ఒంటరితనం ఒడిలో...

27-09-2017: ఇటీవల కాలంలో చాలామంది సీనియర్‌ సిటిజన్స్‌ తీవ్రమైన డిప్రషన్‌కు లోనవుతున్నారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణా బాధ్యతను బంధువులు లేదా పనివాళ్ల చేతుల్లో పెట్టేస్తున్నారు. సీనియర్‌ సిటిజన్లలో పెరుగుతున్న డిప్రషన్‌కు ఇది ప్రధాన కారణమని మానసిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పిల్లలు దగ్గర లేక పనివాళ్ల దయాదాక్షిణ్యాల మీద సీనియర్‌ సిటిజన్లు ఆధారపడవలసి వస్తోంది. ఫలితంగా తీవ్రమైన ఒంటరితనాన్ని వీళ్లు ఫీలవుతున్నారు. కొందరు వృద్ధులైతే ఆ ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. చండీఘడ్‌లో ఈ పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయని మానిసిక నిపుణులు పేర్కొన్నారు. ‘తల్లిదండ్రులు ఈ వయసులో పిల్లల నుంచి ప్రేమ, వాత్సల్యాలు, అండదండలు కోరుకుంటార’ని నిపుణులు చెప్తున్నారు. చండీఘడ్‌లో ఇలాంటి సీనియర్‌ సిటిజన్‌ బాధితుల సంఖ్య రెట్టింపు అయిందని గణాంకాలు చెప్తున్నాయి. చండిఘడ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థకు చెందిన సైకియాట్రిస్టు నిపుణులు మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల కాలంలో చండీఘడ్‌లో ఒంటరితనంతో బాధపడుతున్న సీనియర్‌ సిటిజన్ల సంఖ్య రెట్టింపు అయిందని వెల్లడించారు. 2008 ఒపిడిలో నమోదైన నీనియర్‌ సిటిజన్‌ కేసులు 580 ఉండగా, 2016 నాటికి వీరి సంఖ్య రెట్టింపు అంటే 1,488 అయిందని చెప్పారు. ‘గతంలో పిల్లలతో ఆసుపత్రికి వచ్చే సీనియర్‌ సిటిజన్లు ఇప్పుడు సర్వెంట్లతో వస్తున్నారు. మానసిక సమస్యలతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా వీరిని బాధిస్తుంటాయి. దీంతో ఒంటరిగానే వైద్యుల వద్దకు వీళ్లు వెళ్లాల్సివస్తోంది’ అని మానసిక వైద్యులు ఒకరు తెలిపారు. అలాగే సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా డెమన్షియా అనే మానసిక సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే సీనియర్‌ సిటిజన్లకు నిత్యం ఫిజికల్‌ యాక్టివిటీ, మెంటల్‌ యాక్టివిటీ అవసరమని నిపుణులు తేల్చారు. కథలు చెప్పడం, కొత్త సాంకేతిక పరికరాలను వాడడం వంటి పనుల్లో వారి బ్రెయిన్లను బిజీగా ఉంచితే వారు ఒంటరితనాన్ని అధిగమించగలరు. సమాజ సేవలో సైతం పాలుపంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘రిటైర్డ్‌ లైఫ్‌ గడపకుండా తమ హాబీలను కొనసాగిస్తూ నిత్యోత్సాహంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల వాళ్లు నిరంతరం యంగ్‌గా ఉంటారు. అప్పుడు తమది ఓల్డ్‌ ఏజ్‌ కాదు... ‘గోల్డ్‌ ఏజ్‌’ అని వాళ్లు అనుకుంటారు’ అని మానసిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.