వెన్నునొప్పి దూరం!

27-08-2019: ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సందర్భంలో వేధించే ఇబ్బంది ‘వెన్నునొప్పి’. ఈ సమస్యకు కారణాలేంటి? ఎలాంటి నొప్పి ప్రమాదకరం? అనే విషయాలపై అవగాహన ఏర్పరుచుకోవడం ఎంతో అవసరం!
 
ఎక్కువ సమయం పాటు కూర్చుని చేసే ఉద్యోగాలు, స్థూలకాయం, సరైన భంగిమ పాటించకుండా బరువులు ఎత్తడం, ఎక్కువసేపు ఒకే భంగిమలో నిలబడడం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు... ఇలా వెన్ను, నడుము నొప్పికి బోలెడన్ని కారణాలు. వాటితోపాటు బాల్యంలో బరువైన పుస్తకాల బ్యాగు వీపున మోయడం మూలంగా నడుము మీద పడిన ఆ భారం యుక్తవసులో ప్రభావాన్ని చూపించవచ్చు. అది వెన్నునొప్పిగా యవ్వనంలో బయల్పడవచ్చు. ఉద్యోగులు ఎక్కువ సమయంపాటు కుర్చీలో ఒకే భంగిమలో కూర్చుని పని చేయడం వల్ల కూడా నొప్పి మొదలవవచ్చు. స్థూలకాయులైన గృహిణులు ఎక్కువ సమయంపాటు వంటగదిలో నిలబడి పని చేయడం వల్ల శరీర బరువు వెన్ను మీద పడి నొప్పి మొదలవవచ్చు. ఈ నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో, అలవాట్లలో, శరీర భంగిమల్లో మార్పులు చేసుకోవాలి.
 
అప్రమత్తత అవసరం!
బరువులు ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచాలి. స్థూలకాయులైతే అధిక బరువు తగ్గించుకోవాలి. ఎక్కువ సమయం కుర్చీలో కూర్చుని పని చేసేవాళ్లు మధ్యమధ్యలో లేచి పది నిమిషాలు నడుస్తూ ఉండాలి. వెన్ను నొప్పి వేధిస్తుంటే వైద్యులను కలిసి కారణాలు తెలుసుకొని, వారి సూచనలు పాటించాలి. ఒకవేళ వెన్ను సమస్య జీవనశైలి మార్పులతో తగ్గిపోనప్పుడు ‘స్పైన్‌ ఎండోస్కోపీ’ శస్త్రచికిత్సను ఆశ్రయించవచ్చు. వెన్నునొప్పి, డిస్క్‌ ప్రొలాప్స్‌ సమస్యలకు పూర్వం వెన్ను ప్రదేశంలో గాటు పెట్టి సర్జరీ చేసేవారు. కానీ ఇప్పుడు అత్యాధునిక స్పైన్‌ ఎండోస్కోపీ సహాయంతో గాటుతో పని లేకుండా, వెన్ను కండరాలకు నష్టం కలగకుండా, రోగి త్వరగా కోలుకునేలా సర్జరీ ముగించే వీలుంది. ఈ సర్జరీలో సమస్యకు కారణమైన ప్రదేశాన్ని వైద్యులు తేలికగా, స్పష్టంగా గుర్తించి సరిదిద్దే వీలుంటుంది. కాబట్టి వెన్నునొప్పికి కారణాలను పరిశీలించుకుని, వైద్యులు సూచించిన చికిత్స ద్వారా సమస్యను శాశ్వతంగా
అధిగమించవచ్చు.
డాక్టర్‌ సుకుమార్‌ సూర
సీనియర్‌ స్పైన్‌ అండ్‌ న్యూరో సర్జన్‌, హైదరాబాద్‌.