బరువు తగ్గకపోవడానికి కారణం ఏంటి?

08-07-2019: డాక్టర్‌! నా వయసు 28. ఈ మధ్యనే కొత్తగా ఉద్యోగంలో చేరాను. అయితే సాయంత్రం ఇంటికి చేరే సమయానికి నీరసం ఆవరిస్తోంది. ఉద్యోగంలో చేరకముందు వరకూ క్రమం తప్పక వ్యాయామం చేసేవాడిని. కానీ ఇప్పుడు వీలు పడడం లేదు. అయితే గత కొంతకాలంగా బరువు పెరుగుతున్నాను. థైరాయిడ్‌ పరీక్ష కూడా నార్మల్‌గా రావడంతో, ఆహారంలో మార్పులు చేసుకుని, నడక మొదలు పెట్టాను. అయినా పొట్ట, నడుము దగ్గర కొవ్వు పేరుకుపోతోంది. నేనిలా బరువు పెరగడానికి ఎక్కువ సమయంపాటు కూర్చుని చేసే ఉద్యోగం కారణమా? లేదంటే నాలో ఏదైనా హార్మోన్‌ లోపం ఉందా?
ఓ సోదరుడు, హైదరాబాద్‌.
వ్యాయామం చేస్తున్నా, ఆహార నియమాలు పాటిస్తున్నా పొట్ట, నడుములో కొవ్వు పేరుకుని, బరువు పెరగడానికి కారణం టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌లో తగ్గుదల కావచ్చు. అంతకుముందు వరకూ క్రమం తప్పక వ్యాయామం చేసి, హఠాత్తుగా సెడంటరీ లైఫ్‌ స్టయిల్‌కి అలవాటు పడడంతో శరీరంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. దాని ఫలితంగా మెటబాలిక్‌ రేట్‌ తగ్గి, శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇలా పెరిగిన శరీర బరువు వ్యాయామాల వల్ల, ఆహార నియమాలు పాటించడం వల్ల తగ్గకపోవచ్చు. థైరాయిడ్‌ పరీక్ష కూడా నార్మల్‌గా వచ్చింది కాబట్టి టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ పరీక్ష చేయించుకోండి. ఆ పరీక్షలో హార్మోన్‌ తగ్గినట్టు రుజువైతే నేరుగా టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్లు తీసుకోకుండా ప్రత్యామ్నాయ ఇంజెక్షన్లు ఎంచుకోండి. నేరుగా టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల స్పెర్మ్‌కౌంట్‌ తగ్గుతుంది. కాబట్టి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే, కచ్చితంగా ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లండి. టెస్టోస్టిరాన్‌ చికిత్సతో తిరిగి మెటబాలిక్‌ రేట్‌ వేగం పుంజుకుంటుంది. బరువు కూడా అదుపులోకి వస్తుంది.
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌,ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.8332850090 (కన్సల్టేషన్‌ కోసం)