ఈ మాత్రతో.. వయసుకు కళ్లెం

వయసు కనిపించకుండా చిన్నవాళ్లల్లా ఉండడం, పది కాలాలపాటు ఆరోగ్యంగా జీవించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? శుభవార్త ఏమిటంటే ఆ దిశగా శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు.  దాని ప్రకారం మధుమేహ వ్యాధికి ఉపయోగించే మెట్‌ఫార్మిన్‌ మందు ప్రజలు దీర్ఘకాలం జీవించడానికి సహాయపడ్డమే కాకుండా వారిని ఎక్కువకాలం ఆరోగ్యవంతులుగా కూడా ఉంచుతుందట. జంతువుల జీవితకాలాన్ని పొడిగించడంలో కూడా ఇదెంతో కీలకంగా వ్యవహరించిన విషయాన్ని అధ్యయనకారులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. కార్డిఫ్‌ యూనివర్సిటీ అధ్యయనకారులు దీనిపై అధ్యయనం చేశారు. దాని ప్రకారం  డయాబెటి్‌స-2తో బాధపడుతూ  మెట్‌ఫార్మిన్‌ తీసుకుంటున్న పేషంట్లు  సాధారణ ఆరోగ్యవంతులకన్నా 15 శాతం ఎక్కువ కాలం జీవించినట్టు వెల్లడైంది. 

డయాబెటిక్‌ కాని వారి జీవిత కాలాన్ని కూడా ఈ రకంగా పొడిగించే అవకాశం ఉందా? ఇదే ప్రశ్న న్యూయార్కులోని ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసెన్‌లోని  ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఏజింగ్‌ రీసెర్చ్‌’ డైరక్టర్‌ నిర్‌ బార్‌జిలైకి వచ్చింది. ఆ దిశగా అధ్యయనం చేశారు కూడా. జంతువులపై చేసిన పరీక్షల్లో, అలాగే ఇన్‌ విట్రో పరీక్షల్లో తేలిందేమిటంటే  వయసు సంబంధమైన మెటబాలిక్‌, సెల్యులర్‌ ప్రోసె్‌సలలో  మెట్‌ఫార్మిన్‌ మార్పు తెస్తుందట. ఈ ట్రయిల్‌కు సంబంధించి అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ వారితో కూడా ఈ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనకారులు సంప్రదించారు. ఏజింగ్‌ని ఎలా ట్రీట్‌ చేయాలనే అంశాన్ని చర్చించారు. ఏజింగ్‌ని  కేవలం వయసుతోపాటు  జరిగే సహజప్రక్రియగా కాకుండా  చికిత్సనందించగల జబ్బుగా పరిశీలించాలని అధ్యయనకారులు భావిస్తున్నారు. అతి త్వరలో యాంటి ఏజింగ్‌ మందుపై అమెరికాలో  క్లినికల్‌ ట్రయల్స్‌ జరగనున్నాయన్నమాట...అదే కనుక సక్సెస్‌ అయితే అతి త్వరలోనే యాంటి ఏజింగ్‌ మాత్ర ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు అందరూ ఎవర్‌గ్రీన్‌గా ఉంటారేమో...!