బబుల్‌గమ్‌ తింటూ నడిస్తే...

06-06-2018: బబుల్‌గమ్‌ తినడం మంచిది కాదన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు అదే మంచిదంటున్నారు జపాన్‌ పరిశోధకులు. మామూలుగా నడవడం కన్నా బబుల్‌గమ్‌ తింటూ నడవడంవలన హార్ట్‌బీట్‌ మెరుగుపడడమే కాకుండా ఎక్కువ కాలరీలు ఖర్చు అవుతాయన్న విషయం వీరి అధ్యయనంలో తేలింది. 21 నుంచి 60సంవత్సరాల మధ్య వయస్సుగల కొంతమంది స్త్రీ పురుషులమీద వీరు అధ్యయనం చేశారు. వీరిలో కొందరికి బబుల్‌గమ్‌ ఇచ్చి పావుగంటపాటు నడవమన్నారు. మిగిలిన వారికి వేరే ఆహారపదార్థాలు ఇచ్చి తింటూ నడవమన్నారు. ఇలా కొన్నిరోజులు నడిచిన అనంతరం వీరి బరువును పరిశీలించగా బబుల్‌గమ్‌ తింటూ నడిచిన వారి బరువులో మార్పును గమనించారు. రెండవ గ్రూపు వారిలో ఎలాంటి మార్పును గమనించలేదు. బబుల్‌గమ్‌ తింటూ నడవడం వలన నడకలో వేగం పెరుగుతుందనీ, దీనివలన సుమారు మూడు నుంచి ఆరు క్యాలరీలు ఖర్చు అవుతాయని వీరు చెబుతున్నారు. ఈ ప్రయోజనం స్త్రీ పురుషులిద్దరిలో ఒకే విధంగా ఉంటుందని వారు అంటున్నారు.