20-09-2017: వయసు మీరిన పెద్ద వాళ్లు ఇంట్లో ఉంటే వాళ్లని సౌకర్యంగా ఉంచాలి. సురక్షితంగా చూసుకోవాలి. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే... వాళ్లు అన్ని రకాలుగా సేఫ్జోన్లో ఉన్నట్టు భావిస్తారు.
బరువు తక్కువ ఉన్న చిన్న జగ్ నిండా నీళ్లు నింపి అందుబాటులో ఉంచాలి. నీళ్లు తరచుగా తాగుతుండమని చెప్పాలి వాళ్లకు. శరీరానికి సరిపడా నీటిని అందించడం వల్ల తలనొప్పులు, నిద్రలేమి, ఆకలి మందగించడం వంటి ఇబ్బందులు ఎదురు కావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మంచి నీళ్లు సరిపడా తాగితే బోలెడు అనారోగ్యాల్ని దరిచేరనీయకుండా జాగ్రత్తపడొచ్చు.
ఇంట్లో ఎక్కడపడితే అక్కడ అద్దాలు ఉంచొద్దు. ఆ అద్దాలు చూసి పెద్దవాళ్లు తికమక పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు వాళ్ల ప్రతిబింబాన్ని వాళ్లే గుర్తించలేని స్థితిలో ఉంటారు. అద్దం ముందు నడిచినప్పుడు కూడా గందరగోళ పడతారు. ఒకవేళ అద్దాలు పెట్టడం తప్పదంటే చిన్న అద్దాల్ని గోడల మీద కాస్త ఎత్తులో అమర్చాలి.
ఫోన్, రిమోట్ డయల్, నెంబర్ ప్యాడ్ల మీద అంకెలు, అక్షరాలు పెద్ద సైజులో ఉండాలి. ఇంట్లో డిజిటల్ క్లాక్స్ ఉంచాలి. సంప్రదాయ గడియారాల్లో కంటే డిజిటల్ క్లాక్స్‌లో చదవడం సులభంగా ఉంటుంది.
ఇక వాళ్లు వేసుకునే దుస్తుల రంగుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. నలుపు, లేత గోధుమరంగు, తెలుపు, క్రీం, ఆకుపచ్చ రంగులవి దస్తులు అయితే వాళ్ల బట్టల్ని వాళ్లు సులభంగా తీసుకోగలుగుతారు. వార్డ్‌రోబ్‌లో షర్ట్స్ అన్నీ ఒక పక్కకి, ప్యాంట్లు, షార్ట్స్, లుంగీలు మరో పక్కకి సర్దాలి. అలాగే చీరలు, స్కర్ట్స్ వంటివి ఒక పక్కన, బ్లౌజ్‌లు, కుర్తా టాప్స్ మరో పక్కన సర్దాలి. వాడని బట్టలు వార్డ్ రోబ్ నుంచి తీసేయాలి.
ఈ జాగ్రత్తలన్నింటితో పాటు ఇంట్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో వాళ్లని కూడా భాగస్వాములు చేయాలి. ఇలా చేయడం వల్ల వయసు మీద పడటంతో తమకి ప్రాధాన్యత తగ్గింది అనే భావన వాళ్లలో తలెత్తదు. మరో ముఖ్యమైన విషయం వాళ్ల ముందు ఎక్కువ చాయి్సలు ఉంచితే ఎంపిక చేసుకోవడంలో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే వాళ్లకి నచ్చే వాటినుండి కొన్ని చాయి్సలు ముందుపెట్టాలి. వాటి నుంచి ఎంపిక చేసుకోమని చెప్పాలి.