ఆయుర్వేదం... ప్రకృతి వైద్యం...ఆరోగ్య భాగ్యం

22-10-2019: కీళ్ల నొప్పులు, మధుమేహం, స్థూలకాయం... జీవనశైలి రుగ్మతలను ముందుగానే కనిపెట్టే వెసులుబాటు ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో ఉంది. ముందస్తు పరీక్షలతో రుగ్మతలను పసిగట్టి వాటిని నియంత్రించుకుంటే, ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది.
 
జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలనీ, నిరంతరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ ఎవరికి మాత్రం ఉండదు? అయితే, చాలా మంది ఏదైనా జబ్బున పడినప్పుడు గానీ, తమ శరీర స్థితిగతుల్ని పట్టించుకోరు. నిజానికి జబ్బు పడిన తర్వాత ఆస్పత్రుల చుట్టూ చక్కర్లు కొట్టే కంటే, ఆ పరిస్థితి రాకముందే జాగ్రత్త పడితే మేలు కదా! ఆరోగ్య పరిరక్షణ కోసం అయ్యే ఖర్చుతో పోలిస్తే, అనారోగ్యానికి పెట్టే ఖర్చు 100 రెట్లు అధికంగా ఉంటోంది. ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే, అప్పుడప్పుడు కొన్ని వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయించుకోవడం ఎంతో శ్రేయస్కరం.
 
అయితే వ్యాపార దృష్టితో నడిచే కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య చికిత్సలకు రుసుము మరీ ఎక్కువ. ఆ ఖర్చులకు భయపడి ఎంతో మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇందుకు విరుగుడుగా హైదరాబాద్‌ (నిమ్స్‌)లో ఇటీవల ‘ఇంటెగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ ఒకటి ప్రారంభమైంది. రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని ‘నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ ‘నిమ్స్‌’లో ‘ఇంటెగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ కేంద్రం’ ఆరోగ్య పరిరక్షణకు తొలి ప్రాధాన్యమిస్తుంది.
 
నరాల జబ్బులకు...
మన శరీరం మాంసం, సిరలు, స్నాయువులు, అస్థులు, సంధులు అనే వాటితో నిర్మితమై ఉంటుంది. వీటి మధ్య పరస్పర సంబంధం ఉండేలా చేసేవి మర్మాలు. ఈ మర్మాలు 107. మొత్తం నరాల వ్యవస్థ అంతా ఈ మర్మాలతోనే అసుసంధానం అయి ఉంటుంది. ఈ మర్మాలకు ఏదైనా హాని జరిగినప్పుడు, వాటి మధ్య ఉండే పరస్పర సంబంధం తెగిపోతుంది. ఈ పరిణామంతో ప్రధానంగా సయాటికా, లంబార్‌ స్పాండిలోసి్‌సతో పాటు పలు రకాల నరాల జబ్బులు మొదలవుతాయి.
 
పరిష్కారం: నరాల జబ్బులకు ఆయుర్వేదంలోని మర్మ(మర్దన) చికిత్సలు ఎంతగానో తోడ్పడతాయి. కొన్ని రకాల గాయాల తాలూకు సమస్యలు ఎంతకూ తగ్గకుండా చాలా కాలం కొనసాగుతుంటాయి. తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తూనే ఉంటాయి. అలాంటి వాటిని మర్మ చికిత్స సమూలంగా తగ్గిస్తుంది. వ్యాయామం, శరీర శ్రమ లేకపోవడం వల్ల అవయవాలు శక్తిహీనంగా మారుతున్నాయి. అలాంటి వారికి మర్మ చికిత్సలు కొత్త శక్తిని నింపి, మొత్తం శరీర వ్యవ స్థను ఉత్తేజితం చేస్తాయి.
 
అజీర్తి వ్యాధులకు...
ఆయర్వేదం ఆకలిని జీవాగ్నిగా భావిస్తుంది. జఠరాగ్ని, ధాత్వగ్ని, పంచభూతాగ్ని లేదా సూక్ష్మాగ్ని అంటూ మూడు రకాలుగా విభజిస్తుంది. అయితే జఠరాగ్ని కేంద్రంగా ఉంటూ మిగతా రెండు అగ్నులను ప్రభావితం చేస్తూ ఉంటుంది. జఠరాగ్ని సరిగా పనిచేసినప్పుడే తిన్న ఆహారం సంపూర్తిగా జీర్ణమై అందులోని సారం శరీర ధాతువులన్నింటికీ చేరుతుంది. ఏ కారణంగానైనా ఆహార పదార్థాలు సరిగా జీర్ణం కానప్పుడు వ్యర్థ విషపదార్థాలతో కూడిన ‘ఆమం’ తయారవుతుంది. దీనివల్ల జీవక్రియలన్నీ కుంటుపడి, శరీర అవయవాలన్నీ శక్తిహీనమవుతాయి. ఫలితంగా శరీరం పలురకాల వ్యాధులకు గురవుతుంది.
 
పరిష్కారం: శరీరంలోని ఆమాన్ని తొలగించే పంచకర్మ చికిత్సలు అవసరమవుతాయి. అందులో భాగంగా, దోషహర చికిత్సలైన వమనం, విరేచనం, వస్తి, నస్య రక్తమోక్షణ అనే పంచకర్మ చికిత్సలు చేయవలసి ఉంటుంది. అప్పుడే ఆకలి పెరిగి జీవక్రియలన్నీ చక్కబడతాయి ఇదే సమయంలో దీపన పాచనతో పాటు, పిఛావస్తి చికిత్సలు కూడా ఇస్తే, పేగుల్లోని వాపులు తగ్గిపోయి ఐ.బి.ఎ్‌స(ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌) వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
 
కీళ్ల నొప్పులకు...
సంధివాతంగా పేర్కొనే కీళ్ల నొప్పులకు, వాతం ప్రకోపం చెంది, కీళ్లలో చేరిపోవడమే కారణం. దీనికి వాతకారకమైన ఆహార పానీయాలతో పాటు, జీవన శైలి లోపాలు కూడా కారణమే! సంధివాతానికి పంచకర్మ చికిత్సలు, శమన చికిత్సలు అనే రెండు రకాల వైద్యాలు ఉంటాయి. వీటిలో భాగంగా కొన్ని ఉప చికిత్సలు కూడా ఉంటాయి.
 
పరిష్కారం: కీళ్లనొప్పులకు కారణమైన దోషాలను, తొలగించడానికి ప్రధానంగా వస్తి చికిత్స ఉంటుంది. ఇక శమన చికిత్సలో భాగంగా బాహ్య చికిత్స, అభ్యంతర చికిత్సలు అంటూ రెండు రకాలుగా ఉంటాయి. బాహ్య చికిత్సలో భాగంగా స్నేహ, ఆలేపం, పరిశేకం వంటి చికిత్సలు ఉంటాయి. అభ్యంతర చికిత్సలో అరుగుదలకు గురైన కీళ్ల పైన, ఔషధీయ తైలాలతో మర్దనం చేయడం ఉంటుంది. ఇవన్నీ కీళ్ల నొప్పులను సమూలంగా తొలగిస్తాయి.
 
మోకాళ్లనొప్పులకు: కీళ్లు అరగడం, వాతం కారణంగా మోకాళ్లనొప్పులు తలెత్తవచ్చు. యుక్తవయస్కుల్లో తలెత్తే మోకాళ్లనొప్పులకు పలు కారణాలు ఉంటాయి.
 
పరిష్కారం: మోకాళ్ల నొప్పులకు జానువస్తి, గ్రీవవస్తి, వెన్నునొప్పికి కటివస్తి, ఉదర సంబంధ వ్యాధులకు పిఛావస్తి వంటి చికిత్సలు తోడ్పడతాయి. మోకాళ్ల నొప్పులకు నడక సరిగా లేకపోవడమూ కారణమే! దీనివల్ల కటి భాగం దెబ్బ తిని వెన్నునొప్పి కూడా మొదలవుతుంది. నడక, కూర్చోవడం వంటి భంగిమలను సరిచేయడం ద్వారా మోకాళ్ల నొప్పులతో పాటు స్పాండిలోసిస్‌ సమస్యలు కూడా తొలగించవచ్చు.
 
మధుమేహానికి...
షుగర్‌ నిల్వలు పెరిగిపోవడం అనేది శరీరంలో మలినాలు బాగా పేరుకుపోయాయని తెలియచెప్పే ఒక సంకేతం. ఈ స్థితిలో పేగులు, కాలేయం, క్లోమగ్రంథి బలహీనపడతాయి. మధుమేహానికి చికిత్స చేయడం అంటే ఆ అవయవాలను తిరిగి బలోపేతం చేయడమే! అందుకు ఆయా భాగాల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపడమే పరిష్కారం.
 
పరిష్కారం: వమన చికిత్స ద్వారా వ్యర్థాలను బయటకు పంపడం సాధ్యపడుతుంది. ఔషధీయమైన నెయ్యిని కడుపులోకి పంపించడం ద్వారా ఆ మలినాలను బయటికు పంపించాల్సి ఉంటుంది. ఇలా మళ్లీ మళ్లీ చేస్తే శరీరంలోని మలినాలన్నీ బయటకు వస్తాయి. ఫలితంగా కాలేయం, క్లోమగ్రంథితో పాటు నాడీ వ్యవ స్థ అంతా చక్కబడుతుంది. క్రమానుగతంగా మధుమేహం నుంచి విముక్తి పొందే అవకాశం లభిస్తుంది. దీనికితోడు ప్రకృతి వైద్యంగా కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు ఉంటాయి. వీటి వల్ల హైపోథాలమస్‌, పిట్యూటరీ గ్రంథులు ఉత్తేజితమవుతాయి. సూర్యనమస్కారాలు, ప్రాణాయామం కూడా ఇందులోభాగంగా ఉంటాయి. ఇవన్నీ మధుమేహాన్ని తగ్గిస్తాయి.
 
స్థూలకాయానికి....
ఆహారంలోని పోషకాలు కణజాలానికి సరిగా అందకపోవడంతో అవి కొవ్వుగా మారడమే ఇక్కడ సమస్య. ఏవి తినాలో ఏవి తినకూడదో ఒక స్పష్టత లేక పోవడం కూడా సమస్యే!
 
పరిష్కారం: ప్రకృతి వైద్యంలో భాగంగా వీరికి ఆహార చికిత్స, మర్దన చికిత్స, యోగ చికిత్సలు ఉంటాయి. వీటి వల్ల శరీరం బరువు తగ్గడమే కాదు, జీవక్రియలన్నీ ఉత్తేజితం కావడంతో శరీరమూ, మనసూ, ఉత్సాహం, ఉల్లాసాలతో నిండిపోతాయి.
‘‘ఆరోగ్యంగానే ఉన్నాం అనుకునేవాళ్లలో కొంత మంది హెల్త్‌ చెకప్స్‌కు వచ్చేనాటికి, ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నట్లు బయటపడుతుంది. అలాంటి వారికి. అవసరాన్ని బట్టి ఆయుర్వేద వైద్య విధానంలోనూ, ప్రకృతి వైద్య విధానంలోనూ ఇక్కడ చికిత్సలు అందిస్తారు. ఇంకా అవసరం అనుకుంటే, ఆయా వ్యాధుల తీవ్రతను బట్టి వెల్‌నెస్‌ సెంటర్‌కు అనుబంధంగా పనిచేసే నిమ్స్‌ హాస్పిటల్‌లోని సంబంధిత వ్యాధి నిపుణుల పర్యవేక్షణలో ఆయుర్వేద, ప్రకృతి వైద్య చికిత్సలు లభిస్తాయి.’’
- డాక్టర్‌ ఎం. నాగలక్ష్మి