సొమ్మసిల్లడం వెనక!

14-10-2019: జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు సొమ్మసిల్లి (సింకోప్‌) పడిపోని వాళ్లు దాదాపు ఎవరూ ఉండరు. దీనికి చాలా మంది పని ఒత్తిళ్లు, నిద్రలేమి, పోషకాహార లోపాల వంటి వాటినే కారణంగా అనుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు అదీ నిజమే కానీ, మరికొన్ని కారణాలు కూడా ఇందుకు దారి తీసే అవకాశం ఉంది. అయితే ఏ కారణంగా పడిపోయినా, ఎక్కువ సార్లు బలంగా గాయాలవుతాయి. ఒకవేళ తలకు గాయమైతే, ప్రాణాపాయం కూడా జరగవచ్చు. సొమ్మసిల్లడానికి గుండె లయ తప్పి కొట్టుకోవడం కూడా ఒక కారణం కావచ్చు. మెదడుకు సరిపడా రక్తం అందకపోవడం కూడా కారణం కావచ్చు. సాధారణంగా, గుండె మెదడుకు సరిపడా ఆక్సిజన్‌ అందించలేనప్పుడు ఇలా జరుగుతుంది. దాదాపు అన్ని వయసుల వారూ ఈ సమస్యను ఎదుర్కొంటారు.

కాకపోతే, ఆయా వ్యక్తుల వయసును బట్టి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. అయితే, సొమ్మసిల్లి పడిపోవడానికి ముందు గుండె దడ, తలతిరగడం, మగత, నీరసం, నిస్సత్తువ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే డాక్టర్‌ను సంప్రతిస్తే, ఆ తర్వాత గాయాలపాలయ్యే ప్రమాదాన్ని నియంత్రించవచ్చు. సొమ్మసిల్లి పడిపోవడానికి చాలామంది నరాల బలహీనతే కారణంగా చెబుతుంటారు. కానీ, ఎక్కువ సార్లు దాని వెనక గుండె సంబంధ కారణాలే ఉంటాయి. ఒక్కోసారి గుండె గదుల్లో జరిగే విద్యుత్‌ ప్రసరణలో తేడా వచ్చి కూడా గుండె లయతప్పి కొట్టుకోవచ్చు. అదే నిజమైతే అత్యవసరంగా పేస్‌మేకర్‌ పెట్టాల్సి రావచ్చు. ఏమైనా ప్రాణాపాయానికి కూడా దారి తీసే ఈ పరిస్థితిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా హృద్రోగ నిపుణులను సంప్రతించడం తప్పనిసరి!
 
డాక్టర్‌ కలంబూర్‌ నర్సింహన్‌
డైరెక్టర్‌, అరిథ్మియా అండ్‌ ఎలకో్ట్రఫిజియాలజీ సర్వీసెస్‌