ఒంటరి వృద్ధులకు శృంగారం ఓ వరం!

28-02-2018:అరవైదాటిన వయసులో సెక్స్‌ గురించి మాట్లాడకూడదా? ఆ వయసులో కూడా సెక్స్‌ సామర్ధ్యం ఉండీ భాగస్వామిని కోల్పోయినవారు బలవంతంగా తమ కోరికల్ని అణచుకుంటున్నారా ? అనే ప్రశ్నలకు ఔననే చెబుతున్నారు పరిశోధకులు.. 

ఆకలి, నిద్ర, సెక్స్‌ ఈ మూడూ ప్రకృతి మనిషికి ఇచ్చిన వరాలు. తాను నిర్మించుకున్న సమాజంలో మనిషి బాధ్యతగా ప్రవర్తించడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి ఈ మూడు నిత్యం అతడికి తోడుగా ఉంటాయి. ఒకటి శక్తిని ఇస్తే, మరొకటి అలసటను తీరుస్తుంది. మరొకటి శారీరక ఉత్తేజాన్ని, భవబంధాలను సృష్టిస్తాయి. వీటికి వయసుతో నిమిత్తంలేదు. 

సిగ్గుమాలిన పనికాదు
‘చాల్లెండి ఎవరైనా నవ్విపోతారు, మనవలున్నారని మరచిపోయారా? సిగ్గులేకపోతే సరి, ఈ వయసులో ఇంకా...చింత చచ్చినా పులుపు చావలేదని....’ అనే భార్యల దగ్గర కొందరు చలాకీ వృద్ధులు అక్షతలు వేయించుకుంటూ ఉంటారు. అరవై వయసులో సెక్స్‌ను స్ర్తీలు సహజంగా తప్పుగా భావిస్తారు. 
ఏ కారణంగానోగానీ సెక్స్‌ అనగానే, తమలో సామర్ధ్యం ఉన్నప్పటికీ, ఆ కోరికలున్నప్పటికీ కొందరు పెద్దలు తమచుట్టూ ఉన్న సంఘ వాతావరణం, పెద్దరికం సంకెళ్ళవల్ల వాటిని అణచుకోవడానికి ప్రయత్నిస్తారు. ‘పిల్లలు ఎంజాయ్‌ చేస్తారులే, మన పెద్దరికం పోతుంది’ అనే భావన చాలామంది వృద్ధులు వ్యక్తం చేస్తారు. కానీ ఆరవై దాటాక కూడా సెక్స్‌లో పాలొనడం ఆరోగ్యదాయకమని ఇప్పటికే చాలా పరిశోధనలు వెల్లడించాయి. మతపరమైన విశ్వాసాలు, పెద్దరికం పేరుతో ఉండే సంకెళ్ళు మెల్లిగా విడిపోతూ ఉండటంవల్ల అరవైదాటినవారు కూడా వివిధ కారణాల రీత్యా పునర్వివాహాలకు, సహజీవనానికీ ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. అలాంటి సాహిత్యం కూడా తెలుగు, ఆంగ్ల భాషల్లో రచయితలు ఇటీవల నిర్భయంగా ప్రెజెంట్‌ చేస్తూ ఉండటం కూడా సరికొత్త పోకడమాత్రమే కాదు, వృద్ధులు ఆరోగ్యరీత్యా శుభపరిణామం కూడా.
మన పురాతన గ్రంథాలు తిరగేస్తే వృద్ధాప్యంలో కూడా శారీకర వాంఛల్ని తీర్చుకుని ఆరోగ్యంగా జీవించిన కథలెన్నో  యయాతి, చ్యవనమహర్షి, శంతనుడు లాంటి పాత్రల ద్వారా మనకు తెలుస్తాయి. ఆ కథలన్నీ చదివినప్పుడు ఒక అడ్వాన్స్‌డ్‌ సమాజాన్ని చూసినంత ఆశ్చర్యం మనకు కలుగకమానదు. 

సెక్స్‌లో శిఖరస్థాయికి చేరే వయసిదే

వృద్ధాప్యంలో ఒంటరి వృద్ధులు కేవలం భక్తిమార్గమే అనుసరించాలనే మూస నిబంధనలకు ఇప్పుడు కాలం చెల్లింది. చాలామంది రిటైర్మెంట్‌ తర్వాత నచ్చిన వ్యాపకాలు చేపట్టి, ఆ వయసులో మంచి జోడీని కూడా ఎంచుకుని ఇష్టమైనవిధంగా బతకడం చూస్తూనే ఉన్నాం. కొందరుమాత్రం పాతచట్రంలోంచి బయటపడలేక ఏకాకులుగా  ఉంటూ కుంగుబాటుకు  గురవుతున్నారు. ఉల్లాసంగా జీవితం గడపడానికీ, మానసిక ఉల్లాసం కోల్పోకుండా ఉండటానికీ ఆ వయసులో శృంగారం ఉపయోగపడుతుందని పరిశోధకులు పదే పదే చెబుతున్నారు. శృంగారంలో పాల్గొన్న 60 – 66 వయసుగల ఒంటరి వృద్ధులు గొప్ప సంతృప్తి పొందినట్టు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అరవై వయసులోనే మనిషి సెక్స్‌ జీవితం అత్యున్నత స్థితికి (PEAK), శిఖరస్థాయికి చేరుతుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికాలో ఐదువేలమందిపై పరిశోధనలు చేసి ఈ నిర్థారణకు వచ్చారు. The eighth annual Singles in America survey  పేరిట దీనిని నిర్వహించారు. 66 వయసులో ఉన్న ఒంటరి స్ర్తీలు, 64 వయసులో ఉన్న ఒంటరి పురుషులు The best Sex ను, సంతృప్తిని అనుభవించారని ఈ సర్వే నివేదిక పేర్కొంది. ఈ వయసులో ఒంటరి వృద్ధులకు ప్రేమ కూడా ఒక గొప్ప వరంగా మారుతుందని నివేదిక పేర్కొంది. గొప్ప అనుభవ సంపన్నులు గనుక ఆ వయసులో ప్రేమ భావనల వ్యక్తీకరణ వారికి గొప్ప సంతృప్తినీ, ఆరోగ్యాన్నీ ఇస్తాయని న్యూయార్క్‌కు చెందిన Sex therapist Dr Madeleine Castellanos  చెబుతున్నారు. ప్రత్యేకించి 70 వయసులో సెక్స్‌లో పాల్గొన్న ఆరోగ్యవంతులైన వృద్ధ మహిళలు శారీరకంగా 40 ఏళ్ళ వయసునాటికంటే ఎక్కువ సంతృప్తిపొందామని చెప్పినట్టు National Commission on Aging ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించింది.  సుదీర్ఘకాల సెక్స్‌ జీవితాన్ని అనుభవించడంవల్ల ఆ వయసులో వారు సెక్స్‌లో అన్ని డైమెన్షన్స్‌ను విశాలభావంతో యధేచ్ఛగా అన్వేషించగలరని పేర్కొంది. 

యవ్వనంతో  ఉరకలేసే  మనసు

‘‘నా శరీరానికి వయసు రావచ్చుగానీ, నా మనసు యవ్వనంతో ఉరకలు పెడుతోంది, మీతోపాటు సమానంగా కాలేజీకి వచ్చి క్లాసులో కూర్చుని చదువుకోవాలని ఉంది’’ అని కొందరు పెద్దలు అనడం మనం వింటాం. నవ్వుకుంటాం. వారు జోక్‌ చేశారని అనుకుంటాం. కానీ వారు మనసులోని భావాన్ని నిర్భయంగా చెబుతారని నివేదిక పేర్కొంది. అలా ఎంతో మంది వృద్ధాప్యంలో పెద్ద చదువులు చదువుతూ పిల్లల్ని అబ్బురపరచడం మనం చూస్తూనే ఉన్నాం. 
నేటి జనరేషన్‌కు చెందిన లవ్‌ సాంగ్స్‌ని ఎంతోమంది వృద్ధులు ఒంటరిగా కూర్చుని హమ్‌ చేస్తున్నారని, యువకులు, తమ కొడుకులు చూడకుండా పాడుకుంటున్నారనీ చాలామందికి తెలియదు! ఆత్మ పాత దుస్తులు విడిచి కొత్త దుస్తులు కట్టుకుంటుందని ఏనాడో హిందూమతం చెప్పిన మాట ఈ రూపేణాకూడా అందరికీ బాగా వరిస్తుంది. 

పోర్నోగ్రఫీతో ప్రమాదం

45 ఏళ్ళు ఆపై బడినవారు సెక్స్‌లో పాల్గొనేముందు ఉత్తేజం పొందడానికి పోర్నోగ్రఫీని ఆశ్రయిస్తారు. ప్రతిసారీ ఇలా చేయడం చాలా ప్రమాదకరమని, మెదడులో నరాలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందనీ సర్వే నివేదిక వెల్లడించింది. ఆ వయసులో ఇంటర్నెట్‌లో అలాంటి చిత్రాలు పదే పదే చూడటం వల్ల మెదడులోని నరాలలోకి ఒక్కసారిగా రక్తప్రవాహం పొటెత్తుతుంది. దాంతో తలలోని నరాలు విపరీతమైన నొప్పికి దారితీస్తాయని బ్రెయిన్‌ హెల్త్‌ రిస్కులో పడుతుందనీ, అదీ సీరియస్‌ హెడేక్స్‌ కి దారితీస్తుందనీ తైవానీ న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఉత్తేజం పొందడానికి సొంత నిర్ణయాలకు బదులు వైద్యుల సలహాతో ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించమంటున్నారు.