అరవై దాటాక... ఆ రోగ్యం

11-8-15

 
అరవై ఏళ్లు దాటాయో లేదో.. వయసు అయిపోయిందనుకుంటారు..! నాలుగడుగులు వేస్తే కాళ్ల నొప్పులు.. తింటే ఆయాసం.. తినకపోతే నీరసం.. ఇదీ సంగతి. అయితే మంచి డైట్‌ ఫాలో అవుతూ.. ప్రతిరోజూ ఓ గంట సమయం ఫిజికల్‌ యాక్టివిటీకి కేటాయిస్తే ముదిమి వయసులోనూ ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు వైద్యులు.
 
అరవై ఏళ్లు దాటాక శరీరం తొందరగా అలసిపోతుంది. ఆహారనియమాలు. అలవాట్లు కూడా ఈ వయసులో ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ధూమపానం అలవాటు ఉన్నవారు అరవయ్యో ఒడిలో పడగానే స్మోకింగ్‌కు చెక్‌ పెట్టేయాలి. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించిన స్మోకింగ్‌ వీడకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
గుండె గురించి..
60 నుంచి 70 ఏళ్ల మధ్య గుండె జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే అరవైలోకి రాగానే డైట్‌లో మార్పులు తప్పనిసరిగా పాటించాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. వైద్యుల సూచన మేరకు ఉప్పు వాడకం తగ్గించాలి.
సరైన బరువు..
రిటైర్‌ అయ్యాక రోజంతా ఇంట్లోనే ఉండటం.. వేళకు భోజనం చేయడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, మధ్యాహ్నం వేళలో నిద్రపోవడం.. ఇవన్నీ ఒబెసిటీకి దారితీస్తాయి. ఒబెసిటీ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. కండరాల్లో కొవ్వు చేరితే.. అనేక జబ్బులకు దారితీస్తుంది. ప్రొటీన్లు, ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ తీసుకోవాలి. మధ్యాహ్నం వేళలో కునికిపాట్లను దూరం ఉంచాలి. బద్ధకాన్ని వదిలించుకుంటే అనారోగ్యం మీ ఛాయలకు రాదు.
వ్యాయామం..
ఆరవైలో ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం సకల సమస్యలకు చెక్‌ పెడుతుంది. అలాగని భారీ వర్కవుట్స్‌ చేయాల్సిన అవసరం లేదు. ఉదయం, సాయంత్రం వాకింగ్‌.. ఒక దినచర్యగా పాటించాలి. ప్రాణాయామంతో పాటు అనుభవజ్ఞుల పర్యవేక్షణలో యోగాసనాలు వేయండి. ఇవి ఫాలో అయితే వయసు పైబడుతున్నా వృద్ధాప్యం మీ చెంతకు రాదు.
హెల్దీ డైట్‌..
పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలి. పళ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల 
 
జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. పాలు, వెన్న, పెరుగు వంటి ఫ్యాట్‌ ఉండే పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. మాంసాహారులైతే స్కిన్‌లెస్‌ చికెన్‌,  చేపలు అప్పుడప్పుడూ తీసుకోవచ్చు. రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన రొట్టెలకు మీ డైట్‌లో చోటివ్వండి. మొలకెత్తిన గింజలను తరచూ తీసుకోండి. ఈ టిప్స్‌ ఫాలో అయిపోతే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.