గొడవపడ్డారంటే లావైపోతారు!

ఆంధ్రజ్యోతి, 20-08-2015: భార్యాభర్తలిద్దరూ స్లిమ్‌ అండ్‌ ట్రిమ్‌గా ఉండాలనుకుంటున్నారా... వ్యాయామాలు ఎంత చేసినా అది సాధ్యం కావడంలేదా... అయితే మీ ఇద్దరికీ సరిపడకపోవడమే కారణం అంటున్నారు పరిశోధకులు. లావుకి, భార్యాభర్తల గొడవలకి మధ్య సంబంధం ఉందనేది ఒహియో విశ్వవిద్యాలయం పరిశోధనా ఫలితం. ‘‘దంపతుల మధ్య గొడవలకు... ఎపిటైట్‌ అంటే ఆకలికి సంబంధించిన హార్మోన్‌కు సంబంధం ఉంది. ఆ హార్మోన్‌ వల్లే గొడవలు పడిన జంటకు జంక్‌ఫుడ్‌ తినాలన్న కోరిక కలిగి ఎక్కువగా తినేస్తుంటార’’ని చెప్పారు ఈ పరిశోధనకు నేపథ్యం వహించిన లిసా జరెమ్కా. మొత్తంమీద వైవాహిక బంధంలోని ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మధ్య సంబంధం ఉందన్నమాట. పరిశోధన గురించి వివరిస్తూ ‘‘ఇందులో పాల్గొన్న జంటలకు ప్రత్యేకంగా ఒక ప్రశ్నావళిని రూపొందించాం. రక్తం, లాలాజలం శాంపిల్స్‌ను పరీక్షించాం. ఒత్తిడికి సంబంధించిన హార్మోన్‌ స్థాయి, వ్యాధినిరోధక కణాల సంఖ్య ఏ స్థాయిలో ఉన్నాయో గమనించాం. గొడవపడినప్పుడే కాకుండా గొడవల నుంచి బయటపడ్డాక కూడా ఎక్కువ కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న ఆహారపదార్థాలను తింటున్నారు. వాదులాటల వల్లే ఆకలి పుడుతుంది అని కరెక్టుగా చెప్పలేం కాని ఆ రెండింటికీ మధ్య మాత్రం బలమైన సంబంధం ఉంది’’ అంటున్నారు వాళ్లు. గొడవలు పడి లావెక్కాక... స్లిమ్‌ అవ్వాలని జిమ్‌ల చుట్టూ తిరిగే బదులు గొడవపడడం మానేస్తే సరిపోతుంది కదా. ఇల్లు, వళ్లు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటాయి.