వయసు మీద పడుతోందా?

ఆంధ్రజ్యోతి, 12/09/2015: దేనినైనా అడ్డుకోవచ్చు కాని.. వయసుకు బ్రేకులు వేయడం చాలా కష్టం. అయితే.. అత్యంత వేగంగా సమీపించే వయసును కొంత వరకు నిలువరించవచ్చు. అందుకోసం కొన్ని మంచి అలవాట్లు అనుసరిస్తే సరి..
 
 
  • రోజు ఎనిమిది నుంచి పది గ్లాసులు మంచినీళ్లు తాగితే.. శరీరం డీహైడ్రేట్‌ అవ్వదు. దీనివల్ల త్వరగా అలసిపోరు. తద్వార వయసుతో పాటు వచ్చే సమస్యలు తగ్గుతాయి.
  • శరీరంలోని మలినాలు ఎప్పటికప్పుడు తొలగిపోవాలంటే కొబ్బరి నీళ్లు అత్యంత శ్రేయస్కరం. తరచూ పేరుకుపోయే టాక్సిన్స్‌ వదిలితే ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
  • చాలామంది ‘సంతృప్తిగా భోజనం చేశాం కదా ఇంకేమీ అవసరం ఉండదు’ అనుకుంటారు. ఇది కరెక్ట్‌ కాదు. శరీరానికి సమతుల్య ఆహారం అవసరం. కార్బోహైడ్రేడ్లు, మినరల్స్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ ఆసిడ్లు వంటివన్నీ కావాలి. అందుకని మాంసం, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుదినుసులు, త్రుణధాన్యాలు తప్పక తినాలి.
  • వయసు అంత త్వరగా దరి చేరకుండా కాపాడుకోవడానికి విటమిన్‌ డి ముఖ్యం. శరీరానికి ఎండ తగలాలి. ఎండవల్ల చర్మం ముడుతలు పడదు. స్కిన్‌ క్యాన్సర్లు దరిచేరవు.
  • ఎడతెరపి లేకుండా అలసిపోవడం అంటే.. వయసును వేగంగా ఆహ్వానించడమేనన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మీ ముఖం, శరీరం చూస్తేనే ఎంతగా అలసిపోతున్నారో అర్థం అవుతుంది. అలసట భావన ఉంటే.. వెంటనే విశ్రాంతి తీసుకోండి. కంటినిండా నిద్రపోండి. రీఛార్జి అవ్వకపోతే వయసు తరుముతూ వస్తుంది.
  • శరీరానికి మసాజ్‌ తప్పనిసరి. తల దగ్గరి నుంచి అరికాళ్ల వరకు చక్కటి మసాజ్‌ చేయించుకుంటే.. రక్తప్రసరణ స్వేచ్ఛగా సాగుతుంది. శరీర అవయవాలకు కావాల్సినంత ఆక్సిజన్‌ లభిస్తుంది. దీనివల్ల వయసుకు బ్రేకులు వేయొచ్చు.
  • వయసు మీద పడకుండా కాపాడే వాటిలో ప్రధానమైనది- వ్యాయామం. బాడీని ఫిట్‌గా ఉంచడంలో దీన్ని మించిన ఔషధం మరొకటి ఉండదు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు నడక, జిమ్‌, ఇంటిపని, ఆటలు వంటి వాటిలో పాల్గొంటే ప్రయోజనం ఉంటుంది.
  • ఇవన్నీ పాటిస్తూనే.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. జీవనశైలి ప్రణాళికాబద్ధంగా సాగిపోతున్నంత కాలం ఏ ఇబ్బందీ రాదు. వ్యసనాలకు దూరంగా ఉండాలి. మితిమీరిన తిండి తినటం మానుకోవాలి. అవసరమైనంతే తినాలి.
 
యాంటీ ఏజింగ్‌ టిప్‌
ఫ్రిజ్‌లో పెట్టుకున్న పచ్చిపాలు ఒక కప్పులోకి పోసుకోవాలి. తెల్లటి పొడిగుడ్డను పాలలో ముంచి రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచాలి. గుడ్డను కొద్దిగా పిండాలి. నీటితో శుభ్రం చేసుకున్న ముఖం మీద పాలలో ముంచిన గుడ్డను వేసుకోవాలి. పది నిమిషాలు అలాగే ఉంచాలి. రోజూ ఈ చిట్కాను పాటిస్తే.. ముఖపర్చస్సు పెరుగుతుంది. ముఖ చర్మం మరింత సున్నితంగాను, బిగుతుగాను మారుతుంది. ఎందుకంటే పాలలో ప్రొటీన్లు, కొవ్వులు, అమినో ఆసిడ్స్‌, విటమిన్‌ ఎ ఉంటాయి. ఇందులోని లాక్టిక్‌ యాసిడ్‌ చర్మం లోతుల్లోకి వెళ్లి మలినాలను తొలగిస్తుంది.