వృద్ధ విలాపం!

దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరిది ఒంటరి బతుకే

కుటుంబాల ‘వేరుబాట’.. పలకరింపే కరువు
పట్టణాల్లోనే 64.1 శాతం ఒంటరి వృద్ధులు
న్యూఢిల్లీ, జూన్‌ 28: ‘వృద్ధులను గౌరవించాలి’... బస్సుల్లోనో, బడి గోడలపైనో కనిపించే నీతి వాఖ్యమిది. దీనిని ఎవరూ ఆచరణలో చూపడం లేదు. దేశంలో ప్రతి ఇద్దరు వృద్ధుల్లో ఒకరు ఒంటరితనంలో బాధపడుతున్నారు. కనీసం ప్రేమగా మాట కలిపేవారు కూడా లేక కుంగుబాటుకు గురవుతున్నారు. తల్లిదండ్రులను వదిలేసి పిల్లలు తమ దారి తాము చూసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పరిస్థితి పట్టణాల్లో మరీ ఎక్కువ గా ఉంది. 10 కోట్ల మందికి పైగా ఉన్న వృద్ధులున్న మన దేశంలో అనేక మంది మానసిక సమస్యలతో బాధపడడానికి ఒంటరితనమూ కారణమవుతోంది. ‘భారత్‌లో మారుతున్న వృద్ధుల అవసరాలు, హక్కులు’ అనే పేరుతో ఏజ్‌వెల్‌ అనే సంస్థ సర్వే నిర్వహించి ఈ వివరాలను వెల్లడించింది. 25 రాష్ట్రాల్లో 15 వేల మంది వృద్ధులతో ఈ సంస్థ మాట్లాడింది. ఇందులో 47.49 శాతం ఒంటరితనంతో గుబులుగా బతుకీడుస్తున్నారు. పట్టణాల్లో 5 వేల మంది సర్వేలో పాల్గొనగా వారిలో 3,205 మంది(64.1 శాతం) ఒంటరి జీవులే. ఇక పల్లెల్లో 10 వేల మంది సర్వేలో పాల్గొనగా వారిలో 39.19 శాతం కనీసం మాట పలకరింపునకూ నోచుకోవడం లేదు.
 
కారణాలివి..
సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తమ జీవిత భాగస్వామిని కోల్పోయిన వృద్ధులు, లేదా పిల్లలతో సంబంధం లేకుండా కేవలం భార్యతో కలిసి విడిగా జీవిస్తున్న వారున్నారు. ఇది వారిలో ఒంటరి తనం భావనను పెంచుతోంది. ఇలా జీవిస్తున్న వారు 36.78 శాతం ఉన్నారు.
కుటుంబంతో కలిసి ఉంటున్న వారి విషయంలోనూ 27.3 శాతం వృద్ధులు.. కుటుంబ సభ్యులెవరూ పెద్దగా పట్టించుకోక పోవడంతో నలుగురిలో ఉండి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు.
19.06% అనారోగ్యం కారణంగా, 12 % సామాజికంగా సంబంధాల్లేక ఏకాకులవుతున్నారు.
ప్రతి ఐదుగురిలో ఒకరికి ఒంటరితనం వల్ల మానసికసమస్యలతో కౌన్సెలింగ్‌ తప్పనిసరి అవుతోంది.