మెదడు క్షీణిస్తే.. డిమెన్షియా

07/07/15

వృద్ధుల్లో మతిమరుపు సహజమే అని సరిపెట్టుకుంటాం. కానీ కుటుంబ సభ్యులనే గుర్తుపట్టలేనంత మతిమరుపొస్తే ఆ పరిస్థితిని తీవ్రంగానే పరిగణించాలి. మెదడు క్షీణతకు సంకేతాలైన ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్య చికిత్సనందిస్తే వృద్ధుల జీవితం మెరుగవుతుందంటున్నారు కన్సల్టెంట్‌ న్యూరో ఫిజీషియన్‌ డాక్టర్‌. జయదీప్‌ రే చౌదరి.
ఓ బామ్మ తన చిన్ననాటి సంగతులను మనవళ్లకు కళ్లకుకట్టినట్టు చెబుతుంది. కానీ తన మనవళ్ల పేర్లేమిటో చెప్పమంటే మాత్రం గుర్తురావు. ఇది ఓ బామ్మ కథ! మరో ఇంట్లో ఓ తాతయ్య తన కుటుంబ సభ్యులందరినీ పరాయివాళ్లుగా భావిస్తూ ఉంటాడు. ఇలాంటి వృద్ధులు మనకు కొన్ని కుటుంబాల్లో కనిపిస్తూ ఉంటారు. వయసైపోయింది.. అందుకే ఙ్ఞాపకశక్తి తగ్గిపోయింది. ఏం చేస్తాం? అంటూ వాళ్ల మతిమరుపుని సానుభూతితో భరిస్తుంటాం. కానీ ఇలాంటి వృద్ధులకు కావాల్సింది సానుభూతి కాదు. తక్షణ వైద్యం. పెరిగే వయసుతోపాటు ఙ్ఞాపకశక్తి తగ్గే మాట నిజమే అయినా సాధారణ జీవితాన్ని గడపలేనంతగా మతిమరుపు బాధిస్తుంటే.. దాన్ని డిమెన్షియాగా భావించాలి. మతిమరుపు ప్రధాన లక్షణంగా వృద్ధులను బాధించే డిమెన్షియాకు ఎన్నో కారణాలున్నాయి. అయితే ఈ రుగ్మతను ప్రారంభదశలోనే గుర్తించి తగిన చికిత్సతో మూల కారణాన్ని సరిదిద్దగలిగితే మతిమరుపును నయం చేయవచ్చు. 
 మతిమరుపు ఓ సంకేతం..
వయసు పెరిగేకొద్దీ మెదడు కణాలైన న్యూరాన్ల సంఖ్య తగ్గుతుంది. వాటి మధ్య సమాచార ప్రసారం మందగిస్తుంది. ఈ స్థితి 60 - 65 ఏళ్ల వయసు నుంచే మొదలవుతుంది. కాబట్టే ఈ వయసు పెద్దల్లో మతిమరుపు లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అలాగే పెరిగే వయసుతో సమానంగా విషపూరిత రసాయనాలు మెదడు కణాలమీదే పేరుకుంటూ ఉంటాయి. ఈ టాక్సిక్‌ కెమికల్స్‌ బయటి నుంచి వచ్చినవి కావు. మన శరీరంలో ఉండే ప్రొటీన్లే. వయసు పైబడటం, ఒత్తిడి, ఇతర అనారోగ్యాలు, వాతావరణ మార్పుల ఫలితంగా ఈ ప్రొటీన్లు అసహజ ప్రొటీన్లుగా మారి మెదడు కణాల మీద డిపాజిట్‌ అవుతాయి. ఇవి మెదడు కణాలను క్రమేపీ నిర్వీర్యం చేస్తాయి. ఎక్కువ శాతం మెదడు కణాల క్షీణత ఈ అబ్‌నార్మల్‌ ప్రొటీన్‌ కారణంగానే జరుగుతుంటుంది. మెదడు క్షీణత మరింత ముదిరిపోకుండా నియంత్రించగల వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్షీణించిన ఙ్ఞాపకశక్తిని పునరుద్ధరించలేకపోయినా మెదడులోని న్యూరాన్లు మరింత తగ్గిపోకుండా ఆపే వీలుంది. ఈ దశను నిర్లక్ష్యం చేసి వృద్ధులను అలాగే వదిలేస్తే వాళ్ల మెదడు పూర్తిగా క్షీణించి మిగతా శరీర అవయవాలు, జీవక్రియల మీద కూడా నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది.
 మెదడు క్షీణత వ్యాధులు..
మతిమరుపును వైద్య పరిభాషలో ‘డిమెన్షియా’ అంటారు. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, దెబ్బలు కారణంగా నిర్ణయాలు తీసుకోవడానికి, ఆలోచించడానికి, ఙ్ఞాపకం పెట్టుకోవడానికి, మాట్లాడటానికి తోడ్పడే మెదడులోని ప్రదేశాలు దెబ్బతింటే డిమెన్షియా తలెత్తుతుంది. అధిక శాతం డిమెన్షియా తలెత్తడానికి ప్రధానమైన వ్యాధి ‘అల్జీమర్స్‌’. డిమెన్షియా సంబంధిత వ్యాధుల్లో 50 శాతం ఈ కోవకు చెందినవే! డిమెన్షియా లక్షణాలు స్వల్ప మతిమరుపుతో మొదలై క్రమేపీ తీవ్రమవుతాయి. సాధారణంగా కొద్ది సమయం ముందు జరిగిన సంభాషణలు, వ్యక్తుల పేర్లు గుర్తు తెచ్చుకోలేకపోవడంలో ఇబ్బందితో ఈ వ్యాధి మొదలవుతుంది. క్రమంగా మాట్లాడటంలో, నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు, ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు, నడవడానికి, పదార్థాలు మింగటానికి ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది. ఈ లక్షణాల తీవ్రత, తేడాలను బట్టి డిమెన్షియా కారక వ్యాధులను పలు రకాలుగా వర్గీకరించవచ్చు. 
న్యూరాన్ల క్షీణత వల్ల..: అల్జీమర్స్‌, పార్కిన్సన్‌, హంటింగ్టన్‌ డిసీజ్‌, కొన్ని రకాల మల్టిపుల్‌ స్క్లిరోసి్‌సలు.
నాడీ సంబంధ రుగ్మతల వల్ల: పదే పదే పక్షవాతం వచ్చి మెదడులో రక్త ప్రసారం ఆగిపోయి మెదడు పూర్తిగా క్షీణించి పనిచేయకుండా పోయే మల్టి ఇన్‌ఫార్క్‌ట్‌ డిమెన్షియా.
ప్రమాదాల ఫలితంగా: ప్రమాదంలో తల ముందు భాగానికి దెబ్బ తగలటం మూలంగా వచ్చే ఫ్రాంటోటెంపొరల్‌ డిమెన్షియా.
నాడీ వ్యవస్థ ఇన్‌ఫెక్షన్లకు గురైనపుడు.: మెనింగ్జయిటిస్‌, హెచ్‌ఐవి.
మెదడులో చోటుచేసుకునే మార్పుల వల్ల: మెదడులో నీరు చేరుకోవటం, బ్రెయిన్‌ ట్యూమర్లు.
మెటబాలిక్‌ డిజార్డర్ల కారణంగా..: హైపోథైరాయిడ్‌, హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర తగ్గటం), విటమిన్‌ బి12 లోపం.
మిక్స్‌డ్‌ డిమెన్షియా: కొన్ని సందర్భాల్లో ఒకే వ్యక్తిలో రెండు రకాల డిమెన్షియాలు కలిసి కూడా ఉండొచ్చు.
  ఏదీ అంతగా జ్ఞాపకం ఉండదు..
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు కూడా మతిమరుపు లక్షణం ఉంటుంది. అయితే అది తాత్కాలికమే! కొద్ది సేపటికి ప్రయత్నపూర్వకంగా గుర్తు తెచ్చుకోగలుగుతారు. కానీ డిమెన్షియా రోగుల్లో మతిమరుపు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సంవత్సరాల తరబడి ఉంటున్న ఇంట్లో బాత్‌రూమ్‌ ఎక్కడుందో మర్చిపోతారు. ఆ ప్రదేశానికి సంబంధించిన ఙ్ఞాపకం వాళ్ల మెదడులో చెరిగిపోవటమే ఇందుకు కారణం. డిమెన్షియా రోగుల చేత ఇష్టం లేని పని చేయిస్తే వాళ్లు తేలికగా భావోద్వేగానికి లోనవుతారు లేదా విపరీతమైన కోపం తెచ్చుకుంటారు. 
 డిమెన్షియా డయాగ్నసిస్‌
మతిమరుపు లక్షణాలను తొలి దశలోనే గుర్తిస్తే వ్యాధిని నియంత్రించవచ్చు. ఈ వ్యాధి తీవ్రత, రకాన్ని గుర్తించడం కోసం వైద్యులు కొన్ని పరీక్షలను సూచిస్తారు. అవి..
 ముందుగా రోగులు, వారి కుటుంబ సభ్యుల ద్వారా వీలైనంత సమాచారాన్ని సేకరిస్తారు.
విటమిన్‌ బి12, థైరాయిడ్‌ లోపాలు, మధుమేహం, పక్షవాతం, మెదడులో రక్తం గడ్డలు, ట్యూమర్లు, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లను తెలుసుకోవటం కోసం రక్త పరీక్షలు, స్కానింగ్‌ను వైద్యులు సూచిస్తారు.
మెమొరీ క్లినిక్‌లో మెమొరీ ఇవాల్యుయేషన్‌ పరీక్ష (ఙ్ఞాపకశక్తి సామర్ధ్యాన్ని అంచనా వేయటం కోసం కొన్ని ప్రశ్నలతో కూడిన పరీక్ష ఇది). ఈ పరీక్ష రిపోర్ట్‌ ఆధారంగా మతిమరుపు స్థాయి తెలుసుకుంటారు.
ఎంతో ఆప్యాయంగా మెలగాలి..
డిమెన్షియా రోగులకు నోటి మందులతోపాటు స్కిన్‌ ప్యాచెస్‌ కూడా ఇస్తారు. వీటితోపాటు ఫన్‌క్షనల్‌ రిహాబిలిటేషన్‌ ఎంతో అవసరం. డిమెన్షియాకు మూల కారణాన్ని సరిదిద్దే వీలుంటే మందులు లేదా సర్జరీతో పరిస్థితి చక్కబడవచ్చు. అయితే సరిదిద్దలేని వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల కారణంగా వచ్చిన డిమెన్షియాను పూర్తిగా నయం చేయడం కష్టం. ఈ రకం డిమెన్షియాలకు అందించే చికిత్స వల్ల మెదడు క్షీణతను పూర్తిగా సరిదిద్దలేం. డిమెన్షియా నియంత్రణకు ఫన్‌క్షనల్‌ రిహాబిలిటేషన్‌ ప్రధానమైనది. అంటే.. డిమెన్షియా వృద్ధులతో ఎక్కువగా మాట్లాడాలి. వాళ్ల ఆసక్తిని బట్టి ఆటల్లో పాల్గొనేలా చేయాలి. వారితో ఆప్యాయంగా మెలగాలి. వారితో సహనంగా మసలుకోవాలి. ఇలాంటి వాతావరణం ఇంట్లో లోపిస్తే ఈ వ్యాధిగ్రస్తులు మరింత ఇరిటేట్‌ అయిపోతారు. 
అభిరుచే అసలైన ఔషధం

డిమెన్షియా వృద్ధుల్లోనే రావాలని లేదు. 40 ఏళ్ల వయస్కులు కూడా డిమెన్షియా బారిన పడొచ్చు. కాబట్టి నడి వయసు నుంచే క్రమం తప్పక వ్యాయామం చేయాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మెదడులోని వేర్వేరు ప్రదేశాలను ప్రేరేపించి మెదడు చురుకుదనం పెంచే కొత్త అలవాట్లకు జీవితంలో చోటు కల్పించాలి. మల్టిపుల్‌ హాబీలు.. అంటే పెయింటింగ్‌, రచనలు, పాడటం.. ఇలా ఎక్కువ అభిరుచులు కలిగినవాళ్లలో డిమెన్షియా చాలా లేటు వయసులో వస్తున్నట్టు పరిశోధనల ద్వారా నిరూపణ అయింది. కాబట్టి నడి వయసు నుంచే ఈ ప్రయత్నాలు మొదలుపెట్టాలి.

పెయింటింగ్‌, కుట్లు, అల్లికలు, సంగీతం నేర్చుకోవటం, పాటలు పాడటం, డాన్స్‌, వ్యాయామం.. ఇలా అంతకుముందు పరిచయం లేని కొత్త హాబీని ఏర్పరుచుకోవాలి.

కొత్త భాష నేర్చుకోవాలి. రెండు మూడు విభిన్న భాషల్లో మాట్లాడితే 60 ఏళ్ల వయసులో రావాల్సిన డిమెన్షియా ఐదేళ్లు లేటుగా 65 ఏళ్లలో వస్తున్నట్టు పరిశోధనలో తేలింది. 
మెదడును ప్రేరేపించే పజిల్స్‌, మేజె్‌సలాంటి మెమొరీ గేమ్స్‌ ఆడాలి
తరచుగా విహారయాత్రలకు వెళ్తుండాలి.
చేసే పని, తీసుకునే ఆహారం, నిద్ర సమంగా ఉండేలా చూసుకోవాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే డిమెన్షియాను లేటు వయసుకి నెట్టేయొచ్చు.
 
అల్జీమర్స్‌ కూడా అంతే.. 
మిగతా డిమెన్షియాలలోలాగే అల్జీమర్స్‌ డిసీజ్‌లో కూడా మెదడు కణాలు నిర్వీర్యం అవుతాయి. నాడీ సంబంధ రుగ్మత ఫలితంగా తలెత్తే అల్జీమర్స్‌లో కొద్ది కాల వ్యవధిలోనే మెడదు కణాలు వేగంగా క్షీణించి నశిస్తాయి. ఫలితంగా మెదడు కుంచించుకుపోయి న్యూరాన్లు, వాటి మధ్య కనెక్షన్లు కుదించుకుపోతాయి. 
లక్షణాలు : 
ఒకే ప్రశ్నను పదే పదే 
అడగటం లేదా చెప్పిందే పదే పదే చెప్పటం.
వ్యక్తిగత వస్తువులను, వాటిని ఉంచిన ప్రదేశాలను మర్చిపోవటం.
బాగా తెలిసిన దారులు, వ్యక్తులను మర్చిపోవటం.
మాట్లాడేటప్పుడు పదాల కోసం వెతుక్కోవటం.
చికిత్స: అల్జీమర్స్‌ వ్యాధికి చికిత్స లేదు. క్షీణించిన మెదడును తిరిగి సాధారణ స్థితికి తీసుకురాలేం కాబట్టి ఈ వ్యాధిగ్రస్తులు తమ రోజువారీ జీవితాన్ని మెరుగ్గా జీవించేందుకు తోడ్పడే చికిత్సను వైద్యులు అందించగలుగుతారు. వ్యాధి లక్షణాలను తగ్గించే మందులను సూచించటంతోపాటు సపోర్టివ్‌ గ్రూప్స్‌ లేదా సర్వీసె్‌సలో వ్యాధిగ్రస్తులను చేర్చటం, వృద్ధుల కోసం ఉద్దేశించిన అడల్ట్‌ డే కేర్‌లో ఉంచేలా రోగి కుటుంబ సభ్యులకు వైద్యులు సూచిస్తారు. అల్జీమర్స్‌ రోగులకు ఫంక్షనల్‌ రిహాబిలిటేషన్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి సెంటర్‌ ఫర్‌ ఎల్డర్లీ ఫంక్షనల్‌ రిహాబిలిటేషన్‌ క్లినిక్‌ను హైదరాబాద్‌ డెక్కన్‌ చాప్టర్‌ నడుపుతోంది.
 
 
డాక్టర్‌ జయదీప్‌ రే చౌదరి
కన్సల్టెంట్‌ న్యూరో ఫిజీషియన్‌
యశోద హాస్పిటల్స్‌
హైదరాబాద్‌.