సమస్యలు, మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉందని కూడా వారు చెబుతున్నారు దీనితో పాటు మైగ్రేన్‌ లేని గర్భిణులతో పోలిస్తే, మైగ్రేన్‌ సమస్య ఉన్న గర్భిణుల ప్రసవాల్లో సిజేరియన్‌ జరిగే అవకాశాలు 25 శాతం ఎక్కువని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఇన్ని రకాల ఇతర సమస్యలకు కారణమయ్యే మైగ్రేన్‌ సమస్యకు వైద్య చికిత్సలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయడం ఎంత మాత్రం తగదని కూడా వారు ఆ వ్యాసంలో వివరించారు.