అలా వెళ్లొస్తుంటేనే ఆయుష్షు!

17-07-2018: ఆరోగ్యం కోసం, ఆయుర్వవృద్ధి కోసం తీసుకోవలసిన ఔషధాలు, చేయవలసిన సాధనాల గురించిన అనేక విషయాలు నిత్యం మన చెవిలో పడుతూనే ఉంటాయి. అయితే అవేవీ లేకుండానే ఆయుష్షు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. కేవలం రోజూ ఇల్లు దాటి కాసేపు అలా వెళ్లొస్తే చాలు వయోవృద్ధుల ఆయుష్షు పెరుగుతుందని, ‘జోర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ జేరియాట్రిక్స్‌ సొసైటీ’ అనే ఇటీవలి సంచికలో ఈ విషయాలు ప్రచురితమయ్యాయి. పనితనంలో ఇబ్బందులు, వైద్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ, రోజూ ఇల్లు దాటి బాహ్య ప్రదేశాల్లో కాసేపు గడిపే 70 నుంచి 90 ఏళ్ల మధ్యనున్నవాళ్లను వారు పరిశీలిచారు. ఇల్లు దాటకుండా ఉండిపోయే వాళ్లతో పోలిస్తే, రోజూ బయటికి వెళ్లి వచ్చే వారి ఆయుష్షు గణనీయంగా పెరిగినట్లు ఆ పత్రికల్లో పేర్కొన్నారు. వృద్ధులను ఈ పరిశోధకులు మూడు బృందాలుగా ముందు విభజించారు.
 
వారిలో ప్రతిరోజూ బయటికి వెళ్లే వారు, వారానికి 2నుంచి 5 సార్లు వెళ్లేవారు, చాలా అరుదుగా అంటే, వారానికి ఒకసారి కన్నా తక్కువగా బయటికి వెళ్లే వారు ఇలా వృద్ధుల్ని వీరు మూడు బృందాలుగా విభజించారు. వీళ్లందరిలో మరణాల రేటును గమనిస్తే, రోజూ బయటికి వెళ్లే వారిలో చాలా తక్కువగానూ, ఎప్పుడో అరుదుగా మాత్రమే వెళ్లే వాళ్లల్లో చాలా ఎక్కువ గానూ ఉన్నట్లు వారు కనుగొన్నారు. విశేషమేమిటంటే, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యల వంటి తీవ్రమైన వ్యాధులు ఉన్నవారి ఆయుష్షు కూడా రోజూ బయటికి వెళ్లడం వల్ల పెరిగినట్లు ఆ అధ్యయనాల్లో వెల్లడయ్యింది. మౌలికంగా, రోజూ బయటికి వెళ్లడం ద్వారా బాహ్య ప్రపంచంతో వీరికి ఏర్పడే అనుబంధమే వీరి జీవచైతన్యం పెరగడానికీ, తద్వారా ఆయుష్షు పెరగడానికీ కారణమవుతున్నట్లు ఆ వ్యాస రచయితలు వివరించారు.