ఊపిరాడదు.. ఎందుకని?

30-5-2017: ప్రశ్న: మా నాన్నగారికి 69 ఏళ్లు. గత కొంత కాలంగా ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నారు. అయినా ఈ పరిస్థితికి గల కారణాలేమిటి? బ్రాంకైటిస్‌ అనుకోవడానికి ఆయనకు పొగతాగే అలవాటు కూడా లేదు. రిటైరైనా మొన్నటిదాకా ఏవో పనుల్లో బిజీగా ఉండేవారు. ఇప్పుడు ఏ చిన్న పనిచేసినా ఆయాసం వస్తోంది. ఒక్కోసారి అడుగు తీసి అడుగు వేసినా ఆయాసం వస్తోంది.అందుకే ఇంటివద్దే ఉంటున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో చెప్పండి.

- ఎల్‌. వికాస్‌, రాజమండ్రి


జవాబు: గుండె సక్రమంగా పనిచేయని వారిలో కనిపించే ఒక సాధారణ లక్షణమిది. ఏదైనా శ్రమ చేస్తున్నప్పుడు గానీ, నడుస్తున్నప్పుడు గానీ, చివరికి  విశ్రాంతిగా పడుకున్నప్పుడు కూడా కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఆయాసం ఉంటాయి. ఇది వారి గుండె ఏ స్థాయులో పనిచేస్తోందో తెలియజేసే సంకేతం. గుండె పనితనం తగ్గిపోతున్న కొద్దీ ఊపిరి ఆడని సమస్య మరింత ఎక్కువవుతుంది. సమస్య ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఏదైనా శ్రమ చేస్తున్నప్పుడు మాత్రమే ఊపిరి ఆడని పరిస్థితి ఉంటుంది. సమస్య తీవ్రమయ్యాక  చిన్నచిన్న పనులకే ఊపిరి ఆడటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక్కోసారి పడుకుని నిద్రపోతున్నప్పుడు కూడా ఊపిరి ఆడక గబాల్న లేచి కూర్చుంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే శ్వాసపరమైన సమస్యలన్నింటికీ గుండె పనితనం లోపమే కారణం కాకపోవచ్చు. కొందరిలో ఇది తీవ్రమమైన రక్తహీనత వల్ల కూడా శ్వాసపరమైన సమస్యలు తలెత్తవచ్చు. ఎంఫిసీమా అనే మరో సమస్య వల్ల కూడా ఈ శ్వాస సమస్యలు రావచ్చు. అందువల్ల డాక్టర్‌ను సంప్రతిస్తే మీ నాన్నగారి సమస్యేమిటో  కొన్ని పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. ఆ తర్వాత అవసరమైన చికిత్సలు తీసుకుంటే ఆ సమస్య నుంచి పూర్తి స్థాయిలో బయటపడవచ్చు.
డాక్టర్‌ ఎన్‌. కార్తీక్‌, పల్మనాలజిస్ట్‌