మలివయసులోనూ ఆరోగ్యంగా!

25-06-2019: మధ్య వయసు దాకా అందరూ ఆరోగ్యంగానే ఉంటారు. అసలు సమస్య అంతా వృద్థాప్యంతోనే! వృద్దాప్యంలో వివిధ కారణాలతో కొందరి కేంద్ర నాడీ వ్యవస్థ (మెదడు)లో వాపు ఏర్పడుతూ ఉంటుంది. వాపు వల్ల మెదడు పనితనం కూడా తగ్గుతుంది. జ్ఞాపకశక్తి తగ్గడం అనేది ప్రధాన సమస్య. శరీరంలోని వివిధ భాగాలకు ఆదేశాలను అందించవలసిన విషయాల్లో అశక్తంగా ఉండిపోతుంది. దీని వల్ల వృత్తిపరంగా మందకొడితనంతో పాటు జీవక్రియలన్నీ కుంటుపడతాయి.
 
అయితే, అందుకు విరుగుడుగా మెదడును శక్తివంతంగా ఉంచే పోషక పదార్థాలన్నీ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ తీసుకున్న వాటిలోని పోషకాలను గ్రహించేందుకు జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండేలా కూడా చూసుకోవాలి. ఈ రెండూ చేయగలిగితే, వృద్ధాప్యం కూడా ఆనందంగా, ఆరోగ్యంగానే సాగిసోతుంది. ఈ విషయంలో పరిశోధన చేసిన రాడ్నీ జాన్సన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొన్ని కొత్తవిషయాలను కనుగొన్నారు.
 
పీచుపదార్థం సరిపడా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుడు జాతి గింజలు తరచూ తినాల్సిన అవసరాన్ని గుర్తించారు. వీటన్నింటిలోనూ వృద్దాప్యంలో వచ్చే మెదడులోని వాపును నియంత్రించే శక్తి ఉందని వారు కనుగొన్నారు. పీచుపదార్థానికి, జీర్ణాశయంలోని గ్రహణిలో మంచి బ్యాక్టీరియాను పెంచే శక్తి కూడా ఉంది.
 
ఈ బ్యాక్టీరియా విడుదల చేసే కొన్ని రసాయనాలకు వాపును హరించే గుణం ఉంది. వాపును నియంత్రిచడంతో పాటు జ్ఞాపక శక్తిని పెంచే మూలాలు కూడా వాటిల్లో ఉన్నాయి. దీనికి తోడు వృద్దాప్యంలో వచ్చే అల్జీమర్‌ వ్యాధిని అడ్డుకునే శక్తి కూడా ఈ ఆహార పదార్థాల్లో ఉంది. అన్ని దశల్లోనూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నంత మాత్రాన సరిపోదు కదా! అందుకు తగ్గట్టే అవసరమైన ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలి.
 
మెదడులో వాపు వల్ల దాని పనితనం తగ్గుతుంది. శరీరంలోని వివిధ భాగాలకు ఆదేశాలను అందించడంలో అశక్తంగా ఉండిపోతుంది. దీని వల్ల వృత్తి పరంగా మందకొడితనంతో పాటు జీవక్రియలన్నీ కుంటుపడతాయి.