జంక్‌ఫుడ్‌ ప్రియులు అమ్మాయిలేనట..

ఆంధ్రజ్యోతి, 09-04-2015: చిరుతిళ్లు తినే అలవాటు చాలామందిలో చూస్తుంటాం. ముఖ్యంగా టివి చూసేటప్పుడు లేదా సినిమా, క్రికెట్‌ మ్యాచ్‌ల్లాంటివి చూసేటప్పుడు చాలామంది విపరీతంగా జంక్‌ఫుడ్‌ తినేస్తుంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ అలవాటు యుక్తవయసులో ఉన్న అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తోందని ఒక స్టడీలో వెల్లడైంది. యుక్తవయసులో ఆరోగ్యకరమైన డైట్‌ తీసుకుంటే జంక్‌ఫుడ్‌పై దృష్టిపోదని ఈ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు హెల్దీ డైట్‌ తీసుకున్న మగవారిలో ఆడవాళ్లల్లో ఉన్నంతగా జంక్‌ఫుడ్‌ అలవాటు లేదని కూడా ఈ స్టడీలో తేలింది. అమ్మాయిలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కూడా వాళ్లల్లో చిరుతిళ్లు తినే అలవాటు ఎక్కువగానే ఉంటోందని కూడా తేలింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ఇంకొక విశేషమేమిటంటే గర్భిణి అయిన తొలి నాళ్లల్లో ఆడవాళ్లు జంక్‌ఫుడ్‌ తిన్నా ఆ ప్రభావం కడుపులోని బిడ్డపై అంత తీవ్రంగాపడదుట. కానీ నిండు చూలాలుగా ఉన్నప్పుడు జంక్‌ఫుడ్‌ తినడం వల్ల తల్లి కడుపులోని బిడ్డపై జంక్‌ఫుడ్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందిట. అందుకే బిడ్డను కనడానికి రెండు మూడు నెలల ముందు నుంచీ తల్లి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిది.