అరవైల్లోనూ ముప్ఫైలా కనిపించేదెలా..?

 

ఆంధ్రజ్యోతి (16-11-2019):యస్సు పెరిగి షష్టిపూర్తికి చేరువ అవుతున్నప్పుడు శరీరంలో మార్పులు సహజం. వృద్ధాప్యం అంటే జవసత్వాలు ఉడిగిపోవడమే. ఆ వయసులో ముఖం ముడుతలు పడి, నుదుటి మీద గీతలు రావడం సహజం. చర్మం పలుచబడి ఎండినట్లుగా మారుతుంది. మెడ చుట్టూ తిత్తులుగా చర్మం వేలాడుతూ కొందరికి ఆందోళన కలిగిస్తుంది. కనుబొమలు ముడుతలు పడి కనురెప్పలు వాలిపోతాయి. దీంతో కళ్ళు పూర్తిగా విప్పార్చలేని పరిస్థితి. దవడ కండరాలు కరిగి చర్మం జారుతుంది. శరీరంలో వయసు మీరడాన్ని ఎవరూ ఆపలేరు. అది సాధ్యం కాదుకూడా. అయితే వయసును ‘దాచిపెట్టడం’ కొంత వరకూ సాధ్యమేనని కాస్మెటిక్‌ నిపుణులు చెబుతున్నారు. అరవైల్లోకి  వచ్చినా ఇంకా మూడు పదుల్లోనే ఉన్నట్లుగా ‘కనికట్టు’ చేయడం అంటే తమషాగానే ఉంటుంది. ఇటీవల వచ్చిన ‘ఓ బేబీ’ సినిమాలోలా డెభ్భై ఏళ్ళ బామ్మను పాతికేళ్ళ పడుచుగా మార్చిన తాయత్తు మహిమ లాంటిది కాదు కానీ.. కొన్ని ‘మాయలు’ చేస్తే చాలంటున్నారు.
 
ఒత్తిడి తగ్గించుకోండి
ఒత్తిడికి గురైతే శరీరంలో ఆండినలైన్‌, కోర్టిజాల్‌ వంటి హార్మోన్ల విడుదల అధికమై గుండెవేగం పెరిగి హైపర్‌టెన్షన్‌కు దారితీస్తుంది. శరీర అవయవాలు తీవ్రంగా శ్రమించాలి. దీంతో త్వరగా అలసిపోతాం. దాంతో ముసలితనం ముంచుకొస్తుంది. ప్రస్తుత రోజుల్లో తీరికలేని జీవనశైలి, వేళాపాళ లేని పనుల ఒత్తిడిని సాధ్యమైనంతమేర తగ్గించుకోవడంతోపాటు సంతోషంగా, ఆరోగ్యంగా జీవితం గడపాలి. అందుకోసం ధ్యానం లేదా యోగాను ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ కనీసం అర్దగంట సేపు ధ్యానం లేదా యోగా చేస్తే అది ఒత్తిడిస్థాయిని గణనీయంగా తగ్గించి, మనల్ని శక్తివంతం చేస్తుంది. అంతేకాదు, దీని వలన మెదడుకు ముసలితనం రానీయదు. దీంతో మనం చలాకీగా, వయస్సు తక్కువ ఉన్నట్టు కనిపిస్తాం.
 
శారీరక శ్రమ చేయండి
అరవైల్లోకి వచ్చినా ఉత్తమంగా కనిపించాలని, ముప్ఫైయేళ్ళవారిలా చలాకీగా, చురుగ్గా ఉండాలంటే, తప్పనిసరిగా శారీరక వ్యాయామం ప్రారంభించాల్సిందే. ఇది వయసు మీదపడే సమయంలో వచ్చే వ్యాధులను తగ్గించి మీరు ఎప్పటికీ యంగ్‌గానే కనిపిస్తారు.  వ్యాయామంవల్ల అనవసర కొవ్వు కరిగి, శ్వేద గ్రంథులద్వారా వ్యర్థాలు బయటకుపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇందుకోసం నడక, జాగింగ్‌, ఈత, సైక్లింగ్‌, ఏరోబిక్స్‌ వంటివాటిల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. ప్రతిరోజూ స్నానానికి ముందు శరీరానికి  ముఖ్యంగా ముఖము, చేతులు, కాళ్ళు తదితరాలకు మృదువుగా ఆలివ్‌ నూనె రాసుకుని, పదినిమిషాల తర్వాత స్నానం చేయాలి. ప్రతిరోజు కుదరకపోతే వారానికి రెండుసార్లైనా అలా చెయ్యాలి. అలాగే నీళ్ళలో ఓట్స్‌, పాలు, నిమ్మరసం కలిపి ముఖానికి ఫేషియల్‌ చేసి, పది పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే, జిడ్డుపోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది. బాత్‌ టబ్‌లోగోరువెచ్చటి నీళ్ళలో  దవనం, మిరియాలు (పిప్పర్‌మెంట్‌), చామంతి ఆకులు, ఆలివ్‌ ఆయిల్‌ వేసి 20నిమిషాలు స్నానం చేస్తే, చర్మం నిగనిగ లాడుతుంది. సాధ్యమైనంత వరకూ రసాయనాలతో కూడిన లోషన్లకు దూరంగా ఉండాలి.
 
కొబ్బరినూనె ఉత్తమం
ఘాటైన రసాయనాలులేని స్వచ్ఛమైన  కొబ్బరి నూనె రెండుచెంచాలు తీసుకుని స్నానానికి ముందు శరీరానికి పట్టించాలి. పది నిమిషాల తర్వాత స్నానం చేస్తే, ముఖంపై మొటిమలు, శరీరంపై దద్దుర్లు, దోమ కాట్లు వంటివి తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. విటమిన్‌ ఇ ఆయిల్‌ కూడా చర్మంపై వయసు కనపడనీయదు. గుడ్డులో తెల్లసొన లేదా స్ట్రాబెర్రీ, దాక్ష, ఆవొకాడో వంటి పండ్ల గుజ్జును రాత్రి నిద్రకు ముందు ముఖానికి రాసుకుని గంట తర్వాత కడిగేయాలి. ఇలాచేస్తే, ముఖంపై ముడతలు రావు. కనీసం వారానికి ఒకసారైనా ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి. 
 
ఆహారంలో ఇవి తప్పనిసరి
తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయల్లో యాంటి యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో ఉండేలా చూసుకుంటే చర్మం వయస్సు పెరుగుదల ప్రక్రియ మందగించి, చర్మం ముడుతలు పడకుండా ఉంటుంది. విటమిడ్ డి చర్మానికి ఆరోగ్యాన్నివ్వడమే కాదు, వృద్ధాప్యఛాయల్ని నివారిస్తుంది. విటమిన్‌ డి సమృద్ధిగా ఉండే ఆహార పదార్ధాలతోపాటు విటమిన్‌ డి3 సప్లిమెంట్స్‌ను కూడా తీసుకోవాలి. జుత్తు, గోళ్ళ  ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో బయొటిన్‌ పాత్ర కీలకం. చర్మం మృదువుగా ఉంచడంలోనూ ఇదే కీలకం. బయోటిన్‌ అంటే విటమిన్‌ బి7. నీటిలో కరిగే గుణం వున్న దీనిని బీ కాంప్లెక్స్‌ మాత్రల రూపంలో  కూడా తీసుకోవచ్చు. ఎముకలు, దంతాల భద్రతకు విటమిన్‌ సి ఎంతో అవసరం. సి విటమిన్‌ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. 
 
8 గ్లాసుల నీళ్ళు, 8 గంటల నిద్ర
డీ హైడ్రేషన్‌ వల్ల కూడా చర్మం ఎండిపోయి ముడతలు పడుతుంది. అది శరీరంలో శక్తిని కోల్పోయేలా చేస్తుంది.  అందువల్ల ప్రతిరోజూ 6 నుంచి 8 గ్లాసుల నీళ్ళను తాగాలి. వ్యాయామం చేశాక, భోజనం అనంతరం తప్పనిసరిగా మంచినీళ్ళు తాగాలి.  జీవిత కాలం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 6 – 8 గంటలు నిద్రపోవాలి. చక్కటి నిద్ర రోజంతా ఉత్సాహాన్నిస్తుంది. అలాంటి ఉత్సాహంవంతమైన జీవితం వృద్ధాప్యాన్ని దరిచేయనీయదు.
 
ముఖంపై ముడతల నివారణ 
అరవైల్లో పడేసమయానికి కనుకొనుకులవద్ద కాకి కాళ్ళు మాదిరిగా ముడతలు పడతాయి. దీనికి కారణం అధిక సూర్యకాంతి, ధూమపానం వలన చర్మంలో కొలిజిన్‌ను దెబ్బతినడమే. అలాగే మెనోపాజ్‌ (నెలసరి ఆగిపోయే సమయం) దశలో ఈస్ట్రోజెన్‌ స్థాయిలు  తగ్గిపోతాయి. కళ్ళ కింద చర్మం జారి తిత్తులుగా కనిపిస్తాయి. కాస్మెటిక్‌ చికిత్స అంటే బొటాక్స్‌, ఫిల్లర్స్‌, స్కిన్‌ లేజర్‌ ద్వారా ఆ ముడతలను తీర్చిదిద్దుతారు. దీంతో ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనపడవు.
– రాంగోపాల్‌