వలస వచ్చిన బర్డ్‌ఫ్లూ

ఆంధ్రజ్యోతి,22-4-15:వలస పక్షులైన నీటిబాతులు బర్డ్‌ఫ్లూ వ్యాధిని కలిగించే ప్రమాదకరమైన ఏ5ూ1 వైర్‌సని కలిగి ఉంటాయి. ఈ పక్షులు వలస వెళ్ళిన ప్రదేశాల్లో ఈ వైరస్‌ని వ్యాప్తి చేస్తుంటాయి. సహజంగా ఈ వైరస్‌ వలస పక్షుల పేగుల్లో ఉండి అవి మల విసర్జన చేసినపుడు ఆ  ప్రదేశాల్లో ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. బర్డ్‌ ఫ్లూని ఎవియన్‌ ఫ్లూ అని కూడా అంటారు. ఇది పెంపుడు కోళ్ళకు, మనుషులకు కూడా ప్రాణాంతకమైంది. ఈ వైరస్‌ కోళ్ళనుండి, ఇతర పక్షులనుండి మనుషులకి వ్యాపిస్తుంది.

ఈ వ్యాధి సోకిన పక్షులకు, కోళ్ల ఫారాలకు, వాటి పరిసరాలకు అతి దగ్గరగా ఉన్నందువల్ల ఈ వ్యాధి వారికి సోకే ప్రమాదముంది. ఈ వ్యాధి మనిషి నుండి మరొక మనిషికి వస్తుందనేది కొంత సంశయమే. ఈ వ్యాధితో బాధపడే వారి దగ్గర వుండి సేవలు చేసిన వారికి అరుదుగా ఈ వ్యాధి సోకడం జరుగుతుంది. ప్రమాదకరమైన బర్డ్‌ఫ్లూ వైరస్‌ మనుషుల్లోని వైర్‌సతో కలిసి పరివర్తన చెందితే మాత్రం ఒకరినుండి మరొకరికి ఈ వ్యాధి వ్యాపించి అనేక మందిని పొట్టనపెట్టుకొంటుంది. ఇప్పుడు ఆసియా దేశాలను వణికిస్తుంది ఈ వైరస్సే.  ఏ5ూ1 వైరస్‌ లేక ఎవియన్‌ ఫ్లూ పెంపుడు కోళ్ళకు, టర్కీ కోళ్ళకు సోకడం వల్ల లక్షల కొద్దీ కోళ్ళ ప్రాణాలు కోల్పోతున్నాయి. 

ఈ వ్యాధి సోకిన పక్షుల్లో సామాన్యంగా నీళ్ళ విరేచనాలు, శ్వాస సంబంధించిన ఇబ్బందులు, తలవాపుతో చివరకు ప్రాణాలు కోల్పోతాయి. వ్యాధి సోకిన పక్షి ఈకల్లోను, శ్లేష్మం, లాలాజలం, మలంలోను బర్డ్‌ఫ్లూ వైరస్‌ చోటు చేసుకుంది. ఈ పక్షులను సంరక్షించే వ్యక్తులు రోజూ వాటిని ముట్టుకుని మలాన్ని తీయడం లాంటి పనులు చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం మరిచిపోయి ఆహారం తింటుంటారు. అపుడు వైరస్‌ చేతులనుండి నోట్లోకి పోయి వ్యాధిని కలిగిస్తుంది. ఉడకబెట్టని పచ్చి మాంసంలో ఈ వైరస్‌ బ్రతికే ఉంటుంది. ఉడికించినపుడు మాత్రం చనిపోతుంది. సరిగా ఉడికించకుండా తింటే ఈ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. 
బర్డ్‌ఫ్లూ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది. ప్రధానంగా మనిషికి ఈ వ్యాధి సోకినపుడు వాంతులు, విరేచనాలు, దగ్గు, జ్వరం, గొంతు బొంగురు, కంటి జబ్బులు, న్యూమోనియా మొదలైన వ్యాధులతో బాధపడుతుంటారు. చిన్న పిల్లలు, గ్రామాల్లోని ప్రజలు ఎక్కువగా బర్డ్‌ఫ్లూ వ్యాధికి గురి అవుతారు. బర్డ్‌ఫ్లూ వ్యాధి వస్తే నోటికి, ముక్కుకి, దగ్గినపుడు, చీదినపుడు గుడ్డతో అడ్డు పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకోవాలి. అలాగే గుంపులుగా ఉండే జనసముదాయంలో ఉండకూడదు.
ఆహారాన్ని తీసుకునే ముందు, తర్వాత చేతులను పరిశుభ్రంగా సబ్బుతో కడగండి. మలమూత్ర విసర్జన తర్వాత కూడా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. వంటిల్లు పరిశుభ్రంగా ఉంచండి. సాలె పురుగులు, బొద్దింకలు, చీమలు, దోమలు, ఈగలు, బల్లులు మొదలైనవి చేరకుండా ఆహార పదార్ధాలపైన సరైన మూతలు పెట్టండి. వండని గుడ్లు, కోడిమాంసం, చేపలు ఇతర పదార్థాల నుండి దూరంగా విడిగా పెట్టాలి. వంటలకు విడివిడిగా ప్రత్యేక వంట పాత్రలు వాడండి. ఆహార పదార్ధాలను పూర్తిగా ఉడికించండి. వేడిగా ఉన్నప్పుడే తినండి. పరిశుభ్రమైన నీటినే తాగడానికి వాడండి. అన్ని రకాల పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటిలో కడగండి. నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను వాడకండి. కల్తీలేని పాలను బాగా కాచి వాడండి. పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ శరీరం, చేతులు శుభ్రపరచుకోవడానికి సబ్బులు ఉపయోగించండి.

బర్డ్‌ఫ్లూ వ్యాధిలో ఉపయోగపడే ముఖ్యమైన మూలికల మిశ్రమం

పొట్టుతీసిన వెల్లులి రెమ్మలు-20
అశ్వగంధ పౌడరు- 10 గ్రాములు
పసుపు పౌడరు- 10 గ్రాములు
తిప్పసత్తు-  10 గ్రాములు
నేలవేము పౌడరు- 10 గ్రాములు
తులసి పౌడరు- 10 గ్రాములు
త్రిఫల పౌడరు- 10 గ్రాములు
త్రికటుకాలు పౌడరు- 10 గ్రాములు 

మొత్తం- 90 గ్రాములు

నిమ్మరసంతో బాగా నూరి ఎండించి తిరిగి తేనెతో నూరి శెనగలంత మాత్రలు చేసి నీడలో ఎండించి పూటకు ఒక మాత్ర చొప్పున రోజుకి మూడు మాత్రలు వేడి నీటితో వాడాలి. ఇది జబ్బు తగ్గించడానికి, వ్యాధి రాకుండా కాపాడటానికి ఉపయోగపడుతుంది.
 
డాక్టర్‌ కందమూరి ఆయుర్విజ్ఞాన కేంద్రం