పెద్ద వయసులోనూ సంతానం

ఆంధ్రజ్యోతి, 23/09/2014: మూడు పదులు దాటితేనే సంతానం కలగడం కష్టం అంటుంటారు. కానీ, ఆధునిక వైద్యశాస్త్రం 50 ఏళ్లు దాటినా గర్భ ధారణకు ఏమీ ఇబ్బంది లేదంటోంది. కాకపోతే అండాలు అందించే దానకర్తలు మాత్రం కావాలి. నిజానికి అండోత్పత్తికి వయసు ఆటంకం అవుతుందే గానీ, గర్భాన్ని మోయడానికి కానే కాదని నవీన గైనకాలజిస్టులు, ఐవిఎఫ్‌ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.
 
శారీరకమైన పరిమితుల్ని తలుచుకుని మనిషి కొన్ని యుగాలుగా బాధపడుతూనే వచ్చాడు. కానీ, ఆధునిక వైద్య పరిశోధనలు ఆ పరిమితుల గోడల్ని కూల్చివేస్తున్నాయి. అందులో భాగంగానే గర్భధారణ వయోపరిమితులు కూడా వెనక్కి జరుగుతున్నాయి. అండాలను దానంగా తీసుకోవడం ద్వారా సంతానం కలిగించే సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరుగుతున్న ఈ రోజుల్లో స్త్రీలు రుతుక్రమం ఆగిపోయిన తర్వాత అంటే 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా గర్భఽం పొంద గలుగుతున్నారు. ఈ వయసులో అండాల ఉత్పత్తి ఆగిపోవడం అన్నది వాస్తవమే గానీ గర్భాశయం పనితీరులో మాత్రం అంత మార్పేమీ రాదు. స్వల్పంగా ఏదైనా తేడా వచ్చినా బయటి నుంచి హార్మోన్‌లు ఇవ్వడం మొదలెట్టిన మరుక్షణం నుంచే గర్భాశయం చక్కగా పనిచేయడం మొదలెడుతుంది.
 
పరీక్షలన్నీ చేశాకే.....
అండ దాన ప్రక్రియలో 30 ఏళ్లు దాటని వేరే స్త్రీ నుంచి అండాలను, తీసుకుంటారు. అలా తీసుకోవడానికి ముందు ఆ దాతకు హెపటైటిస్‌ బి, సి పరీక్షలు, హెచ్‌ఐవీ పరీక్షలు, సిఫిలీస్‌, సర్వైకల్‌ కేన్సర్‌ పరీక్షలు చేస్తారు. అదే సమయంలో వారి జన్యుచరిత్రను కూదా పరిశీలిస్తారు. అండాలను స్వీకరించే వ్యక్తికి కూడా అధిక రక్తపుపోటు, మధుమేహం. గుండె జబ్బులు ఉన్నాయేమో చూస్తారు. అలాగే గర్భాశయంలో గానీ, అండాశయంలో గానీ కణతులు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. అలా అండాలను తీసుకోవడానికి వీలుగా ఆమెకు గొనాడోట్రాపిన్‌ అనే హార్మోన్‌ ఇవ్వడం ద్వారా ఆమె అండాశయాన్ని బాగా స్పందింపచేస్తారు. దీని వల్ల ఎక్కువ సంఖ్యలో అండాలు ఉత్పత్తి అవుతాయి. ఈ అండాలను సోనోగ్రఫీ విధానంలో అంటే ఒక సూది ద్వారా ఆమెలోని అండాలను సేకరిస్తారు. ఆమె భర్త నుంచి వీర్య కణాలను తీసుకుని ఫలదీకరణ చెందిస్తారు. అలా ఫలదీకరణ చెందిన అండాలను 42 నుంచి 72 గంటల వ్యవధిలో సంతానం కావాలనుకున్న స్త్రీ గర్భాశయంలోకి పంపిస్తారు. అండాలను దానంగా తీసుకున్న ఈ రహస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టరు. స్త్రీ నుంచి తీసుకున్న అండాలు గర్భాశయంలో మమేకం అయ్యేదాకా రెండు మూడు దఫాలుగా హార్మోన్లు ఇస్తారు. గర్భం స్థిరపడేదాకా బయటి నుంచి హార్మోన్లు ఇవ్వడాన్ని కొనసాగిస్తారు. గర్భం దాల్చిన మూడు మాసాల తర్వాత బయటి నుంచి హార్మోన్లు అందించాల్సిన అవసరమేమీ ఉండదు.
 
గర్భధారణలో కొన్ని సమస్యలు
రుతుక్రమం ఆగిపోయిన ఈ పెద్ద వయసులో గర్భం దాల్చిన వారు కొన్ని రకాల సమస్యలు మనకు కనిపిస్తాయి. అధికరక్తపోటు, గర్భం ఉన్నంతకాలమే ఉండే జెస్టేషనల్‌ మధుమేహం, అదే సమయంలో వచ్చే టాక్సిమియాస్‌ ఇవన్నీ వారిలో కనపడుతూ ఉంటాయి. వీటికి అత్యంత జాగ్రత్తగా వైద్య చికిత్సలు చేస్తారు. ఈ దశలో ఎన్ని సమస్యలు వచ్చినా అవన్నీ వైద్య చికిత్సలతో పూర్తిగా అదుపులోకి వచ్చేవే. అందువల్ల ఆరోగ్యవంతమైన, సౌష్టవమైన శిశువు జన్మించే విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు. రుతు క్రమం ఆగిపోయిన మెనోపాజల్‌ వయసులో గర్భం ఏమిటంటూ విమర్శలైతే వినపడతాయి గానీ అవేవీ సహేతుకమైనవి కావు. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలే గానీ, 50 నుంచి 60 ఏళ్ల దాకా ఎప్పుడైనా ఒకరి అండదానంతో గర్భం దాల్చవచ్చు. వాస్తవానికి 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయసులోనూ గర్భం దాల్చి, ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చిన ఎన్నో నివేదికలు మన ముందు ఉన్నాయి. క్రమ క్రమంగా జీవితకాలం బాగా పెరుగుతున్న ఈ రోజుల్లో 50 ఏళ్ల వయసులో శిశువుకు జన్మనిచ్చినా ఆ తర్వాత వారి చదువూ, ఉద్యోగ విషయాల బాఽధ్యతలను సంపూర్ణంగానే నిర్వహించవచ్చు. అందువల్ల 50 ఏళ్లు వచ్చేశాయని ఇప్పటికే అంతా చేయి దాటిపోయిందని ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరమే లేదు. ఒక ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చే పూర్తి అవకాశాన్ని అందించడానికి ఆదునిక వైద్య విధానాలు ఎల్ల వేళలా మీ అందుబాటులో ఉన్నాయి.