నూరేళ్లూ హుషారుగా!

వార్ధక్యం సహజమూ, అనివార్యమే కావచ్చు. అయితే, వార్థ్యక్యాలన్నీ ఒక్కటి కావు. సహజ వార్థక్యం, అకాల వార్థక్యం- అంటూ ఇది రెండు రకాలు. ఏ 80 ఏళ్ల తర్వాతో శరీర భాగాలు వశం తప్పుతున్నాయంటే అది సాధారణం, సహజం. కానీ, ఈ రోజుల్లో చాలా మంది శరీరాలు పెద్ద వయసు రాకముందే కుంటుపడుతున్నాయి. ఈ స్థితినే అకాల వృద్ధాప్యం అంటాం. సహజ కాలానికన్నా ముందే ఎందుకిలా అంటే? దానికి కారణాలు అనేకం...

మానవ శరీరంలో ప్రతి క్షణం అనేకానేక జీవకణాలు క్షీణిస్తూ కొత్త కణాలు పుడుతుంటాయి. అయితే ఈ జీవకణాల ఆయుఃకాలం కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. శరీరంలో అనుక్షణం ఉత్పత్తి అయ్యే జీవకణాల సంఖ్య కంటే మరణించే కణాల సంఖ్య ఎక్కువ కావడం, లేదంటే ఉత్పత్తి అయ్యే కణాల సంఖ్యే బాగా తగ్గిపోవడం ఇందుకు కారణం కావచ్చు. ఇలా ఆరోగ్యానికి హాని చేసే మృత క ణాలు పెరిగిపోవ డమో లేదా జీవకియ్రల్లో భాగంగా ఆ మాలిన్యాల ఉత్పత్తి పెరగడమో ఇందుకు కారణమవుతుంది. మనిషి జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉండడం అసలైన ఆయుర్దాయంగా పరిగణనలోకి వస్తుంది. సహజ క్రమంలో కాకుండా అకాల వృద్ధాప్యం అంటూ వస్తే దాన్ని ఒక వ్యాధిగానే పరిగణించాల్సి ఉంటుంది. ఈ అకాల వృద్ధాప్యం వెనుక, మనిషి, వృత్తి, ప్రవృత్తి వాతావరణంలో సంతులనం తప్పి పోవడం ఒక మౌలిక కారణం. ఈ సంతులనం తప్పినప్పుడు కలిగేదే అకాల వృద్ధాప్యం,
 
ఫ్రీ- ర్యాడికల్స్‌....
శరీరంలోని జీవ క ణాలు ఉత్పత్తికంటే ఎక్కువగా నశించినప్పుడు అనేక వ్యర్థపదార్థాలు (ప్రీ- రాడికల్స్‌/ ఆక్సిడెంట్స్‌) తయారవుతాయి. అయితే వివిధ ప్రక్రియల ద్వారా ఈ వ్యర్ధపదార్థాలను ఎప్పటికప్పుడు విసర్జించడం శరీరంలో నిరంతరం జరుగుతూ ఉంటుంది. కాకపోతే, సహజ పరిణామానికన్నా మించి, శరీరంలో మలినాలు తయారైనప్పుడు శరీరం వ్యధకు గురవుతుంది. వ్యాధుల పాలవుతుంది. అయితే శరీరంలో పేరుకుపోయిన ప్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించడానికి, ప్రకృతి సహజంగానే శరీరంలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు (వ్యర్థ పదార్థాల నిరోధకాలు) ఉత్పన్నమవుతాయి. అయితే యాంటి- ఆక్సిడెంట్ల వ్యాధి నిరోధక శక్తిని మించి, వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతున్నప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కోవ డానికి, ఆహారం, ఔషధ రూపాల్లో అదనంగా మరికొన్ని యాంటీ ఆక్సిడెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది.
 
యౌవనంలోనే..
వార్థక్యంలో ధాతుక్షయ వేగం పెరగడం వల్ల సహజంగానే, శరీరం త్వరితంగా శక్తిహీనమవుతూ ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి శరీరం తరుచూ వ్యాధిగ్రస్థమవుతూ ఉంటుంది. అందుకే ప్రతి మనిషీ యవ్వనంలో ఉన్నప్పుడే సరియైున ఆహారం, అవసరమైనప్పుడు ఔషధాలు సేవిస్తే, ఓజస్సు (జీవ శక్తి) పెరిగి, వార్థక్యంలో వచ్చే వ్యాధులు సమర్థంగా నిరోధించబడతాయి. ఇందుకోసం, ఆహారం విషయంలో వృద్ధులు విధిగా కొన్ని నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యంగా...

మాంసాహారం బాగా తగ్గించాలి.

మలబద్ధకం రాకుండా జాగ్రత్త పడాలి.
ఆహారం మృదువుగా, సులభంగా నమిలే రీతిలో ఉండాలి.
పాల వంటి క్యాల్షియం ధాతు ప్రధానమైన ఆహారం రోజూ తీసుకోవాలి. చేపలు లేదా వృక్ష సంబంధ ప్రొటీన్‌ తరుచూ తీసుకోవాలి.
ఆకలిని పెంచే సూప్స్‌ భోజనానికి ముందు ప్రత్యేకంగా తీసుకోవాలి.
అవసరమైన మేరకు మంచి నీళ్లు తాగడంతో పాటు వ్యర్థపదార్థాలను తొలగించే యాంటీ ఆక్సిడెంట్లు గల ఆహార పదార్థాల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి.
 
విటమిన్లూ అంతే ముఖ్యం
విటిమిన్‌ ‘ఎ’ కెరోటినాయిడ్స్‌ రూపంలో పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులో ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో ఉంటుంది. ముఖ్యంగా, క్యారట్‌, ముల్లంగి, టమాట, మునగ, బొస్పాయి, పచ్చిమిర్చి, మామిడి పండ్లు, చేమ ఆకులు, పాలకూర, మెంతికూరలో ఉంటుంది. అందుకే వీటిని తరుచూ వాడుతూ ఉండాలి. నేరుగా విటమిన్‌ ఏ రూపంలో చేపలు, మాంసం, పాలు, వెన్న, నెయ్యి గుడ్లు, లివర్‌లో ఉంటుంది.
విటమిన్‌ -సి అధికంగా, సిట్రస్‌ జాతిపండ్లైన నిమ్మ, బత్తాయి, నారింజ, ఉసిరి, సీతాఫలం, జామ, టమాట, మిర్చి, ఆకుకూరల వంటి వాటిలో అధికంగా ఉంటుంది.
విటమిన్‌- ఇ అధికంగా, నూనె గింజలు (ఆల్మండ్‌, ఎప్రికాట్స్‌) వెజిటబుల్‌ ఆయిల్స్‌ (సన్‌ఫ్లవర్‌, వేరుశెనగ, సోయా) కాడ్‌ చేపలు, మాంసం, మొలకెత్తిన గింజలలో (పెసర్లు, శనగలు, వేరు శనగ) ఉంటాయి.

లవణాల్లో ముఖ్యంగా సెలీనియం, కాపర్‌, జింక్‌, మెగ్నీషియం వంటివి నువ్వులు, వేరు శనగ, సోయా, ఆల్మండ్స్‌, నూనెగింజలు, రాగులు, అలచందలు జొన్నలు, సజ్జల వంటి చిరుధాన్యాలు, వివిధరకాల పప్పుధాన్యాల్లో ఉంటుంది, ముదురాకు పచ్చని ఆకు కూరల్లో కూడా ఈ లవణాలు ఎక్కువగానే ఉంటాయి. వీటిని తరుచూ తీసుకోవడం ద్వారా అకాల వృద్ధాప్యాన్ని అరికట్టవచ్చు.

రసాయనాలు కీలకం
వృద్ధాప్యాన్నీ, వృద్థాప్య లక్షణాల్నీ, ఆ వయసులో వచ్చే పలు రకాల వ్యాధుల్నీ ముందుగానే నిరోధించే ఔషధాల విషయంలో శ్రద్ధ వహించాలి. అలాంటి ఔషధాల్నే రసాయనాలు అంటారు. ఈ రసాయనాల్లో త్రిఫల రసాయనం, భృంగరాజ రసాయనం, మేధ్య రసాయనం, అశ్వగంధ రసాయనం, ధాత్ర్యాధి రసాయనం ముఖ్యమైనవి. వీటితో పాటు శిలాజిత్‌ రసాయనం, హరీతకీ రసాయనం, పిప్పలీ రసాయనం, పలాశ రసాయనం, అమలకీ ర సాయనం, హరీతకీ రసాయనం కూడా ఎంతో ప్రభావవంతమైనవి.
 
 
- ప్రొఫెసర్‌ చిలువేరు రవీందర్‌
డాక్టర్‌ బి. ఆర్‌. కే. ఆర్‌ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్‌