జంపింగ్‌ రోప్‌తో బరువు తగ్గుతారు...

17-08-2019:జంపింగ్‌ రోప్‌ ఎక్సర్‌సైజ్‌తో కూడా బరువు తగ్గడం చాలా ఈజీ. శరీరం మొత్తానికి వ్యాయామం లభించే ఈ ఎక్సర్‌సైజ్‌తో తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలు కరిగించొచ్చు. చెప్పాలంటే జంపింగ్‌ రోప్‌ వర్కవుట్‌తో హెల్తీ డే మొదలైనట్టే...

జంపింగ్‌ రోప్‌ చేస్తే నిమిషానికి 10 క్యాలరీల చొప్పున ఖర్చవుతాయి. అయితే ఇది వారి బరువు, వయసు, జీవక్రియ రేటు మీద ఆధారపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, జంపింగ్‌ రోప్‌ చేస్తే ఫలితం ఉంటుంది.
 
గుండె కొట్టుకొనే వేగాన్ని పెంచుతుంది. రోజు ఈ వ్యాయామం చేస్తే గుండె దృఢంగా మారుతుంది. గుండెపోటు, ఇతర గుండె సంబంధ వ్యాధుల ముప్పు తప్పుతుంది.
 
డైటింగ్‌ పాటించకుండానే తాడాటతో పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగించొచ్చు. ఈ వ్యాయామంతో భుజాలు, కాళ్లు బలిష్ఠంగా మారతాయి. రోజు జంపింగ్‌ రోప్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తే, బాడీ బ్యాలెన్స్‌, సమన్వయం మెరుగుపడుతుంది.