మెలిపెడుతోందా?

13-08-2019: తినేవన్నీ తింటూనే కొంత మంది పిల్లలు బాగా నీరసించిపోతుంటారు. ముఖమంతా పాలిపోయి నిస్తేజంగా కనపడుతూ ఉంటారు. కాళ్లూ చేతులు సన్నబడి,, పొట్ట లావెక్కిపోతూ ఉంటుంది. ఇవన్నీ చాలావరకూ పొట్టలో నులిపురుగులు చేరిన ఫలితమే! సమయానికి దీనికి వైద్య చికిత్సలు అందకపోతే పలు సమస్యలు చుట్టు ముట్టే ప్రమాదం ఉంది.
 
వెంటనే బయటకు ఏమీ తెలియకపోవచ్చు. కానీ, నులిపురుగులు లోలోపల పేగుల్ని మెలివేస్తాయి. అసౌకర్యం, కడుపు ఉబ్బరం, వికారం... ఇవే కాదు. తీవ్రమైన కడుపు నొప్పి కూడా కలిగిస్తాయి. బరువు తగ్గిపోవడం, నీరసం, కడుపంతా తిప్పేసినట్టు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
నులిపురుగులు అనేక రకాలు: రౌండ్‌ వార్మ్స్‌ (ఏలిక పురుగులు), టేప్‌ వార్మ్స్‌ (బద్ది పురుగులు), థ్రెడ్‌ వార్మ్స్‌ హుక్‌ వార్మ్స్‌, ఫ్లూక్‌ వార్మ్స్‌, పిన్‌ వార్మ్స్‌ - ఇలా అనేక రకాలు. వీటిల్లో కొన్ని పెద్ద పేగుల్లో ఉంటే, మరికొన్ని చిన్న పేగుల్లో ఉంటాయి. నులిపురుగుల్లో ఆయా రకాన్ని బట్టి ఒక్కొక్కటి 3 నుంచి 10 సెంటీ మీటర్ల పొడవు దాకా ఉంటాయి.
 
టేప్‌వార్మ్స్‌: పేగుల్లో మకాం వేసే ఈ నులిపురుగు పేగుల గోడలకు అతుక్కుపోతుంది. వీటి తాలూకు లక్షణాలు కొందరిలో అసలే కనిపించవు. మరికొందరిలో చాలా స్వల్పంగా కనిపిస్తాయి. టేప్‌ వార్మ్స్‌ల్లోనే వేర్వేరు రకాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని నీళ్లల్లో ఉంటాయి. అపరిశుభ్రమైన నీళ్లు, పచ్చిమాంసంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా శుభ్రపరచని, ఉడికించని మాంసం తినడం ద్వారా ఇవి పొట్టలోకి చేరతాయి. టేప్‌వార్మ్స్‌ పలకబడి, పొడవుగా ఉంటాయి.
 
హుక్‌వార్మ్స్‌: ఈ తరహా నులిపురుగులు, అపరిశుభ్రమైన నేలలోంచి మానవదేహంలోకి ప్రవేశిస్తాయి. ఇవి చిన్న పేగుల్లో నివసిస్తూ, అక్కడే గుడ్లు పెడతాయి. విసర్జన సమయంలో బయటపడుతూ ఉంటాయి. ఆ మలినాల్ని నేరుగా తాకినా లేదా ఆ మలినాలు కలిసిన మట్టిని తాకినా ఈ లార్వా శరీరంలోకి ప్రవేశించవచ్చు. చాలా మందిలో ఈ నులిపురుగుల తాలూకు లక్షణాలేమీ కనిపించవు. చాలా అరుదుగా కొందరిలో జీర్ణాశయ సంబంధమైన లక్షణాలు కనిపిస్తాయి.
 
పిల్లల్లోనే అధికం: నులిపురుగుల సమస్య అత్యధికంగా చిన్న పిల్లల్లోనే కనిపిస్తుంది. ఆకలి తగ్గిపోవడం, విసర్జన సరిగా కాకపోవడం, కడుపులో నొప్పి , ఏదో అనారోగ్యంగా అనిపించడం, ముఖం పాలిపోయినట్లు ఉండడం, పొట్ట ఉబ్బినట్టు కనిపించడం, కాళ్లూ చేతులు సన్నబడడం వంటి లక్షణాలు కనిసిస్తే నులిపురుగుల సమస్యేమోనని అనుమానించాలి. ఈ స్థితిలో మల పరీక్ష చేయిస్తే, నులిపురుగుల తాలూకు ఆనవాళ్లు కనిపిస్తాయి. అలాగని, నులిపురుగుల సమస్యకు గురైన అందరిలోనూ ఆ లక్షణాలు కనిపిస్తాయన్న గ్యారెంటీ లేదు. అందువల్ల కేవలం లక్షణాల ఆధారంగానే సమస్యను పసిగట్టి వైద్య చికిత్సలు అందించాల్సి ఉంటుంది. హోమియోపతి ఈ విధానానికి అత్యధిక ప్రాధాన్యనిమిస్తుంది. నులిపురుగుల బారిన పడకుండా ఉండాలంటే, పిల్లలందరికీ ప్రతి మూడు నాలుగు మాసాలకు ఒకసారి డీ-వార్మింగ్‌ చేయడం చాలా అవసరం.
 
ఇవీ కారణాలు:
నులిపురుగుల బారిన పడడానికి అపరిశుభ్ర పరిసరాలు, జీవనశైలి లోపాలే ప్రధాన కారణం. ముఖ్యంగా టాయ్‌లెట్‌కు వెళ్లాక చేతులు కడుక్కోకపోవడం, చేతులు శుభ్రం చేసుకోకుండానే భోజనం చేయడం, రోడ్డు పైన అమ్మే ఆహార పదార్థాలను తినేయడం వంటివి కారణమవుతాయి. నేల పైన, నిల్వ నీళ్లలోనూ నులిపురుగుల తాలూకు గుడ్లు ఉంటాయి. నులిపురుగుల బారిన పడిన జంతువుల మాంసం తినడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. ఆకుకూరల పైన కూడా నులిపురుగుల గుడ్లు ఉంటాయి కాబట్టి వాటిని శుభ్రం చేసేటప్పుడు, ఉడికించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
 పెద్దవాళ్లు పరిశుభ్రతాపరమైన తప్పులు ఏమీ చేయకపోయినా, పచ్చిగా ఉండే సలాడ్స్‌ తినడం, సరిగా ఉడికించనివి, రోడ్డుపైన లేదా శుచీశుభ్రతా పాటించని హోటల్‌లో ఆహార పదార్థాలు తినడం, కలుషిత నీరు తాగడం వల్ల నులిపురుగులు వారి శరీరంలోకి ప్రవేశిస్తాయి.
రౌండ్‌ వార్మ్స్‌ ఉన్న పిల్లలు తీవ్రమైన ఎలర్జీ సమస్యలతో బాధపడతారు. అయితే చాలామంది ఎలర్జీకి ఇచ్చే సాధారణ మందులతో సరిపెడతారే తప్ప అసలు సమస్య గుర్తించరు. సకాలంలో సరైన చికిత్స అందక సమస్య ముదిరితే, నులిపురుగులు ఒక్కోసారి పేగుల్లోంచి శ్వాసకోశాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. నులిపురుగులు బాగా విస్తరించి, ఒక్కోసారి పేగుల్లో అడ్డుపడే అవకాశం ఉంది. ఇది రోగిని అత్యవసరంగా ఆస్పత్రికి చేర్చాల్సిన పరిస్థితికి దారి తీయవచ్చు.
 
రక్తహీనతకు రాస్తా!
నులిపురుగుల కారణంగా చిన్న పిల్లల్లో తలెత్తే ప్రధాన సమస్య రక్తహీనత. ఒకవేళ అంతకు ముందే రక్తహీనతతో ఉన్న పిల్లలైతే, నులిపురుగుల బారిన పడ్డాక, వారు మరింత రక్తహీనతకు గురయ్యే వీలుంది. అప్పటికే రుతుక్రమం మొదలైన ఆడపిల్లల్లో ఈ నులిపురుగులు చేరితే, వారిలో రక్తహీనత సమస్య మరింత ఎక్కవవుతుంది. గమనించాల్సింది ఏమంటే రక్తహీనత బాధపడేవాళ్లలో కొందరు సన్నబడుతుంటే మరికొందరు బరువు పెరుగుతుంటారు. కాకపోతే వీరికి ఏ కొంచెం పనిచేసినా ఆయాసం వస్తుంది, అలా ఆయాసం రావడాన్ని గమనించి వెంటనే హిమోగ్లోబిన్‌ పరీక్ష చేయించాలి. రక్తహీనత కారణంగా ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశముంది. టీనేజ్‌ పిల్లల్లో క్షయ వ్యాధి వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ.
 
నులిపురుగులకు హోమియో వైద్యం
మామూలుగా నులిపురుగులు చనిపోవడానికి లేదా అవి బయటకు రావడానికి మందులు ఇస్తారు. అయితే హోమియోపతిలో ఆ తరహా మందులతో పాటు, పురుగులు పొట్టలోఉండలేని ఒక అసౌకర్య వాతావరణాన్ని కల్పించే మందులు కూడా ఉన్నాయి. మౌలికంగా ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో అవి లోపల ఉండిపోవడానికిగానీ, వృద్ధి చెందడానికిగానీ అవకాశం ఉండదు.
 
సినా-200: పిల్లల్లో కోపం, చిరాకు, పళ్లు కొరకడం, తీపి పదార్థాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపడం, అతి ఆకలి, మలద్వారంలో మంట, మూత్ర విసర్జనలో ఇబ్బంది, నడుము నొప్పి, ముక్కులో వేలు దూర్చడం వంటి లక్షణాలు ఉంటే, ఈ మందు వేయాలి.
 
స్థానంమెట్‌-30: ముఖం పాలిపోవడం, బోర్లా పడుకోవడం, కళ్లల్లో కాంతి తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందు తీసుకోవాలి.
 
స్పైజీలియా-30: బొడ్డు దగ్గర నొప్పి, మలంలో నులిపురుగులు కనిపించినప్పుడు దీన్ని వాడాలి.
 
నేట్రంఫాస్‌-30: మలద్వారంలో దురద, పళ్లు కొరకడం, ముక్కును గోకడం వంటి లక్షణాలు ఉంటే ఈ మందు వాడితే సరి.
 
సైలీషియా-300: మలంలో చీము, బద్దె పురుగులు (టేప్‌వార్మ్స్‌) కనిపిస్తే ఈ మందు ఉపయోగించాలి.
 
ట్యూక్రియం-200: నిద్రలేమి, చిరాకు, మలద్వారంలో దురద, పురుగుల బాధ ఉంటే ఈ మందు వాడితే ఫలితం ఉంటుంది.
 
సెబాడిల్లా- 30: వికారం, వాంతులు ఉంటే ఈ మందు వాడితే తగ్గిపోతాయి.
 
సిక్యూటరా విరోసా 6-12: నులిపురుగుల వల్ల ఫిట్స్‌ వస్తే ఈ మందు వాడాలి.
ఒకవేళ పై మందులేవీ పనిచేయని స్థితిలో సల్ఫర్‌-30 మందులు వాడి, ఆ తర్వాత పై మందులు వాడితే నులిపురుగులు పూర్తిగా తొలగిపోతాయి.
 
లక్షణాల్లో కొన్ని...
పొట్టలో నులిపురుగులు చేరిన పిల్లల్లో ఆకలి తగ్గిపోవచ్చు. లేదా విపరీతమైన ఆకలి కావచ్చు. దాని వల్ల అతిగా తినేస్తారు. కానీ శారీరకంగా ఏ విధమైన వృద్ధీ కనిపించదు. అది గమనించి, నులిపురుగులు ఉన్నాయేమోనని అనుమానించి వెంటనే డాక్టర్‌ను సంప్రతించాలి.
రౌండ్‌ వార్మ్స్‌ అయితే కాస్త పెద్దగా ఉంటాయి కాబట్టి మలవిసర్జనలో కనిపిస్తాయి. ఇతర థ్రెడ్‌ వార్మ్స్‌ గానీ, టేప్‌ వార్మ్స్‌ గానీ, హుక్‌వార్మ్స్‌ గానీ బాగా సన్నగా ఉండడం వల్ల కంటికి కనిపించవు. వెస్టన్‌ టాయ్‌లెట్స్‌ వచ్చాక నులిపురుగులూ మన దృష్టిలో పడే అవకాశం ఉండట్లేదు. కాకపోతే థ్రెడ్‌ వార్మ్స్‌ ఉంటే మలద్వారంలో విపరీతమైన దురద ఉంటుంది. దాన్నిబట్టి గుర్తించే అవకాశం ఉంది.
పిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నారా? లేదా? ఎప్పటికప్పుడు గోర్లు తీస్తున్నామా? లేదా? వంటివి గమనించాలి.
పిల్లలు ఎవరైనా వరుసగా జబ్బుల బారిన పడుతున్నారూ అంటే ముందు రక్తహీనత ఉందేమో గమనించాలి. ఆ తర్వాత నులిపురుగుల సమస్య ఉందేమో తెలుసుకోవాలి.

నివారణగా...

మౌలికంగా ఆహార పదార్థాలతోనే నులిపురుగులు మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా మాంసం ద్వారా ప్రత్యేకించి పోర్క్‌, బీఫ్‌, రెడ్‌ మీట్‌, చేపల ద్వారా ప్రవేశించే అవకాశం మరీ ఎక్కువ. అందువల్ల ఆ మాంసాన్ని దాదాపు 145 డిగ్రీల ఫారెన్‌ హీట్‌లో ఉడికించిన తరువాతే తినాలి.
కోడి మాంసాన్ని అయితే 165 డిగ్రీల ఫారెన్‌ హీట్‌లో ఉడికించాలి.
కూరగాయలను లేదా మాంసాన్ని కోయడానికి ప్రత్యేకమైన కత్తులు ఉపయోగించాలి.
పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలి.

డాక్టర్‌ కె. గోపాలకృష్ణ

హోమియో వైద్యనిపుణులు