ఒ.సి.డి వదిలించుకోవచ్చు!

24-09-2019: అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఒ.సి.డి) కొన్ని అంశాలతో ముడిపడి ఉంటుంది. సూక్ష్మక్రిములతో రోగగ్రస్థులం అవుతామేమోననే భయం ఉన్నవాళ్లు...సూక్ష్మక్రిములు అంటుకున్నాయనే అనుమానంతో రోజుకి 30 సార్లు చేతులు కడుక్కోవటం, 10 సార్లు స్నానం చేయటం చేస్తూ ఉంటారు. ఇలా అర్థం లేని భయాలు, ఆలోచనలు కొన్ని నిరంతర పనులు చేసేలా ప్రేరేపిస్తూ ఉన్నా, దీని వల్ల దైనందిన జీవితం ఇబ్బందికరంగా పరిణమించినా ఆ పరిస్థితిని ‘అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌’గా భావించి చికిత్స తీసుకోవాలి.
 
ఈ ప్రేరేపణలను బలవంతంగా కట్టడి చేయటానికి ప్రయత్నించినప్పుడు ఒత్తిడి పెరిగి, ఆ ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో తిరిగి ఆ అబ్సెషన్‌లో మరింత కూరుకుపోతూ ఉంటారు. కాబట్టి ఈ సమస్య గురించి ఆత్మన్యూనతకు లోనవకుండా వీలైనంత వెంటనే మానసిక వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.
 
ఒ.సి.డి లక్షణాలు ఇవే!
మట్టి అంటుకుంటుందనే భయంతో చేతులు పాచిపోయేవరకూ కడుగుతూనే ఉండడం
వస్తువులన్నీ పద్ధతి ప్రకారం ఉండాలని బలంగా కోరుకోవడం
తనకు తాను, లేదా ఇతరులకు హాని తలపడతానేమోననే విపరీతమైన భయం
తలుపు తాళం వేశానా లేదా? స్టవ్‌ కింద మంట తీశానా లేదా? అని పదే పదే పరీక్షించడం
ఒ.సి.డికి జన్యుపరమైన, పర్యావరణపరమైన అంశాలే కారణమని అంటున్న వైద్యులు ప్రారంభంలోనే గుర్తిస్తే సమర్ధమైన చికిత్సతో ఒ.సి.డిని నయం చేయవచ్చంటున్నారు.