అలర్జీ ఉందని బాదరబందీ కాకండి!

ఒక్క భారత దేశంలో అలర్జీ బాధితులు 30 కోట్ల మంది దాకా ఉంటారు.
మనసులాగే శరీరమూ అసహనానికి గురవుతుంది!
తుమ్ములు, దగ్గులు, దురద మంటలతో
అలర్జీలకు లోనవుతుంది!
ఈ ఇబ్బందుల మూలాలు కనిపెట్టి,
వాటి పట్ల అప్రమత్తంగా ఉంటే సరి!
అసహనం ఇట్టే మటుమాయం!!
బాధకు బందీ కాకండి!!
 
అలర్జీలకు శరీరంలో అన్ని భాగాల్లోకీ వెళ్లే వెసులుబాటు ఉంది. దానికి కారణం రక్తకణాలు వాటికి వాహకాలుగా ఉండడమే! రక్తంలో ఉండే మ్యాస్ట్‌ సెల్స్‌, సీరమ్‌ ఐ.జి.ఇ కణాల్లో వచ్చే మార్పులే అలర్జీలకు కారణమవుతాయి. వాటిని ఎగదోసే రకరకాల మార్పులు అందుకు దోహదం చేస్తాయి. అయితే, అలర్జీలను చూసి ఆందోళన పడటమే తప్ప అవి ఎందుకు వచ్చాయనే కారణాల్ని తెలుసుకునే ప్రయత్నం చాలా మంది చేయరు. అయితే కారణాలు తెలియనంత కాలం, ఆ కారణాల్ని నిర్మూలించే ప్రయత్నం జరగ నంతకాలం అలర్జీలు కొనసాగుతూనే ఉంటాయి.
 
ఏమిటా కారణాలు?
విసర్జకాలు: ఇంట్లో ఉండే బొద్దింకలు, పెంపుడు జంతువుల ఉమ్మి, మలమూత్రాలు అలర్జీ కారకాలు. పెంపుడు జంతువుల బొచ్చు వల్ల అలర్జీ తలెత్తదు.
 
ఫంగస్‌: ఫ్రిజ్‌ పదార్థాలు, ఐస్‌క్రీములు, కూల్‌ డ్రింకులు ఎక్కువగా తీసుకునేవారు. పాత, తరుచూ నెమ్ము ఏర్పడే ఇళ్లల్లో నివిసించేవారు ఆల్టర్‌ నేరియా అనే ఫంగస్‌ బారిన పడే అవకాశం ఉంది.
 
పార్థీలియమ్‌ (ఒయ్యారి భామచెట్టు): ఈ చెట్టు పుప్పొడి కూడా ప్రధాన అలర్జీ కారకం.
చల్లని వాటిలో: ఫ్రిజ్‌లో ఉండే చల్లని ఘన, ద్రవ పదార్థాలు.
 
డస్ట్‌ మైట్స్‌: పరుపులు, దిండ్లు, బెడ్‌షీట్లు, కర్టెన్‌లలో ఉండే హౌస్‌ డస్ట్‌ మైట్‌ అనే సూక్ష్మ క్రిములు కూడా అలర్జీ కారకాలే!
 
పూల పుప్పొడి: పూల చెట్లు ఎక్కువగా ఉండే ఇంట్లో వాటి పుప్పొడి కారణంగా కంటి దురద, తుమ్ములు మొదలవుతాయి. 
 
ఫాస్ట్‌ ఫుడ్స్‌: వీటి తయారీలో, వాడే నూనెలు, ప్రిజర్వేటివ్స్‌, కలరింగ్‌ ఏజెంట్ల వల్ల కూడా అలర్జీలు తలెత్తుతాయి.
 
విటమిన్‌ డి లోపం: శరీరంలో విటమిన్‌ డి3 సరిపడా ఉన్నవారు అలర్జీలకు గురయ్యే అవకాశం చాలా తక్కువ. విటమిన్‌- డి-3 సరిపడా నిలుపుకోవడం అంటే 50 శాతం అలర్జీలపైన ఉక్కుపాదం మోపడమే!
 
చక్కెర: అలర్జీలు ఉన్న పిల్లలు చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు చాలా తొందరగా ఇన్‌ ఫెక్షన్లు తలె త్తుతాయి. ఈ కారణంగానే అలర్జీ బాధితుల చర్మం పైన మొటిమలు రావడం, అవి ఇన్‌ఫెక్షన్లకు గురికావడమూ తరుచూ కనిపిస్తుంది. అధిక చక్కెర వ్యాధినిరోధకశక్తిని దెబ్బ తీస్తుంది. కాబట్టి పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
 
అలర్జీతో ఉన్న పిల్లల్లో తుమ్ములు, దగ్గు, దురద, ఆయాసం, కంటి దురద, తరుచూ తలనొప్పి, ఆకలి తగ్గిపోవడం, కడుపునొప్పి, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
 
ప్రారంభం బాల్యంలోనే!
అలర్జీ సమస్యలు ఎక్కువగా బాల్యం నుంచే మొదలవుతాయి. వంశానుగతమైన మూలాలు ఉన్న పిల్లలు పొడిచర్మంతో పుడతారు. ఫలితంగా ఆ పొడిచర్మం పగుళ్లు బారి ఆ పగుళ్లలోకి సూక్ష్మక్రిములు, అత్యంత సూక్ష్మమైన పుప్పొడి ప్రవేశిస్తాయి. ఇవే అలర్జీలకు ప్రాథమిక కారణమవుతాయి. పర్యావరణ మార్పులు అలర్జీలకు దారి తీసే మరో పెద్ద కారణం. దీనితోపాటు, తినే ఆహార పదార్థాలు, ధరించే దుస్తులు కూడా అలర్జీకారకమవుతాయి. అయితే, ఎక్కువమందిలో పొట్ట, చర్మం ప్రధాన అలర్జీ స్థావరాలుగా ఉంటాయి. అయితే, సేవించే ఆహార పానీయాలు, పీల్చే గాలి, తాకిన వస్తువులు, అలర్జీలకు వాహకాలుగా ఉంటాయి. పిల్లల్లో అలర్జీ మొదలవగానే, చర్మంపైన దురద, మంటలు తలెత్తుతాయి.
 
లక్షణాలను పసిగట్టాలి!
పొట్టనొప్పి, వాంతులు, విరేచనాలు, వయసుకు తగినట్టు పెరకపోవడం, ఎప్పుడూ చికాకుగా ఉండడం వంటివి ఉంటే, ఇవన్నీ జీర్ణవాహిక సంబంఽధమైన అలర్జీలని అనుమానించాలి. పదే పదే లక్షణాలు కనిపిస్తుంటే వ్యాధి మూలాల్ని, జన్యుపరమైన లోపాలను పసిగట్టలేకపోతున్నామేమోనని అనుమానించాలి. వారసత్వంగా వస్తున్న అలర్జీని ‘అటోపీ’ అంటారు. ఈ స్థితిలో ఉన్న పిల్లలకు తప్పనిసరిగా సీరమ్‌ ఐ.జి.ఇ. నిల్వలు ఎంత ఉన్నాయో పరీక్షించాలి. ఆహార పానీయాల్లో ఏవి పడతాయో ఏవి పడవో చూడటం, అలర్జీ స్ర్కీనింగ్‌ చేయించాలి. ఫలితాన్నిబట్టి అవసరమైన చికిత్సలు అందించాలి. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే సమస్య నిరంతరం పెరుగుతూ పోయే ‘అలర్జిక్‌ అటోపిక్‌ మార్చ్‌’ అనే సమస్య మొదలవుతుంది. ఈ పిల్లలే పెద్ద వాళ్లయ్యాక ఊపిరి తిత్తులు, ముక్కు, కళ్లు, సైనస్‌, చర్మం, పొట్ట అవయవాల్లో అలర్జీ సమస్యలతో బాధపడతారు. శ్వాసవాహికలు అలర్జీలతో మూసుకుపోయి పొడి దగ్గు, ఆయాసం వస్తాయి. మందులు వాడగానే తగ్గడం కొద్ది రోజుల్లోనే మళ్లీ రావడం, ప్రారంభంలో పొడి దగ్గు ఉన్నా, తర్వాత చిక్కని, పచ్చని తెమడ ఉంటాయి. కళ్లు నీరు కారతాయి.
 
ఎనలాఫ్సిస్‌ అనే అలర్జీ ప్రాణాంతకం. సత్వర చకిత్స అందకపోతే ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి అలర్జీ ఎలాంటిదైనా, లక్షణాలు కనిపించిన వెంటనే 18004250095 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్‌ చేసి వివరాలు, వైద్య సహాయం పొందవచ్చు.
 
మహిళల్లో, వృద్ధుల్లో..
హార్మోన్లలో తేడాల కారణంగా బహిష్టుకు ముందు, బహిష్టు సమయంలో మహిళలు అలర్జీలకు గురవుతూ ఉంటారు. బహిష్టుకు ముందు అర్టికేరియా దద్దుర్లు వస్తుంటాయి. నివారణ చర్యలు తీసుకోకపోతే గర్భధారణ సమయంలో అలర్జీలుతీవ్రం కావడం, దద్దుర్లు రావడం జరుగుతుంది. ఆస్తమా లక్షణాలు కూడా మొదలవుతాయి. వృద్ధుల్లో కంటి అలర్జీలు, సైనస్‌ అలర్జీలే ఎక్కువ. వృద్ధులు ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువ కాబట్టి అంతిమంగా ఇవి అలర్జీలకు దారి తీస్తాయి.
 
అలర్జీ స్ర్కీనింగ్‌!
ఎలాంటి అలర్జీ ఉందో కనిపెట్టడం కోసం ‘మాడిఫైడ్‌ అలర్జీ స్కిన్‌ ప్రిక్‌ టెస్ట్‌’ అనే పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో భాగంగా ముంజేతి మీద అలర్జెన్లను గుచ్చి, లక్షణాల ఆధారంగా 80 రకాల అలర్జీలను కనిపెట్టే వీలుంది. పర్యావరణంలోని కారణాలు కూడా తెలుస్తాయి. ఒకప్పుడు బాగా పడిన పదార్థాలు కూడా ఆ తర్వాత పడకపోవచ్చు. దానికి కారణం ఆ తర్వాత కాలంలో శరీరంలో, రక్తకణాల్లో వచ్చిన మార్పులే కారణం. ఆ తర్వాత పడని పదార్థాలు శాశ్వతంగా కాకపోయినా కనీసం రెండు, మూడు ఏళ్లపాటు మానేయాల్సి ఉంటుంది.
 
ఇలా తగ్గించుకోవచ్చు!
లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే, సమస్య మరింత జటిలమవుతుంది. కాబట్టి మూలాలను గ్రహించి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాలి.
ఊపిరి తిత్తుల్లో వచ్చిన అలర్జీ కొందరిలో ఆస్తమాగా బయటపడుతుంది. ఊపిరి తిత్తుల్లో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌, అలర్జీలు ముక్కులో ఏర్పడితే ఆ భాగంలో బొడిపెలు ఏర్పడటం జరుగుతుంది. అలర్జీ కారకాలను నివారించకపోతే, ఫలితంగా చేసే సైనస్‌ సర్జరీలు కూడా విఫలమవుతూ ఉంటాయి.
సైన్‌సకు యోగాలోని జలనీతి ఫలితాన్నిస్తుంది. ప్రాణాయామం, కపాలభాతి, పవన భస్త్రికలు అలర్జీ నియంత్రణకు తోడ్పడతాయి. సమస్య జటిలంగా ఉన్నప్పుడు వైద్య చికిత్సలు తీసుకుంటూ, వీటిని కొనసాగిస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి.
గొంతు అలర్జీ ఉంటే గోరువెచ్చని నీళ్లల్లో చిటికెడు ఉప్పు వేసుకుని ఆ నీళ్లలోని గొంతులో పోసుకుని గార్‌గ్లింగ్‌ చేయడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు.

అలర్జీలను దీర్ఘకాలికంగా నిర్లక్ష్యంగా చేస్తే ఎనిఫలాక్టిక్‌ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ షాక్‌కు గురైన వ్యక్తికి 5 నిమిషాల్లో వైద్య చికిత్సలు అందకపోతే, ప్రాణాలకే ప్రమాదం.

డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్‌

అశ్విని అలర్జీ క్లినిక్‌,
చిక్కడపల్లి, హైదరాబాద్‌.