అల్జీమర్స్‌ను పసిగట్టే రక్తపరీక్ష!

24-09-2019: అల్జీమర్స్‌ అంటే ఎవరైనా హడలెత్తిపోవలసిందే! దూరపు పరిచితులనే కాదు, అయినవాళ్లనూ అత్మీయులనూ చివరికి జీవిత భాగస్వామిని కూడా గుర్తించలేని తనం ఎంత బాధాకరం. అందుకే ఆ పేరు వింటనే అంత భయం. అయితే ఇటీవల ఈ సమస్యకు ఒక కొత్త విరుగుడు దొరికింది. అల్జీమర్స్‌కు కారణమయ్యే అమిలాయిడ్‌ బీటా ప్రొటీన్లు ఆ వ్యాధి లక్షణాలు బయటపడటానికి 20 ఏళ్ల ముందే మెదడులో పోగగవడం మొదలవుతుందని ఇటీవలి పరిశోధనల్లో స్పష్టమయ్యింది.
 
అందువల్ల అది గమనించిన వెంటనే వైద్య చికిత్సలకు దిగిపోవాలి. ఎందుకంటే, మతి మరుపు, అయోమయం వంటి అల్జీమర్స్‌ లక్షణాలు ఒకసారి మొదలయ్యాక ఎవరి చేతిలోనూ ఏమీ ఉండదు. దాని తాలూకు దుష్ప్రభావాలనుంచి కొంత కాపాడుకోవడానికి తప్ప అల్జీమర్స్‌ను నిర్మూలించే అవకాశమైతే ఉండదు. అందువల్ల రక్తంలోని ప్రొటీన్‌ నిల్వలను ముందే కొలవడం ద్వారా అప్పటికే మెదడులో ప్రొటీన్‌ పేరుకుపోయిందనేది తెలుసుకోవాలి.
 
రక్తపరీక్ష ద్వారా తెలుసుకునే ఆ వివరాలు 88 శాతం కచ్ఛితత్వంతో ఉంటాయి. అల్జీమర్స్‌ అప్పుడప్పుడే మొదలైన వాళ్ల విషయంలో అయితే, వాళ్ల వయసును, వాళ్ల రక్తంలో ఉండే ఏపీఓఇ-4 అనే జన్యు అంశాలను పరిశీలించడం ద్వారా అల్జీమర్స్‌ పరిస్థితి 94ు కఛ్ఛితత్వంతో అంచనా వేసే అవకాశాలు ఉంటాయి. ‘న్యూరాలజీ’ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక వ్యాసంలో పేర్కొన్న వివరాలను బట్టి, మతిమరుపు, అయోమయం లాంటి అల్జీమర్స్‌ తాలూకు ఏ లక్షణాలూ లేని 160 మందిపై రక్త పరీక్షలు చేశారు.
 
అందులో 50 మంది మెదళ్లలో ప్రొటీన్‌ పేరుకుపోయినట్లు తేలింది. రక్తం ద్వారా సమస్యను ముందే తెలుసుకుని వైద్య చికిత్సలు తీసుకోవడం వల్ల అల్జీమర్స్‌ను అసలు రాకుండానే నివారించే అవకాశాలు కూడా ఉంటాయి. లేదా వ్యాఽధి ఇంకా పెరగకుండా నియంత్రించే అవకాశాలైనా ఉంటాయి. ఏమైనా వ్యాధి లక్షణాలు మొదలయ్యాక ఏమీ చేయలేక వ్యధకు గురికావడం కన్నా రాబోయే సమస్యను ముందే గమనించి తక్షణ వైద్య చికిత్సల ద్వారా ఆ బాఽధల నుంచి బయటపడటం మేలే కదా!