ప్లాసిబో మాత్రలైనా నిద్రపుచ్చుతాయి

18-5-2017: వయో వృద్ధుల్లో చాలా మంది తమకు నిద్రపట్టడం లేదు అంటూ తరుచూ చెబుతూ ఉంటారు. వాస్తవానికి రిటైర్‌ అయిపోయాక, ఇతర వ్యాపకాలేవీ లేకుండా రోజంతా ఇంటి వద్దే ఉండిపోయే వారికి శరీరం అలసిపోయే అవకాశాలు తక్కువ. కొంతమంది ఎక్కువగా మంచం మీదే వాలిపోయి ఉంటారు. వాళ్లకు తెలీకుండానే అప్పుడో ఇప్పుడో కునుకు తీస్తూనే ఉంటారు. అందువల్ల ఇతరుల్లా ఏడు గంటలు నిద్రపోయే అవసరం గానీ, అవకాశం గానీ వీరికి ఉండదు. ఒకవేళ అంతగా నిద్రపోయినా ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి మెలకువ వస్తూనే ఉంటుంది. దీని వల్ల పూర్తిస్థాయిలో నిద్రపట్టడం లేదని కొందరంటే, మరికొందరేమో అసలు నిద్రేపట్టడం లేదని తెల్లవార్లూ జాగారమే చేస్తున్నానని చెబుతుంటారు. చాలా మంది విషయంలో ఈ నిద్రలేమి ప్రస్థావన అర్థరహితంగానే ఉంటుంది. ఒకవేళ నిద్రలేమి సమస్య అంతో ఇంతో ఉన్నా, దానికి ప్రతి రోజూ నిద్రమాత్రలు వేయడం ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదు. కొందరైతే ఏకంగా నిద్రమాత్రలు కావాలని గట్టిగా అడుగుతారు కూడా. ఈ విషయమై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వారు ఒక పరిశోధన చేశారు. నిద్రలేమి సమస్య లేకపోయినా ఆ భావనతో ఉన్నవారికి ఏ మందూ లేని ప్లాసిబో మాత్రలు ఇవ్వడం ద్వారా వారిని నిద్రపుచ్చవచ్చని కనుగొన్నారు. రోజూ నిద్ర ఉపక్రమించడానికి ముందు ఒక ప్లాసిబో మాత్ర ఇచ్చేస్తే ఆ మాత్ర వేసుకున్నామన్న ఫీలింగే వారికి నిద్ర పట్టేలా చేస్తుందని పరిశోధకులు ఇటీవల స్పష్టం చేశారు.