నడి వయసుతో నానా అవస్థలు

ఆంధ్రజ్యోతి, 11-09-2013: బ్రిటిష్‌ నిపుణుల అంచనా, అధ్యయనాల ప్రకారం, నడి వయసు అనేది 40 ఏళ్ల ఎనిమిది నెలల రెండు వారాలకు మొదలవుతుంది. నడివయసు ప్రారంభం కావడానికి ఒకటి రెండు నెలల ముందు నుంచే శారీరకంగా, మానసికంగా మార్పులు తొంగి చూస్తుంటాయి. శరీరానికి సంబంధించిన ప్రతి చర్యా మందగించడం మొదలవుతుంది. శరీర పరిస్థితిని బట్టి ‘పుట్టిన తేదీ’ తెలియనివారు కూడా తాము నడి వయసులోకి ప్రవేశించినట్టు అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
 
నడి వయసుకు కూడా స్ర్తీ పురుష విచక్షణ ఉన్నట్టు కనిపిస్తోంది. నడి వయసు సమీపిస్తుండగానే పురుషులను నిరాశా నిస్పృహలు ఆవహిస్తుంటాయి. స్ర్తీలను మాత్రం 42 ఏళ్ల తొమ్మిది నెలలు దాటితే కానీ, నిరాశ చుట్టుముట్టదు. నడి వయసు ప్రభావం పురుషుల్లో అయితే కాస్తంత ముందుగానే కనిపిస్తుండగా, మహిళలను రెండేళ్ల తరువాత గానీ కనిపించదట. మహిళల శరీర తత్వం, పురుషుల శరీర తత్వం వేర్వేరుగా ఉంటాయని నిపుణుల చెబుతున్నారు. యవ్వనాన్ని వదిలి నడివయసులో అడుగుపెట్టిన దగ్గర నుంచి శరీరంలో అతి వేగంగా మార్పులు చోటు చేసుకోవడం ప్రారంభమవుతుంది.
 
సాధారణంగా పురుషులు గానీ, స్ర్తీలు గానీ తమ శరీర తత్వాలను పట్టించుకోరు. చాలామందికి దీని పట్ల పెద్దగా అవగాహన కూడా ఉండదు. కానీ, ఒక్క వారం రోజుల తేడాతోనే శరీరంలో తేడాలు కనిపిస్తాయని, దీని ప్రభావం, దీని ఛాయలు ఎక్కువగా ఆఫీసు పనుల్లో కనిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంత వరకూ పని గంటలు, పని వేళలతో సంబంధం లేకుండా పనిచేసినవారు ఆ తరువాత నుంచి పని వేళలను శ్రద్ధగా పట్టించుకోవడంతో నడి వయసు ప్రవేశం మొదలవుతుంది. ఆఫీసు వేళల తరువాత కూడా స్నేహితులతో సినిమాలకు, షికార్లకు తిరిగిన వ్యక్తి, ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుందామా అన్న ధ్యాసలో పడతాడు.
 
మహిళల విషయానికి వస్తే అంతా ఇందుకు భిన్నంగా జరుగుతుంటుంది. నడి వయసు రావడానికి ఇంకా రెండు మూడు నెలలు ఉందనగా, వారిలో చురుకుదనం పెరిగిపోతుంది. ఎంత పనైనా చేయగల శక్తి వస్తుంది. నడి వయసు 40 ఏళ్లకే వచ్చినప్పటికీ దీని ప్రభావం మాత్రం వీరిలో 42 ఏళ్ల తరువాతే కనిపిస్తుంది. అందుకని ఈ రెండేళ్లూ వారిని కొత్త శక్తి ఆవహిస్తుంది. పైగా అలంకరణ మీద మోజు పెరుగుతుంది. ఇంటి మీదా, ఒంటి మీదా శ్రద్ధ పెరుగుతుంది. ప్రయాణాలు చేయాలనిపిస్తుంది. షాపింగ్‌ కోసం ఎంత సమయాన్నయినా వెచ్చించవచ్చనిపిస్తుంది.
 
యవ్వన దశ నుంచి బయటికి వచ్చిన తరువాత నడివయసులోకి రావడానికి ఒకటి రెండు వారాల సమయం పడుతుంది. ఈ ఒకటి రెండు వారాల్లోనే శరీరం నడి వయసుకు ఏర్పాట్లు చేయడం ప్రారంభిస్తుంది. అనేక విషయాల్లో భావాలు మారిపోతుంటాయి. ఇంటి మీద, కుటుంబం మీద శ్రద్ధ ఎక్కువవుతుంది. మానేసికంగా చికాగ్గానూ, అశాంతిగానూ ఉంటుంది. ఆరాటాలు ఎక్కువవుతాయి. నిద్ర సరిగ్గా పట్టకపోవడం కూడా ప్రారంభమవుతుంది.
మరో విచిత్రమేమిటంటే, మాటి మాటికీ జుత్తును చూసుకోవడం, టీనేజ్‌ యువతుల వైపు తేరిపార చూడడం ఎక్కువవుతుంది. ఇక 40 ఏళ్ల 8 నెలలకు ప్రారంభమైన నడి వయసు 59 ఏళ్ల వరకూ ఉంటుంది. ఆ తరువాతి దశ వృద్ధా ప్య దశ. దాని సమస్యలు వేరుగా ఉంటాయి. స్ర్తీలకు నడివయసులోనే రుతుక్రమం ఆగిపోయే దశ కూడా ప్రారంభమవుతుంది. అందువల్ల 45 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచీ స్ర్తీలు ఈ రెండింటి వల్లా కొన్ని శారీరక, మానసిక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నడివయసు పట్ల పురుషులైనా, స్ర్తీలైనా కొంత అవగాహన ఏర్పరచుకుని, జీవితానికి కావాల్సిన భవిష్య ప్రణాళికను సిద్ధం చేసుకోవడం మంచిదని బ్రిటిష్‌ శాస్త్రవేత్తల బృందం సలహా ఇస్తోంది. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జపాన్‌, కెనడా తదితర దేశాల్లో అనేక ప్రాంతాల్లో నడి వయసు సమస్యలకు ప్రత్యేక క్లినిక్‌లు, కౌన్సెలింగ్‌ కేంద్రాలు పనిచేస్తుంటాయి. ఆ కేంద్రాలను డాక్టర్లు, సైకియాట్రిస్టులు నిర్వహిస్తుంటారు. వారు నడివయసువారి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారు.
 
నడి వయసులోకి రాగానే తరచూ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవడం మొదలెట్టాలని వారు చెబుతుంటారు. ఆహార విహారాల్లో చేసుకోవాల్సిన మార్పుల్ని వారు సూచిస్తుంటారు. ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో చెబుతుంటారు. దీని మీద ఒక్క అమెరికాలోనే నడివయసు వారు సుమారు 60 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారంటే ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నడి వయసులో మానసిక ఆందోళనలు, ఆరాటాలు, దిగుళ్లు, విషాదాలు ఎక్కువగా ఉంటాయని, ఆనందోత్సాహాలు, తృప్తులు తక్కువగా ఉంటాయని అది తెలిపింది. ఒక దశలో శరీర తత్వం మారిపోవడమనేది శరీరం మీదే కాక, మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. నడివయసులో జరిగేది అదే.