పాల ఉబ్బసం ఎంతో ప్రమాదం

ఆంధ్రజ్యోతి,20-09-13:ఆస్తమా మనిషిని ఎంత క్షోభపెడుతుందో తెలిసిందే. ఒక్కోసారి మాట్లాడటానికి కూడా వీలుకాని  పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధి చిన్నపిల్లలకు చుట్టుకోవడమే పాల ఉబ్బసం (పిల్లల్లో ఆస్తమా) అంటారు. పిల్లలు వరుసగా పది అంకెలు లెక్కపెట్టడానికి కూడా ఊపిరి సరిపోనట్టుగా ఆయాసం వస్తుంటే వాళ్లు ఆస్తమాతో బాధపడుతున్నట్టే లెక్క. ఏ మాత్రం ఆలోచించకుండా వైద్యులను సంప్రదించడం ఆ పిల్లలకే కాదు, కుటుంబానికీ ఎంతో శ్రేయస్కరం.

ఆస్తమా ఉన్న పిల్లల్లో ఆయాసంతో పాటు ఛాతీ పట్టేయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కేవలం ఈ పిల్లికూతలతోనే వారిలో ఆస్తమాను నిర్ధారించలేం. ఎందుకంటే ఐదేళ్ల లోపు పిల్లల్లో ప్రతి ఏడుగురిలో ఒకరికి పిల్లికూతలు వినిపించవచ్చు. వాళ్లందరికీ ఆస్తమా ఉన్నట్టు నిర్ధారణ జరగలేదు. ఆరేళ్ల లోపు పిల్లల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టం. పిల్లికూతలు, ఆయాసం ఉన్న పిల్లల దీర్ఘకాలిక రికార్డును బట్టి ఆస్తమాను నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల లోపు పిల్లల్లో ఈ పిల్లికూతలు, ఆయాసం కనిపిస్తే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. అయితే జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. పిల్లికూతలు వినిపించే పిల్లల్ని మూడు గ్రూపులుగా విభజించవచ్చు.

1. ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉన్న పిల్లలు. ఇలాంటి వారి పిల్లికూతలు వినిపించినా కాలక్రమంలో సమస్యను అధిగమించి ఆస్తమా బారిన పడకుండా ఉండగలరు.
2. రోగనిరోధక వ్యవస్థతో ఎలాంటి సంబంధమూ లేకుండా(నాన్‌ ఎటోపిక్‌గా) వైరస్‌ కారణంగా వచ్చే ఆస్తమా ఇది. ఈ గ్రూపు పిల్లలు కూడా ఎక్కువ కాలం బాధలు అనుభవించినా ఆ తరువాత సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
3. ఇలాంటి పిల్లల్లో ఆస్తమా లక్షణాలు బాల్యావస్థ దాటిన తరువాత కూడా కనిపిస్తుంటాయి. కుటుంబ చరిత్రలో ఆస్తమా ఉంటుంది. అలర్జీలు కూడా వస్తుంటాయి.
ఆస్తమాకు కారణాలేంటి?
ఆస్తమా రావడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. జన్యుపరమైన, పర్యావరణ సంబంధమైన అనేక అంశాలు దీనితో ముడిపడి ఉంటాయి. వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ పాత్ర కూడా ఉంటుంది. శరీరతత్వానికి పడని పదార్థం మన లోపలికి ప్రవేశించినప్పుడు లేదా కలుషితమైన పదార్థం ఊపిరితిత్తుల గాలి మార్గంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి కండరాలు బిగుసుకుపోతాయి. దాంతో శ్వాసమార్గం మూసుకుపోయినట్టుగా అవుతుంది. ఆ మార్గంలో జిగురు పదార్థం(మ్యూకస్‌ లేదా ఫ్లమ్‌) ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా గాలి గొట్టాల మార్గం మరింత సన్నబడుతుంది. దీనివల్ల ఊపిరి అందదు. ఫలితంగా ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి శరీర తత్వానికి పడని పదార్థాలను ట్రిగర్‌ అంటారు.
ఎలా నిర్ధారణ చేసుకోవాలి?
ఆస్తమాను నిర్ధారించాలంటే క్లినికల్‌ పరీక్షలతో పాటు రోగి గత చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఆ తరువాత ల్యాబ్‌ పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తారు. స్పైరోమెట్రీ పరీక్షలు కూడా చేయించాలి. నాలుగేళ్ల లోపు పిల్లలకయితే పిల్లికూతలు రోజంతా ఉండి ఆయాసంతో నిద్రలేకపోవడం, తల్లిదండ్రులకు ఆస్తమా ఉండటం, ముక్కు కారుతూ ఉండటం వంటి లక్షణాల ఆధారంగా నిర్ధారణ చేయవచ్చు.

ఈ లక్షణాలుంటే ముదురుతున్నట్టే!

ఉదయం వేళల్లో పిల్లలకు పిల్లికూతలు, దగ్గు ఎక్కువ అవుతుండటం.
వ్యాయామం తరువాత పిల్లికూతలు, దగ్గు ఎక్కువగా రావడం.
రాత్రివేళల్లో నడుస్తుంటే పిల్లికూతలు, దగ్గు పెరగడం, రిలీవర్‌ వాడితేనే తగ్గడం.

రిలీవర్‌ వాడినా తేలికపడని లక్షణాలు కనిపించడం.

చికిత్స ఆరు దశలలో
ఆస్తమాలో తీవ్రతను బట్టి వర్గీకరణ ఉంటుంది. వర్గీకరణ జరిగిన తరువాత ఆరు దశలలో చికిత్స సాగుతుంది.
దశ1: అప్పుడప్పుడూ అవసరాన్నిబట్టి రిలీవర్స్‌ ఇవ్వడం
దశ2: పీల్చడానికి వీలైన తక్కువ మోతాదు కార్టికోస్టెరాయిడ్స్‌ లేదా మాంటెలుకాస్ట్‌ టాబ్లెట్స్‌ ఇవ్వడం.
దశ3: ఓ మోస్తరు తీవ్రత ఉన్నవారికి మాడరేట్‌ డోస్‌లో పీల్చదగిన యాక్టింగ్‌ బీటా ఎగోనిస్ట్స్‌(ఎల్‌బిఎ) ఇన్‌హేలర్స్‌ ఇవ్వడం.
దశ4: ఐసీఎస్‌తో పాటు మాంటెలుకాస్ట్‌ టాబ్లెట్స్‌ లేదా లాంగ్‌ యాక్టింగ్‌ బీటా ఎగోనిస్ట్స్‌ ఇన్‌హేలర్స్‌ ఇవ్వడం.
దశ5: సమస్య తీవ్రంగా ఉన్నవారికి ఎక్కువ డోస్‌తో ఉండే ఐసీఎస్‌ మాంటెలుకాస్ట్‌ టాబ్లెట్స్‌ లేదా యాక్లింగ్‌ బీటా ఎగోనిస్ట్స్‌ ఇన్‌హేలర్స్‌ ఇవ్వడం.

దశ6: మరీ తీవ్రంగా ఉంటే హైడోస్‌ ఐపీస్‌తో పాటు మాంటెలుకాస్ట్‌ టాబ్లెట్స్‌, లాంగ్‌ యాక్టింగ్‌ బీటా ఎగోనిస్ట్స్‌ ఇన్‌హేలర్స్‌

జాగ్రత్తలు
కాలుష్యం, పొగ, ఇంటిలోని దుమ్ము, కార్పెట్‌లోని ధూళి, సరిపడని ఆహార పదార్థాలు, ఘాటు రసాయనాల వాసన, సాఫ్ట్‌టాయ్స్‌, పెంపుడు జంతువుల వెంట్రుకల్లో దాగి ఉండే అలర్జెన్స్‌, పుప్పొడి, పిల్లల్ని ఆకర్షించడానికి ఆహారానికి కలిపే రంగులు, కొన్ని మందులు...వీటి నుంచి దూరంగా ఉండాలి. అయితే ఇలాంటి పరిస్థితి నుంచి పూర్తిగా దూరవమడం నేటి జీవన విధానంలో సాధ్యపడకపోవచ్చు కానీ, వీలయినంత దూరంగా ఉంటే మంచిది.