బరువు తగ్గేందుకు ఓ ఛాలెంజ్‌!

ఆంధ్రజ్యోతి (11-11-2019): ‘ఫిట్‌గా కనిపించాలనే మీ ప్రయత్నానికి తోటివారి ప్రోత్సాహం కూడా తోడైతే కొద్ది రోజుల్లోనే ఫిట్‌నెస్‌ గోల్‌ సాధించవచ్చు’ అంటున్నారు టీవీ నటి, సెలబ్రిటీ చెఫ్‌ అమృతా రాయ్‌చంద్‌. బరువు తగ్గి తీరైన ఆకృతి సొంతం కావాలంటే తేలికైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా వర్కవుట్స్‌ చేయడం చాలా ముఖ్యం అంటున్నారామె. ఒక నెలలో నాలుగు కిలోల బరువు తగ్గాలనే లక్ష్యంతో డైటీషియన్‌ సూచనలతో నాలుగు వారాల ఛాలెంజ్‌ (4 వీక్స్‌ ఛాలెంజ్‌) పాటిస్తున్నారు అమృత. తాను ఫాలో అవ్వడమే కాకుండా అందర్నీ ఈ ఛాలెంజ్‌ తీసుకోమని చెబుతున్నారు కూడా. ఇంతకీ నాలుగు వారాల ఛాలెంజ్‌ డైట్‌ ఏమిటంటే...

 
ఉదయం: పొద్దున్నే షుగర్‌తో కూడిన టీ, కాఫీ జోలికి వెళ్లకూడదు. ఏదైనా పండు లేదా కొబ్బరి నీళ్లు లేదంటే కొన్ని నట్స్‌ తీసుకోవాలి.
 
బ్రేక్‌ఫాస్ట్‌: గుడ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, బ్రెడ్డు తినాలి. లేదంటే చిరుధాన్యాలతో చేసిన చపాతీ లేదా అటుకుల ఉప్మా లేదా కొబ్బరి చట్నీతో ఇడ్లీలు, దోసె వంటివి అల్పాహారంలో ఉండేలా చూసుకోవాలి.
 
లంచ్‌, డిన్నర్‌: చపాతీలు, అన్నం లేదా దోసె తినాలి. అయితే ఎక్కువ మోతాదులో కూరగాయలు, పప్పు, పనీర్‌, చికెన్‌ సలాడ్‌, మజ్జిగ లేదా యోగర్ట్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి.
 

స్నాక్స్‌: సెనగలు, పండ్లు, పచ్చి బఠాణి లేదంటే ఇంటి వద్ద చిరుధాన్యాలతో తయారుచేసిన చిక్కీలు తినాలి.

ఈ డైట్‌ ప్లాన్‌తో పాటు నాలుగు వారాల ప్రత్యేక ఫిట్‌నెస్‌ షెడ్యూల్‌ ఫాలో అవుతున్నారు అమృత. సోమవారం, గురువారం హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌. మంగళవారం, శుక్రవారం రన్నింగ్‌. బుధవారం, శనివారం సైక్లింగ్‌ చేస్తున్నారు. ఆదివారం రిలాక్స్‌ అవుతూ మసాజ్‌, స్విమ్మింగ్‌ చేస్తూ ఉంటారు. గుండె కండరాలు దృఢంగా ఉండేందుకు, క్యాలరీలు కరిగేందుకు ఈ వర్కవుట్స్‌ ఎంతగానో తోడ్పడతాయంటున్నారీ సెలబ్రిటీ చెఫ్‌. బరువు తగ్గాలనుకునేవారు ఎంచక్కా ఈ ఛాలెంజ్‌ను ఫాలో అవ్వొచ్చు.