వృద్ధులకు వరం

18-07-2017:నిత్యం యోగ చేయడం వల్ల వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని కోల్పోరు. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సహజంగా వయసు పెరిగే కొద్దీ ఆలోచనా సామర్థ్యం తగ్గిపోవడంతోపాటు జ్ఞాపక శక్తి కూడా క్షీణిస్తుంది. ఇంతకూ ఈ పరిస్థితిని అధిగమించడం ఎలా అంటారా.... దీనికి యోగకు మించిన మందు లేదని అధ్యయనకారులు సైతం తేల్చారు. నిత్యం యోగ చేయడం వల్ల కండరాలు, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే యోగ చేసేటప్పుడు ఏకాగ్రత, ధ్యానం చాలా అవసరం. దీర్ఘకాలంగా యోగ సాధన చేస్తున్న సీనియర్‌ సిటిజన్లలో మెదడుపనితీరు, జ్ఞాపక శక్తి ఎలా ఉందన్నదానిపై అధ్యయనకారులు పరిశోధనలు చేశారు. యోగ సాధన చేయకుండా ఆరోగ్యంగా ఉన్న సీనియర్‌ సిటిజన్స్‌ను కూడా పరీక్షించారు. ఈ రెండు రకాల వ్యక్తుల మధ్య ఎలాంటి తేడాలు కనపడ్డాయో గమనించారు. అధ్యయనం చేసేందుకు ఎనిమిదేళ్లుగా కనీసం వారానికి రెండు పర్యాయాలు యోగ చేస్తున్న కొంతమంది సీనియర్‌ మహిళలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. యోగ, ధ్యానం చేయని మహిళలకు, వీటిని చేస్తున్న ఆడవాళ్లకు మధ్య ఉన్న తేడాలను పరిశీలించారు. మాగ్నటిక్‌ రెసొనెన్స్‌ ఇమేజింగ్‌ ప్రక్రియ ద్వారా వీరి మెదడు నిర్మాణంలో ఏవైనా మార్పులు సంభవించాయా అనే విషయాన్ని పరిశీలించారు. ఈ అధ్యయనాల్లో తేలిందేమిటంటే యోగ చేసిన వారిలో జ్ఞాపకశక్తి తదితర కాగ్నిటివ్‌ ఫంక్షన్లకు కారణమైన మెదడులోని భాగం ఎంతో దృఢంగా ఉండడాన్ని గుర్తించారు. దీన్నిబట్టి వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, బాగా ఆలోచించడానికి, జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉండడానికి యోగ ఎంతో బాగా ఉపయోగపడుతుందని అర్థమైంది కదూ...